ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు మోసిన ఆ బ్యాంకు.. భవిష్యత్తు మొత్తం తనదే అనే ప్రతిష్ట సంపాదించుకుంది. కానీ, పరిస్థితులు తలకిందులు అయ్యాయి. బ్యాంకుకు సంబంధించి రియల్టి విభాగం భారీ దెబ్బ వేసింది. పోటీతత్వంలో వెనుకంజ, అడ్డగోలుగా లోన్లు మంజూరు చేయడంతో పాటు ఎవర్‌గ్రాండ్ పరిణామాలు చెత్త బ్యాంక్ ట్యాగ్‌ను తగిలించాయి చివరికి!.
చైనాకు చెందిన మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. కొన్నేళ్ల కిందటి దాకా ఆసియాలో ఇదే అతిపెద్ద బ్యాంక్‌గా ఉండేది. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దిగ్గజం అప్పుల ధాటికి బాధితురాలిగా మారిపోయింది ఈ బ్యాంక్. అడ్డగోలుగా ఇచ్చిన లోన్ల కారణంగా మిన్‌షెంగ్ దారుణంగా పతనం అయ్యింది. గత ఏడాది కాలంలో స్టాక్ ధరలు 31 శాతం దిగువన ట్రేడ్ అవుతున్నాయి. ఈ చెత్త పర్‌ఫార్మెన్స్ కారణంగా ఇప్పుడు మరో అప్రతిష్ట మూటగట్టుకుంది.
బ్లూమ్‌బర్గ్ వరల్డ్ బ్యాంకుల ఇండెక్స్ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చిన బ్యాంక్‌గా నిలిచింది మిన్‌షెంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. ఈ సూచీలో ప్రపంచంలోని మొత్తం 155 బ్యాంకులను పరిగణనలోకి తీసుకుంటుంది బ్లూమ్‌బర్గ్.
పైకి.. ఆపై పతనం
1996లో బీజింగ్ కేంద్రంగా నాన్-స్టేట్ కంట్రోల్ లెండర్(చైనాలోనే తొలి ఘనత) కార్యకలాపాలను మొదలుపెట్టింది మిన్‌షెంగ్. అనంతి కాలంలోనే ప్రపంచంలో టాప్ 20 బ్యాంకింగ్ దిగ్గజాల సరసన నిలిచింది. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ బ్యాంక్.. 2022 కార్యాచరణను ప్రకటించుకుంది. లోకల్ బ్రాంచ్ మేనేజర్‌లకు మరిన్ని అధికారాలు కట్టబెట్టడంతో పాటు ప్రాపర్టీ రుణాల హోల్డింగ్‌లను తగ్గించడం అత్యంత ప్రాధాన్యతగా పాటించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు ఉద్యోగుల జీతాలను సగానికి తగ్గించడం లాంటి హేయనీయమైన నిర్ణయాలు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ రంగంపై పట్టు కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను కకావికలం చేస్తోంది. ముఖ్యంగా ప్రాపర్టీ ఇండస్ట్రీని పునాదులతో సహా కుదిపేస్తోంది. ఈ పరిణామాలను తట్టుకోలేక ఎడాపెడా డిస్కౌంట్‌లతో ఆకర్షణ కోసం ప్రయత్నించింది రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండ్. చివరకు డిఫాల్ట్ ప్రకటనతో బాంబుపేల్చగా.. గ్లోబల్ రియల్ ఎస్టేట్‌పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎవర్‌గ్రాండ్‌కు బిలియన్ డాలర్ల లోన్ కట్టబెట్టిన మిన్‌షెంగ్.. ఇప్పుడు లబోదిబోమంటోంది.
సంబంధిత వార్త: పెనుసంక్షోభం అంచున డ్రాగన్.. ఆందోళనలో గ్లోబల్ బ్యాంకింగ్, రియల్టి రంగాలు!
Comments
Please login to add a commentAdd a comment