Epass website
-
నత్తనడకన ఉపకార దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు అమలు చేస్తున్న ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియకు స్పందన కరువైంది. ఈ పథకాల కింద దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కనీసం పావువంతు మంది విద్యార్థులు కూడా ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదని తెలుస్తోంది. కోర్సు పూర్తయ్యే వరకు విద్యార్థులు ఏటా క్రమం తప్పకుండా ఈ దరఖాస్తులు సమర్పించడం తప్పనిసరి.. కాలేజీ యాజమాన్యం సైతం చొరవ తీసుకుని ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేయించాలి. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి 12.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. కానీ ఇప్పటివరకు 2.5 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అధికారిక అంచనాతో పోలిస్తే 20 శాతం మాత్రమే దరఖాస్తులు సమర్పించడం గమనార్హం. వచ్చే నెలాఖరుతో ముగియనున్న గడువు..: ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ నెలాఖరుతో ముగియనుంది. దరఖాస్తు ప్రారంభ సమయంలోనే నాలుగు నెలల పాటు గడువు ఇవ్వనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. ఈమేరకు కాలేజీ యాజమాన్యాలకు సర్క్యులర్లు సైతం జారీ చేసింది. విద్యార్థులు ఈపాస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చొరవ తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాలకు సూచించింది. కానీ క్షేత్రస్థాయిలో కాలేజీ యాజమాన్యాలు కనీసం పట్టించుకోవడం లేదు. ఒక విద్యార్థి కోర్సు ముగిసే వరకు ప్రతి సంవత్సరం ఈపాస్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొత్తగా కోర్సులో చేరే విద్యార్థి ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తుకు సంబంధించిన వివరాలను సమర్పించాలి. ఇప్పటికే కోర్సులో చేరి తదుపరి సంవత్సరం చదివే విద్యార్థి రెన్యువల్ కేటగిరీలో దరఖాస్తు సమర్పించాలి. విద్యార్థి వివరాలు కాలేజీ యాజమాన్యం వద్ద అందుబాటులో ఉండడంతో యాజమాన్యమే ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని నియమించి దరఖాస్తు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవచ్చు. కానీ యాజమాన్యాలు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో దరఖాస్తు ప్రక్రి య నెమ్మదిగా సాగుతోంది. గతేడాది దరఖాస్తు ప్రక్రియను దాదాపు ఏడు నెలల పాటు కొనసాగించారు. గడువు ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘా ల కోరిక మేరకు ప్రభుత్వం గత ఏడాది మూడు సార్లు గడువును పొడిగించింది. కానీ ఈ ఏడాది పొడిగింపు ప్రక్రియ ఉండదని, నిర్దేశించిన సమయానికి దరఖాస్తు సమర్పించాలని సూచించినప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మరో నెలన్నరలో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను గడువులోగా పూర్తి చే యాలంటూ తాజాగా జిల్లాస్థాయిలో సంక్షేమ శాఖల అధికారులు కాలేజీ యాజమాన్యాలకు నోటీసులు ఇస్తున్నారు. -
‘దోస్త్’తో ఈపాస్ లింక్..!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలును సులభతరం చేయాలని, పాత పద్ధతిలో దరఖాస్తు పూరించడం, వివరాలు ఎంట్రీ చేయడంలాంటి పనులకు ఇకపై చెక్ పెట్టాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. అందులో భాగంగా దోస్త్ వెబ్‌సైట్‌ను ఈ పాస్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయనున్నారు. ఇప్పటికే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేస్తున్నారు. సీటు వచ్చిన కాలేజీ వివరాలు, ఏ కోటాలో సీటు వచ్చింది, విద్యార్థి కులం, కోర్సు, ఫీజు తదితర వివరాలన్నీ ఇందులోనే ఉంటాయి. ఈ వివరాల ఆధారంగా ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు అమలు చేయవచ్చు. ఇందుకు దోస్త్ వెబ్‌సైట్‌ను ఈపాస్ వెబ్‌సైట్‌తో అనుసంధానం చేయాలని సంక్షేమ శాఖలు చర్యలు వేగవంతం చేశాయి. కౌన్సెలింగ్ నాటికి పూర్తి... లాక్డౌన్ కారణంగా ఇంటర్మీడియెట్ ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఫలితాలు వచ్చిన వెంటనే డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడనుంది. కౌన్సెలింగ్ తేదీలు ప్రారంభమయ్యే నాటికి ఈ వెబ్సైట్ల అనుసంధానం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)తో సంక్షేమ శాఖలు పలుమార్లు చర్చలు జరిపి వెబ్సైట్ అనుసంధానంపై పలు సూచనలు చేశాయి. ఇటీవల ఈపాస్ వెబ్‌సైట్‌ను సైతం అప్డేట్ చేయడంతో లాగిన్ పేజీలో ఆప్షన్లు పెరిగాయి. తాజాగా దోస్త్ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేస్తే డిగ్రీ చదివే విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం కొత్తగా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. దోస్త్ లింక్ ద్వారా ఈపాస్ పేజీ తెరిస్తే దాదాపు అన్ని వివరాలు అందులో ప్రత్యక్షమవుతాయి. అందులో పొరపాట్లు ఉంటే సరిచేయడం, అదనపు సమాచారాన్ని ఎంట్రీ చేసే వీలుంటుంది. -
ఈ–పాస్‌లో మార్పులు.. త్వరలో బిల్లుల చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: గత(2019–20) వార్షిక సంవత్సరం చివరి రోజుల్లో లాక్డౌన్ కారణంగా రద్దయిన బిల్లులకు మోక్షం కల్పించేందుకు సంక్షేమ శాఖలు ఉపక్రమించాయి. సాంకేతిక సమస్యలను అధిగమిస్తూ వాటిని తిరిగి ఖజానా శాఖకు సమర్పించేలా చర్యలు చేపట్టాయి. ఈమేరకు ఈ–పాస్ వెబ్సైట్లో మార్పులు చేసేందుకు సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)కు సూచనలు చేశాయి. 2019–20 వార్షిక సంవత్సరం చివరి పది రోజులు లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు స్తంభించిపోయాయి.దీంతో కీలకమైన పథకాలకు చెందిన బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా వార్షిక సంవత్సరం ముగియడంతో మునుపటి ఏడాది బిల్లులు చెల్లింపులకు సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో ఖజానా విభాగం అధికారులు తిరిగి పంపిస్తున్నారు. సంక్షేమ శాఖలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ముంట్, కళ్యాణలక్ష్మి పథకాలకు చెందిన దాదాపు రూ.350 కోట్ల విలువైన బిల్లులు వెనక్కు వచ్చాయి. వార్షిక సంవత్సరం ముగియడంతో వాటిని క్లియర్ చేసే వీలుండకపోవడంతో వాటిని ఖజానా విభాగం వెనక్కు పంపింది. ఈ బిల్లులను కొత్త వార్షిక సంవత్సరం ప్రకారం రూపకల్పన చేసి పంపాలని నిర్ణయించి... ఈ మేరకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశాయి. సాంకేతిక సమస్యలకు చెక్... సంక్షేమ శాఖలకు చెందిన బిల్లుల రూపకల్పన అంతా ఈ–పాస్ వెబ్సైట్ ద్వారానే నిర్వహిస్తారు. పలు పథకాలకు సంబంధించిన దరఖాస్తులు ఈ–పాస్ ద్వారానే వస్తాయి. వీటిని ఆన్లైన్ ద్వారానే పరిశీలించి, ఆమోదించి నిధుల విడుదల కోసం ఖజానా శాఖకు పంపిస్తారు. ఈ క్రమంలో 2019–20 వార్షిక సంవత్సరం చివర్లో లాక్డౌన్ కారణంగా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఆ ఏడాది చివరి పది రోజుల పాటు అత్యవసర సేవలు మినహా మిగతావేవీ ముందుకు కదలలేదు. ఫలితంగా ఆ సంవత్సరానికి సంబంధించిన పలు బిల్లులు క్లియర్ కాకపోవడంతో వాటిని వెనక్కు పంపాల్సివచ్చింది. ప్రస్తుతం అవన్నీ జిల్లా సంక్షేమాధికారి యూజర్ అకౌంట్లో ఉన్నాయి. వీటిలో 2020–21 సంవత్సరం తేదీల ప్రకారం సరిదిద్దాలి. ఇందుకు ఈపాస్ వెబ్సైట్లో మార్పులు చేయాలి. ఇందులో భాగంగా సంక్షేమ శాఖ అధికారులు సీజీజీతో ప్రత్యేకంగా సమావేశమై సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు నిర్ణయించారు. సవరణలు, మార్పులు చేసేం దుకు ఉపక్రమించారు. కళ్యాణలక్ష్మి పథకం బిల్లుల్లో సవరణలు పూర్తి చేసిన అధికారులు... ప్రస్తుతం ఫీజు రీయిం బర్స్మెంట్ పథకం బిల్లుల్లో మార్పులు చేస్తున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. సవరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లా సంక్షేమాధికారి లాగిన్ ద్వారా బిల్లులను ఖజానా శాఖకు సమర్పిస్తారు. అక్కడ వాటిని ఆమోదించి టోకెన్లు జనరేట్ చేస్తారు. 2020–21 వార్షిక సంవత్సరం తొలి త్రైమాసికం నిధులు విడుదలైన వెంటనే వీటిని క్లియర్ చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
స్థానిక విద్యార్థులకే రీయింబర్స్మెంట్
రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మెమో జారీ నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ ! ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక విద్యార్థులకు మాత్రమే దీనిని వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన విద్యార్థులకే 2014-15 విద్యా సంవత్సరానికి రీయింబర్స్మెంట్ వర్తించేలా ఆదేశాలిచ్చింది. స్కాలర్‌షిప్‌లకు విద్యారులు ఈ-పాస్ వెబ్సైట్ http://epass .cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని సంక్షేమశాఖలు, సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ను ఆదేశించింది. ఈ మేర కు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మెమో జారీ చేశారు. వీలైతే బుధవారం నుంచే దరఖాస్తు చేసుకునేందుకు వీలుకల్పంచనున్నారు. అంతగా కాకపోతే ఒకటి, రెండురోజుల వ్యవధిలోనే ఈ-పాస్ ద్వారా రిజిస్ట్రేషన్లను చేపట్టనున్నారు. 2014-15 సంవత్సరానికి పోస్ట్మెట్రిక్స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని 371-డీకి అనుగుణంగా స్థానికత నిబంధనను అనుసరించి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్థానిక విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సీ అభివృద్ధిశాఖ, గిరిజనసంక్షేమశాఖ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, వికలాంగుల సంక్షేమ, సీనియర్ సిటిజన్స్శాఖల కమిషనర్/డెరైక్టర్లు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయంలో బీసీ సంక్షేమశాఖ డెరైక్టర్, డీడీలు, డీబీసీడబ్ల్యూలు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధా విడిగా ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ పథకాన్ని అమలుచేయనున్నారు. ఈ వర్గాలకు చెందినవారు 2013-14లో 14.30 లక్షల మంది విద్యార్థులుండగా, 2014-15లో కొంచెం అటూఇటూగా 13 లక్షల వరకు ఈ విద్యార్థుల సంఖ్య ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న డిగ్రీ లేదా పీజీ కంటే గత ఏడేళ్లలో ఎక్కడ విద్యను అభ్యసించారో ఆయా సర్టిఫికెట్లు, వివరాలను వారి దరఖాస్తులతోపాటు పొందుపరచాల్సి ఉంటుంది.