పరారీలో సినీ డైరెక్టర్ కిట్టు
బంజారాహిల్స్ : పాత నోట్ల మార్పిడి కేసులో ప్రధాన నిందితుడు, సినీ దర్శకుడు కిట్టు అలియాస్ నల్లూరి రామకృష్ణ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మూడు బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. కమలాపురి కాలనీలో సినిమా కార్యాలయం ముసుగులో గత నెల రోజులుగా పాత నోట్ల దందాను కొనసాగిస్తున్న కిట్టు ఆదివారం రాత్రి నోట్ల మార్పిడి చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే కిట్టు తప్పించుకోగా అతడి ఆఫీసు సిబ్బందిని, పాత నోట్లు మార్పిడి కోసం వచ్చినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురిని సోమవారం అరెస్టు చేశారు.
ప్రధాన నిందితుడు కిట్టు కారును సీజ్ చేశారు. సదరు కారుకు ‘ప్రెస్’ స్టిక్కర్ అంటించి ఉండటం పోలీసులను విస్మయానికి గురి చేసింది. ఈ కారులోనే పాత నోట్ల మార్పిడి జరిగినట్లు సమాచారం. ఆదివారం రాత్రి పలువురు వ్యక్తులు సుమారు రూ. 5 కోట్లు పాత నోట్లు మార్చుకునేందుకు మార్చుకునేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే కిట్టు కొత్త నోట్లు వస్తున్నాయంటూ వారిని గంటల తరబడి అక్కడే కూర్చుండబెట్టి ముంబయికి చెందిన బిలాల్ షుక్రు అనే వ్యక్తితో తుపాకీ చూపించి భయబ్రాంతులకు గురి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘కేటుగాడు’ సినిమాకు దర్శకత్వం వహించిన కిట్టు మరో సినిమా తీసేందుకే కమీషన్ పద్ధతిలో పాత నోట్ల దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రముఖ నిర్మాత తనయుడితో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందినవారి పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎన్ని నోట్లు మార్చారు, కొత్త కరెన్సీ ఎక్కడి నుంచి వస్తున్నదన్నదానిపై కిట్టు కార్యాలయం సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లను తనిఖీ చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. అయితే కిట్టు సెల్ఫోన్ స్విచాఫ్ చేసి ఉండటంతో అతడి ఇంటి వద్ద పోలీసులను ఏర్పాటు చేశారు.