భూవివాదంలో మాజీ సైనికుడిపై దాడి
కపిలేశ్వరపురం :
భూ వివాదంలో ఈ నెల 11న మాజీ సైనికుడినిపై కొందరు దాడి చేశారు. మండలంలోని అద్దంకివారిలంక గ్రామ శివారు పల్లపులంకలో జరిగిన దాడిలో గాయపడిన మాజీ సైనికుడు మలకా లక్ష్మణరావు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచి సమాచారం రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అంగర ఎస్సై వాసా పెద్దిరాజు తెలిపారు. బాధితుడు లక్ష్మణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... లక్ష్మణరావుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి ఈ నెల 11న వెళ్లగా బూరుగు సత్యనారాయణ, బూరుగు అర్జునరావు, కొత్తపల్లి దుర్గారావు, బూరుగు చిన్న, బూరుగు ఏసు, బూరుగు ప్రసాదు వచ్చి పొలంలోని సర్వే రాళ్ళను తొలగించి లక్ష్మణరావుపై దాడికి దిగారు.
వివాదం నేపథ్యం ఇదీ...
లక్ష్మణరావు సేవలను గుర్తించిన ప్రభుత్వం 1976లో పల్లపులంకలో 259/1 సర్వేలో ఐదు ఎకరాల భూమిని డి–పట్టాగా ఇచ్చింది. తర్వాతక్రమంలో ఆ భూమిని కొందరు ఆక్రమించి కొంతకాలంగా సాగు చేస్తున్నారు. దీంతో 1992లో తన భూమిని అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం ప్రారంభించారు. 2014 సెప్టెంబర్లో అప్పటి జిల్లా కలెక్టరు నీతూకుమారిప్రసాద్ను కలిసి తన గోడును విన్నవించుకున్నారు. దీంతో 2016 జూలైలో సర్వే నిర్వహించగా ఆ సర్వే నంబరుతో మొత్తం 11.36 ఎకరాలున్నట్టు, అందులో ఐదు ఎకరాలు లక్ష్మణరావుకు చెందినదిగా నిర్ధారించారు. దీంతో లక్ష్మణరావు కొద్ది రోజుల క్రితం కొబ్బరిమొక్కలు వేసి భూమికి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని కొందరు తొలగించారు. అప్పటి నుంచి వివాదం రాజుకుంంది. ఈ నేపథ్యంలో 11న లక్ష్మణరావుపై దాడి జరిగింది.