Evergrande
-
హాంకాంగ్ కోర్టు సంచలన తీర్పు.. చిక్కుల్లో చైనా కంపెనీ!
చైనా రియల్ ఎస్టేట్ కంపెనీ 'ఎవర్‌గ్రాండే' గ్రూప్‌ను లిక్విడేషన్ చేయాలని హాంకాంగ్ కోర్టు ఆదేశించింది. రుణదాతలతో పునర్వ్యవస్థీకరణ ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైన నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆచరణాత్మకమైన పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలు చేయలేకపోవడంతోపాటు, కంపెనీ దివాళా దిశగా అడుగులేస్తున్న కారణంగానే కంపెనీ మూసివేస్తేనే మంచిదని పేర్కొంటూ హాంకాంగ్ కోర్టు న్యాయమూర్తి లిండా ఛాన్ పేర్కొన్నారు. ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఎవర్‌గ్రాండే గ్రూప్ లిక్విడేషన్ జరిగితే.. స్టాక్ మార్కెట్లో వివిధ సంస్థల స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఆస్తుల విలువ మొత్తం 240 బిలియన్ డాలర్లు, కాగా.. సంస్థ చేసిన అప్పులు విలువ సుమారు 300 బిలియన్ డాలర్లు. ఇదీ చదవండి: అంబానీ కంటే ముందే 'లోటస్' కారు కొన్న హైదరాబాద్ మహిళ హాంకాంగ్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఎవర్‌గ్రాండే స్టాక్స్ 20 శాతానికి పైగా నష్టపోయాయి. ఫలితంగా కొంత సేపు హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ట్రేడింగ్ కూడా నిలిపేశారు. చైనాలోని రియాల్టీ రంగంలో రుణాలు అదుపు తప్పాయి. వాటిని నియంత్రించడంతో పాటు.. రియాల్టీ రంగాన్ని క్రమబద్ధీకరించేందుకు చైనా రెగ్యులేటరీ సంస్థలు కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చాయి. ఫలితంగా ఎవర్‌గ్రాండే వంటి చాలా కంపెనీలు చిక్కుల్లో పడ్డాయి. ఇదే ప్రస్తుతం కంపెనీని దివాళా అంచులకు తీసుకువెళ్ళింది. -
సంక్షోభం: చైనా రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే సంచలనం
China Evergrande Group bankruptcy protection: చైనీస్ ప్రాపర్టీ దిగ్గజం ఎవర్‌గ్రాండే గ్రూప్ సంచనల విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్న చైనా రియల్టీ రంగాన్ని ప్రతిబింబిస్తూ దేశంలోని రెండో అతిపెద్ద ప్రాపర్టీ డెవలపర్ దివాలా తీసినట్టు ప్రకటించింది. ఈ మేరకున్యూయార్క్ కోర్టులో దివాలా కోసం దాఖలు చేసింది. చైనాలో అగ్రశ్రేణి కంపెనీలు నిర్మాణాలను పూర్తి చేయడానికి డబ్బు కోసం కష్టపడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ఆందోళన రేపింది. (అదానీలో పెట్టుబడుల జోష్: అబుదాబి ఆయిల్ మేజర్ వేల కోట్ల ప్లాన్!) ప్రపంచంలోనే అత్యధికంగా అప్పుల్లో కూరుకుపోయిన ప్రాపర్టీ డెవలపర్ ఎవర్‌గ్రాండే న్యూయార్క్ కోర్టులో చాప్టర్-15 కింద దివాలా రక్షణను దాఖలు చేసింది. వివిధ బ్యాంకులతో పలు మల్టీ మిలియన్ డాలర్ల రుణాల కోసం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అమెరికా తన ఆస్తులను రక్షించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎవర్‌గ్రాండే ప్రస్తుత అప్పులు విలువ 300 బిలియన్ డాలర్లకు పైమాటే. 2021లో కంపెనీల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థలో భారీ ఆస్తి సంక్షోభాన్ని రేకెత్తించింది. పెరుగుతున్న గృహాల ధరలను అదుపు చేసే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా రుణాలు తీసుకోవడంపై చైనా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత సంస్థ డిఫాల్ట్ వచ్చింది. (అదిరిపోయే లుక్‌లో మహీంద్ర థార్ ఎలక్ట్రిక్ వెర్షన్) ఈ పరిణామాల నేపథ్యంలో 2022 మార్చి నుంచి కంపెనీ హాంకాంగ్-లిస్టెడ్ షేర్ల ట్రేడింగ్ నిలిచి పోయింది. అంతేకాదు గతరెండేళ్లలో కంపెనీ ఏకంగా 80 బిలియన్ డాలర్లు నష్ట పోయినట్లు స్వయంగాఎవర్గ్రాండే జూలైలో నివేదించిన సంగతి తెలిసిందే. కంపెనీ వెబ్సైట్ ప్రకారం, ఎవర్‌గ్రాండే 280 కంటే ఎక్కువ నగరాల్లో 1,300 లకు పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది.మరోవైపు చైనా ఆర్థిక వృద్ధి మందగమనంతో ఎగుమతులు కూడా క్షీణించాయి. చైనా యువత నిరుద్యోగం రేటు కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. డాలరు మారకంలో కరెన్సీ పతనమవుతోంది. దీంతో ఇటీవల ద్రవ్యోల్బణాన్ని కట్టి చేసే చర్యల్లో భాగంగా చైనా కేంద్ర బ్యాంకు అనూహ్యంగా కీలక వడ్డీరేట్లను రికార్డు స్థాయికి తగ్గించడం ప్రపంచ దేశాల ఆర్థిక నిపుణులను ఆందోళనలో పడేసింది. -
ఎగబడి లోన్లు ఇచ్చిన బ్యాంక్.. చివరికి ‘చెత్త’ ఘనత
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ఆ బ్యాంకు.. భవిష్యత్తు మొత్తం తనదే అనే ప్రతిష్ట సంపాదించుకుంది. కానీ, పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యాంకుకు సంబంధించి రియల్టి విభాగం భారీ దెబ్బ వేసింది. పోటీతత్వంలో వెనుకంజ, అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడంతో పాటు ఎవర్‌గ్రాండ్ పరిణామాలు చెత్త బ్యాంక్ ట్యాగ్‌ను తగిలించాయి చివరికి!. చైనాకు చెందిన మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. కొన్నేళ్ల కిందటి దాకా ఆసియాలో ఇదే అతిపెద్ద బ్యాంక్‌గా ఉండేది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దిగ్గజం అప్పుల ధాటికి బాధితురాలిగా మారిపోయింది ఈ బ్యాంక్. అడ్డగోలుగా ఇచ్చిన లోన్ల కారణంగా మిన్‌షెంగ్ దారుణంగా పతనం అయ్యింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధరలు 31 శాతం దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఈ చెత్త పర్ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు మరో అప్రతిష్ట మూటగట్టుకుంది. బ్లూమ్‌బర్గ్ వరల్డ్ బ్యాంకుల ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన బ్యాంక్‌గా నిలిచింది మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. ఈ సూచీలో ప్రపంచంలోని మొత్తం 155 బ్యాంకులను పరిగణనలోకి తీసుకుంటుంది బ్లూమ్‌బర్గ్. పైకి.. ఆపై పతనం 1996లో బీజింగ్ కేంద్రంగా నాన్-స్టేట్ కంట్రోల్ లెండర్(చైనాలోనే తొలి ఘనత) కార్యకలాపాలను మొదలుపెట్టింది మిన్‌షెంగ్. అనంతి కాలంలోనే ప్రపంచంలో టాప్ 20 బ్యాంకింగ్ దిగ్గజాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంక్.. 2022 కార్యాచరణను ప్రకటించుకుంది. లోకల్ బ్రాంచ్ మేనేజర్లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు ప్రాపర్టీ రుణాల హోల్డింగ్లను తగ్గించడం అత్యంత ప్రాధాన్యతగా పాటించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం లాంటి హేయనీయమైన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంపై పట్టు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తోంది. ముఖ్యంగా ప్రాపర్టీ ఇండస్ట్రీని పునాదులతో సహా కుదిపేస్తోంది. ఈ పరిణామాలను తట్టుకోలేక ఎడాపెడా డిస్కౌంట్లతో ఆకర్షణ కోసం ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండ్. చివరకు డిఫాల్ట్ ప్రకటనతో బాంబుపేల్చగా.. గ్లోబల్ రియల్ ఎస్టేట్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవర్‌గ్రాండ్‌కు బిలియన్ డాలర్ల లోన్ కట్టబెట్టిన మిన్‌షెంగ్.. ఇప్పుడు లబోదిబోమంటోంది. సంబంధిత వార్త: పెనుసంక్షోభం అంచున డ్రాగన్.. ఆందోళనలో గ్లోబల్ బ్యాంకింగ్, రియల్టి రంగాలు! -
డెడ్‌లైన్ ఫినిష్.. పెనుసంక్షోభం అంచున చైనా!
కమ్యూనిస్ట్ కంట్రీ పెనుసంక్షోభం అంచున నిలిచింది. ఓవైపు కరోనా సవాళ్లు, మరోవైపు కార్పొరేట్ రంగాన్ని ప్రభావితం చేస్తున్న అధ్యక్షుడు జింగ్ పిన్ నిర్ణయాలు, ఇంకోవైపు రియల్టి రంగంలో పెనుసంక్షోభంతో ప్రపంచంలోనే రెండో పెద్ద అర్థిక వ్యవస్థ చైనా పతనం దిశగా దూసుకుపోతోంది. తాజాగా చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే)కి విధించిన డెడ్‌లైన్ ముగియడంతో దాదాపు డిఫాల్టర్ అయినట్లేనని భావిస్తున్నారు. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరున్న ఎవర్‌గ్రాండ్.. చెల్లింపుల గడువు ముగియడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు సుమారు 300 బిలియన్ల డాలర్ల బాకీ పడిన ఎవర్‌గ్రాండ్.. గడువులోగా వడ్డీలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. ఆస్తులు అమ్ముకున్నా(కొన్ని ఒప్పందాలు కుదరలేదు కూడా) కూడా సమయానికి చెల్లించలేకపోయింది. దీంతో పతన భయంతో చైనా రియల్టీ, బ్యాంకింగ్ రంగాలు వణికిపోతున్నాయి. ఫిట్చ్ ప్రకటన సోమవారం నాటికల్లా (డిసెంబర్ 6, 2021) దాదాపు 1.2 బిలియన్ డాలర్ల అప్పును ఎవర్‌గ్రాండ్ చెల్లించాల్సి ఉంది. కానీ, బుధవారం నాటికి కూడా చెల్లింపులు జరగకపోవడంతో.. కంపెనీ దాదాపు డిఫాల్ట్‌గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఫిట్చ్.. ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్ట్‌గా ప్రకటించడం విశేషం. రియల్టి రంగంపై చైనా ప్రభుత్వం మోపిన ఉక్కుపాదం వల్లే ఎవర్‌గ్రాండ్ పతనం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను తట్టుకునేందుకు అడ్డగోలుగా డిస్కౌంట్లను ప్రకటించి.. ఇబ్బందుల పాలైంది ఎవర్‌గ్రాండ్. ఒకవేళ చైనాలో గనుక అతిపెద్ద కార్పొరేట్ పతనం ఏర్పడితే.. గ్లోబల్ మార్కెట్ సైతం కుదేలు కావడం ఖాయం. అప్పట్లో.. ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో షెంజెన్ కేంద్రంగా ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. చదవండి: ఎవర్‌గ్రాండ్ ఓనర్.. చినిగిన బట్టలతో బాల్యం.. కడుపు కాలి కుబేరుడు అయ్యాడు -
కదులుతున్న చైనా పునాదులు, డ్రాగన్‌కు మరో దెబ్బ
చైనా ఆర్ధిక మూలాలు ఒక్కొక్కటిగా దెబ్బతింటున్నాయి. ముంచుకొచ్చిన వరదలు, ఆహారం సంక్షోభం, ఇతర దేశాలు చైనాపై విధించిన వ్యాపారపరమైన ఆంక్షలు, పేట్రోగిపోతున్న కరోనాతో పాటు రియాలీ రంగంలో తలెత్తిన సంక్షోభం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. డ్రాగన్ కంట్రీ జీడీపీలో 29శాతంగా ఉన్న రియాలటీ రంగం కుదేలవుతుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో చైనాలో అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎవర్ గ్రాండ్ డీఫాల్టర్ జాబితాలో చేరింది. తాజాగా మరొక రియల్ ఎస్టేట్ డెవలపర్ కైసా గ్రూప్ డిఫాల్టర్‌గా మిగిలిపోనున్నట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలతో చైనా పునాదులు కదిలిపోతున్నాయని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. రియాలిటీ రంగంలో ఒడిదుడుకులు చూస్తుంటే అవి నిజమనిపిస్తున్నాయి. కైసా గ్రూప్ చైనాలో రియాల్టీ రంగానికి దెబ్బమీద దెబ్బపడుతున్నట్ల మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవర్ గ్రాండ్ తర్వాత కైసా గ్రూప్ డీఫాల్టర్ జాబితాలో చేరడం చైనా ఆర్ధిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగింది. షెన్జెన్కు చెందిన రియాలిటీ కంపెనీ కైసా గ్రూప్ షేర్లు హాంకాంగ్‌లో స్టాక్క్ మార్కెట్లో ట్రేడింగ్‌ను నిలిపివేశాయి. అంతేకాదు కైసాకు అనుబంధంగా అనుబంధ సంస్థలు నిర్వహించే ట్రేడింగ్ సైతం నిలిచిపోయిందని సీఎన్ఎన్ తెలిపింది. కైసా సస్పెన్షన్ కారణాలేంటో బహిర్గతం చేయకపోయినా.. ఆ కంపెనీకి ఆర్ధికపరమైన సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వ ఆర్థికరంగా చెందిన మీడియా సంస్థ సెక్యూరిటీస్ టైమ్స్.. కంపెనీ ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని, బకాయిలు చెల్లించలేకపోతుందని కథనాల్ని ప్రచురించింది. అయితే కైసా మాత్రం రియాలీ రంగంపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఇచ్చే క్రెడిట్ రేటింగ్ తగ్గించడం వల్ల సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ఎవర్ గ్రాండ్, మోడరన్ ల్యాండ్ చైనా రియల్ ఎస్టేట్ రంగంలో అతిపెద్ద సంస్థ ఎవర్ గ్రాండే. ఈ కంపెనీ 280 నగరాల్లో 1300 ప్రాజెక్టులను చేపట్టింది. 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ కంపెనీ దివాళా తీసిసింది. ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్లమేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ జారీ చేసిన వివిధ బాండ్లపై సెప్టెంబర్ 23 వ తేదీకి 80 మిలియన్ డాలర్ల వడ్డీని చెల్లించాల్సి ఉంది. కానీ ఆ అప్పులు చెల్లించలేక డీఫాల్టర్ జాబితాలో చేరింది. ఎంతలా అంటే ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులుకు జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంది. ఇప్పుడు కైసా గ్రూఫ్ సైతం డీఫాల్టర్ జాబితాలో చేరనుండగా.. మరో రియాలిటీ సంస్థ మోడరన్ ల్యాండ్ సైతం తన అప్పులు చెల్లించలేక ఇబ్బంది పడుతోంది. ఇటీవల చైనా రియాలిటీ రంగంలో జరుగుతున్న పరిణామాలపై డెవలపర్లు కంపెనీ చెల్లించాల్సిన బకాయిల గురించి కంపెనీపై ఒత్తిడి తెచ్చారు. దీంతో మోడరన్ ల్యాండ్ ప్రతినిధులు బకాయిలు చెల్లించేందుకు తమకు మరింత సమయం కావాలని కోరారు. కోరిన గడువులోపు బకాయిలు చెల్లిస్తే సరేసరి. లేదంటే మోడరన్ ల్యాండ్ సైతం డీఫాల్టర్ జాబితాలో చేర్చాల్సి ఉంటుంది. చదవండి: చైనాకు మరో భారీషాక్, డ్రాగన్‌ను వదిలేస్తున్న టెక్ దిగ్గజ కంపెనీలు -
బిచ్చగాడు టు బిలియనీర్..
China Evergrande's Xu Jiayin Life Story: పుట్టి, పెరిగింది పక్కాపల్లెటూరిలో. ఏడాదిలోపే కన్నతల్లి చనిపోయింది. రిటైర్డ్ సోల్జర్ అయిన తండ్రి పచ్చి తాగుబోతు. అందుకే బిచ్చమెత్తుకుంటూ దయనీయమైన బతుకు బతికాడు ఆ కుర్రాడు. చినిగిన బట్టలు, వాటికి ప్యాచీలు. నాన్నమ్మ ఇంటి నుంచి బడికి కాలినడక. ఒక్కపూట తిండి. అదీ స్నేహితులు ఇచ్చిన బ్రెడ్డు.. స్వీట్పొటాటోలతో కడుపు నింపేసుకోవడం.. ఇలా చెప్తూ పోతే అతని బాల్యమంతా దరిద్రమే కనిపిస్తుంది. అలాంటోడు బిలీయనీర్‌గా.. కాదు కాదు మల్టీబిలీయనీర్గా ఎదిగిన క్రమం కచ్చితంగా ఒక అద్భుత విజయమే. కానీ.. పైన చెప్పిందంతా.. చైనా, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీగా గుర్తింపు పొందిన ‘ఎవర్‌గ్రాండ్’ వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) జీవితం గురించి. కడు పేదరికం నుంచి అపర కుబేరుడిగా ఎదిగి.. ప్రపంచంలో గుర్తింపు దక్కించుకున్న ఒక కంపెనీకి అధిపతిగా పేరు సంపాదించుకున్నారాయన. కానీ, ఎవర్‌గ్రాండ్ సంక్షోభంతో ఆయన ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. నాలుగేళ్ల క్రితం 43 బిలియన్ డాలర్లుగా ఉన్న హుయి కా యాన్ సంపద.. 8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. డిఫాల్టర్ దిశగా ఎవర్‌గ్రాండ్ అడుగులు పడుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఆయన ముందర ఉంది. 2017లో ఓ యూనివర్సిటీ ఈవెంట్లో క్జూ జియాయిన్ చేసిన ప్రసంగం గుర్తు చేసుకుంటూ.. చిన్నప్పుడు సరైన బట్టలు ఉండేవికావు. తిండి దొరికేది కాదు. దూరంగా వెళ్లిపోయి మంచి ఉద్యోగం.. కడుపునిండా తిండి తినాలని కలలు కనేవాడిని. ఇప్పుడా కల నెరవేరింది. చైనాలో రాజకీయ పరిణామాలతో.. 1976లో స్కూల్ చదువుకు గుడ్‌బై చెప్పేసి.. ఉద్యోగం దొరక్క బాగా ఇబ్బంది పడ్డాడు హుయి కా యాన్. సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీగా పని చేస్తూ దొరికింది తింటూ డబ్బు కూడబెట్టుకున్నాడు. తిరిగి కాలేజీలో చేరి విద్యను కొనసాగించాడు. 1978లో వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్‌లో చదువుకున్నాడు. శుభ్రత.. చిన్నతనంలో పేదరికంతో దేనికైతే అతను దూరంగా ఉన్నాడో.. ఆ విభాగానికే అతను లీడర్‌గా వ్యవహరించడం విశేషం. స్టీల్ కంపెనీ నుంచి.. యూనివర్సిటీ చదువు పూర్తయ్యాక స్టీల్ కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్‌గా రెండేళ్లు(1983-85), డైరెక్టర్‌గా ఏడేళ్లు పని చేశాడు. 1992లో గువాంగ్‌డాంగ్‌లోని షెంజన్ ‘స్పెషల్ ఎకనమిక్ జోన్’గా మారింది. దీంతో అక్కడికి మకాం మార్చేసి.. ఓ స్టీల్ కంపెనీని మొదలుపెట్టాడు. 1997లో ఎవర్‌గ్రాండ్ గ్రూప్ స్థాపన ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీకి బీజం వేశాడు. 2020లో ఫోర్బ్స్ లిస్ట్‌లో సైతం(మూడో చైనా బిలియనీర్‌గా) నిలిచాడు. కానీ, 2017 నుంచి అప్పులతో పతనం అవుతున్న అతని సంపద గురించి గోపత్యను ప్రదర్శిస్తూ వస్తున్నాడు. చదువు కోసం దానం క్జూ జియాయిన్.. విలాసాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తాడు. 2010లో కష్టాల్లో ఉన్న గువాంగ్జౌ ఫుట్‌బాల్ టీంను కొనుగోలు చేశాడు. టీంను ఛాంపియన్‌గా ఎదిగేందుకు అవసరమైన ఖర్చు చేశాడు. అంతేకాదు 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఓ యాట్చ్ను సైతం మెయింటెన్ చేస్తున్నాడు. ఇదిగాక ప్రైవేట్ జెట్‌తో పాటు ఫ్రెంచ్ బ్రాండ్ ఉత్పత్తుల కోసం విపరీతంగా ఖర్చు పెడుతుంటాడు(అందుకే ఆయన్ని బెల్ట్ క్జూ అని కూడా పిలుస్తారు). కమ్యూనిస్ట్ పార్టీతో దగ్గరి సంబంధాలు ఉన్న క్జూ జియాయిన్.. తన జీవితాన్ని మార్చేసిన చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తుంటాడు. మిలియన్ డాలర్లను ఎడ్యుకేషన్ స్కీమ్‌ల కోసం దానం చేస్తుంటాడు. కానీ, ఆ ప్రభుత్వ నిర్ణయమే ఇప్పుడు ఆయన్ని కిందకు లాగేస్తోంది. అయితే.. దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలపై పట్టు సాధించడం కోసం డ్రాగన్ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ "సాధారణ శ్రేయస్సు" (కామన్ ప్రాస్సరటీ) పేరుతో తీసుకువచ్చిన విధానం వల్ల చైనా బిలియనీర్ క్లాస్‌లో భారీ ఆటుపోట్లు సంభవిస్తున్నాయి. ఎవర్‌గ్రాండ్ తిరోగమనం తారాస్థాయి నుంచి మొదలైంది కూడా ఈ విధానం వల్లే. -
చైనా ‘ఎవర్‌గ్రాండ్’: దెబ్బ మీద దెబ్బ
China Evergrande shares fall: కరోనా సవాళ్లకు తోడు రియల్టీ రంగం సంక్షోభంతో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (చైనా) మందగమనంలో ఉంది. ఈ తరుణంలో తాజాగా మరో భారీ పతనం చైనాను కోలుకోలేని దెబ్బతీసింది. ప్రపంచంలోనే ప్రఖ్యాత నిర్మాణ సంస్థగా పేరు దక్కించుకున్న ఎవర్‌గ్రాండ్.. డిఫాల్టర్ మరకను అంటించుకునే టైం దగ్గర పడింది. చైనా ప్రాపర్టీ దిగ్గజం ‘ఎవర్‌గ్రాండ్’(ఎవర్‌గ్రాండే) షేర్లు భారీగా పతనం అయ్యాయి. పదిహేడు రోజుల విరామం అనంతరం.. గురువారం ఉదయం హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో 14 శాతం పతనాన్ని చవిచూశాయి. ఇప్పటికే ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఎవర్‌గ్రాండ్.. యూనిట్లలో ఒకదానిని 2.6 బిలియన్ డాలర్లకు అమ్మేయాలనుకున్న ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో షేర్లు ఒక్కసారిగా పతనం అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రభావంతో గృహ నిర్మాణ రంగం మందగమనంలో కూరుకుపోయి ప్రపంచవ్యాప్తంగా మెటల్ షేర్లకు డిమాండ్ తగ్గవచ్చనే ఆందోళనలు అధికమయ్యాయి. ఎవర్‌గ్రాండే ప్రాపర్టీస్ సర్వీసెస్‌లో 51 శాతం భాగాన్ని.. హోప్‌సన్ డెవలప్మెంట్ హోల్డింగ్స్‌కు అమ్మాలనుకున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలనుకుంటున్నట్లు బుధవారం అధికారికంగా ఒక ప్రకటన చేసింది కూడా. అయితే హోప్‌సన్ డెవలప్మెంట్ మాత్రం ఎవర్‌గ్రాండ్ విధించిన తలాతోకలేని షరతుల వల్లే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం విశేషం. చైనాకు చెందిన అతిపెద్ద(రెండవ) రియల్ ఎస్టేట్ డెవలపర్.. గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటిగా ఉండేది. సంస్థ జారీ చేసిన బాండ్లపై సెప్టెంబర్ 23నాటికి కట్టాల్సిన 80 మిలియన్ డాలర్లవడ్డీని చెల్లించలేనని ఎవర్‌గ్రాండ్ కిందటి నెలలో ప్రకటించడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు షాక్‌కు గురయ్యారు. అంతేకాదు 305 బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు నిర్ధారణ కావడంతో రియల్టీ రంగం ఉలిక్కిపడింది. అయితే ఈ సంక్షోభాన్ని తాము తట్టుకుని నిలదొక్కుకుంటామన్న ఎవర్‌గ్రాండ్ ఫౌండర్ క్జూ జియాయిన్(హుయి కా యాన్) హామీ ఫలించడం లేదు. తాజాగా షేర్లు భారీగా పడిపోతుండడంతో.. చైనాలో అతిపెద్ద కార్పొరేట్ పతనం తప్పదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే గ్లోబల్ మార్కెట్ కుదేలు కావడం ఖాయం. ఇక ఎవర్‌గ్రాండే షేర్లు చివరిగా 2010 మేలో కనిష్ట స్థాయిలో ట్రేడ్ కాగా.. ఇప్పుడు అంతకు మించే పతనం కావడం మరో విశేషం. షెంజెన్ కేంద్రంగా చైనా రియల్ ఎస్టేట్ రంగంలో రెండో స్థానంలో ఉన్న ఎవర్‌గ్రాండే.. పోయిన నెలలో పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పటికే డిఫాల్టర్ జాబితాలో చేరాల్సి ఉండగా.. అది కొంచెం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. షేర్ల పతనంతో కుదేలు అవుతున్న తరుణంలో.. కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. బకాయిల్లో 83.5 మిలియన్ డాలర్ల చెల్లింపులు చేపట్టాలని 30 రోజుల గడువు విధించిన విషయం తెలిసిందే. ఒకవేళ అది జరగకుంటే ఎవర్‌గ్రాండ్‌ను డిఫాల్టర్‌గా ప్రకటిస్తారు. ఘనం నుంచి పతనం ఎవర్‌గ్రాండ్.. 1996 చైనాలో అర్బనైజేషన్ ఉవ్వెత్తున్న కొనసాగిన టైంలో ఏర్పాటైన రియల్ ఎస్టేట్ గ్రూప్. 2009లో 722 మిలియన్ డాలర్ల ఐపీవో ద్వారా హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. ఆపై 9 బిలియన్ డాలర్లతో చైనాలోనే అతిపెద్ద ప్రైవేట్ ప్రాపర్టీ కంపెనీగా అవతరించింది. అంతేకాదు వ్యవస్థాపకుడు క్జూ జియాయిన్(హుయి కా యాన్) ను అపర కుబేరుడిగా మార్చేసింది. 2010లో గువాన్గ్జౌ ఫుట్‌బాల్ టీం కొనుగోలు చేయడం, టూరిజం రిక్రియేషన్ వ్యాపారాలతోనూ వార్తల్లోకి ఎక్కింది. వాటర్ బాటిల్స్ తయారీ, ఈవీ తయారీ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. అయితే కిందటి ఏడాది అగష్టులో ప్రభుత్వం డెవలపర్స్ మీద ఉక్కుపాదం మోపడం, అడ్డగోలు డిస్కౌంట్లతో అమ్మకాల నుంచి ఎవర్‌గ్రాండ్ పతనం మొదలైంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. డిఫాల్ట్ గండం నుంచి ఎవర్‌గ్రాండ్ బయటపడే పరిస్థితులు కనిపించడం లేదు. - సాక్షి, వెబ్‌స్పెషల్