తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు, కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుడు, అభ్యుదయ చిత్రాల నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఉదయం మరణించారు. నగర శివార్లలోని కొండాపూర్ చండ్రరాజేశ్వరరావు ఫౌండేషన్ నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో ఉంటున్న తమ్మారెడ్డి బాత్రూంలోనే కుప్పకూలి చనిపోయారు. ఆయన వయస్సు 94 ఏళ్ళు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు లెనిన్‌బాబు మృతిచెందగా, మరొకరు ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కృష్ణమూర్తి మరణవార్త తెలిసిన వెంటనే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, బంధుమిత్రులు వృద్ధాశ్రమానికి చేరుకుని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని నాగార్జుననగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించి మూడు గంటలపాటు ఉంచారు. ఈ సమయంలో అనేక మంది ప్రముఖులు తమ్మారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. ఆ తర్వాత సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
జీవనయానం ఇలా...: కృష్ణా జిల్లా చినపాలపర్రులో 1920 అక్టోబర్ 4న జన్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన తమ్మారెడ్డి సత్యనారాయణకి స్వయానా సోదరుడు. తన అన్నతో పాటే ఆయన కూడా కృష్ణాజిల్లా గుడివాడలో సీపీఐ పూర్తికాలపు కార్యకర్తగా పని చేశారు. యువజన, విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన ప్రజానాట్యమండలి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
స్వాతంత్య్ర పోరాటంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ పాల్గొన్నారు. 1949లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం విధించినప్పుడు ఆయన మద్రాసు వెళ్లి సినీరంగ ప్రవేశం చేశారు. చిత్రసీమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆయన కూడా ఇక్కడకు వచ్చారు. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ పేరిట ఓ సంస్థను నెలకొల్పి ఎన్నో అభ్యుదయ, సందేశాత్మక చిత్రాలను నిర్మించారు. లక్షాధికారి, జమీందార్, బంగారుగాజులు, ధర్మదాత, ఇద్దరు కొడుకులు, దత్తపుత్రుడు వంటి చిత్రాలు ఆయన నిర్మించినవే. సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2007లో రఘుపతి వెంకయ్య అవార్డు గెలుచుకున్నారు. రాష్ట్రంలో ప్రజానాట్యమండలి పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన కృష్ణమూర్తి తుది శ్వాస విడిచేవరకు ఆ సంస్థతోనూ, కమ్యూనిస్టు పార్టీతోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. వృద్ధాశ్రమంలో నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. అన్ని విధాలుగా సహాయసహకారాలను అందించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.