రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా మెమో జారీ
నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ !
ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానిక విద్యార్థులకు మాత్రమే దీనిని వర్తింపజేసేలా ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన విద్యార్థులకే 2014-15 విద్యా సంవత్సరానికి రీయింబర్స్‌మెంట్ వర్తించేలా ఆదేశాలిచ్చింది. స్కాలర్‌షిప్‌లకు విద్యారులు ఈ-పాస్ వెబ్‌సైట్ http://epass .cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని సంక్షేమశాఖలు, సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ను ఆదేశించింది. ఈ మేర కు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మెమో జారీ చేశారు. వీలైతే బుధవారం నుంచే దరఖాస్తు చేసుకునేందుకు వీలుకల్పంచనున్నారు. అంతగా కాకపోతే ఒకటి, రెండురోజుల వ్యవధిలోనే ఈ-పాస్ ద్వారా రిజిస్ట్రేషన్లను చేపట్టనున్నారు. 2014-15 సంవత్సరానికి పోస్ట్‌మెట్రిక్‌స్కాలర్‌షిప్ పథకాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాజ్యాంగంలోని 371-డీకి అనుగుణంగా స్థానికత నిబంధనను అనుసరించి ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన స్థానిక విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఎస్సీ అభివృద్ధిశాఖ, గిరిజనసంక్షేమశాఖ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, వికలాంగుల సంక్షేమ, సీనియర్ సిటిజన్స్‌శాఖల కమిషనర్/డెరైక్టర్‌లు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయంలో బీసీ సంక్షేమశాఖ డెరైక్టర్, డీడీలు, డీబీసీడబ్ల్యూలు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధా విడిగా ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకాన్ని అమలుచేయనున్నారు. ఈ వర్గాలకు చెందినవారు 2013-14లో 14.30 లక్షల మంది విద్యార్థులుండగా, 2014-15లో కొంచెం అటూఇటూగా 13 లక్షల వరకు ఈ విద్యార్థుల సంఖ్య ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న డిగ్రీ లేదా పీజీ కంటే గత ఏడేళ్లలో ఎక్కడ విద్యను అభ్యసించారో ఆయా సర్టిఫికెట్లు, వివరాలను వారి దరఖాస్తులతోపాటు పొందుపరచాల్సి ఉంటుంది.
స్థానిక విద్యార్థులకే రీయింబర్స్‌మెంట్
Published Wed, Mar 11 2015 4:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement