express ways
-
ఇండ్ఇన్ఫ్రావిట్ చేతికి రోడ్ ప్రాజెక్టులు - డీల్ విలువ ఎంతంటే?
ముంబై: బ్రూక్‌ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ నుంచి నిర్వహణలో ఉన్న నాలుగు రహదారి ప్రాజెక్టులను ఇండ్ఇన్ఫ్రావిట్ ట్రస్ట్ సొంతం చేసుకుంది. పూర్తి నగదు రూపేణా జరిగిన డీల్ విలువ బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 8,200 కోట్లు)కాగా.. కొనుగోలును పూర్తి చేసినట్లు ఇండ్ఇన్ఫ్రావిట్ తాజాగా వెల్లడించింది. బ్రూక్‌ఫీల్డ్ నిర్వహణలోని బీఐఎఫ్ ఇండియా హోల్డింగ్స్, కైనెటిక్ హోల్డింగ్స్ నుంచి ఐదు ప్రాజెక్టులను చేజిక్కించుకునేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. అయితే నాలుగు ఆస్తులను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. జాబితాలో సింహపురి ఎక్స్‌ప్రెస్‌వే, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై– నాసిక్ ఎక్స్‌ప్రెస్‌వే, కోసి బ్రిడ్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ చేరాయి. ఇక గోరఖ్‌పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నియంత్రణ సంస్థల అనుమతులను పొందవలసి ఉండటంతోపాటు.. కొన్ని నిబంధనలు పాటించవలసి ఉన్నట్లు తెలియజేసింది. నిధులను రూపాయలలో కాలావ ధి రుణం, మార్పిడిరహిత డిబెంచర్లు, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ఓఎంఈఆర్‌ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రిఫరెన్షియల్ పద్ధతిలో యూనిట్ల జారీ ద్వారా ఏర్పాటు చేసింది. సొంతం చేసుకున్న ప్రాజెక్టులలో మూడు టోల్ రోడ్ ఆస్తులుకాగా.. ఒక యాన్యుటీ రహదారిగా కంపెనీ తెలియజేసింది. ఇండ్ఇన్ఫ్రావిట్ ట్రస్ట్‌ను ఎల్అండ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేసింది. -
రూ . 3.3 లక్షల కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేస్ నిర్మాణం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 3.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో 22 ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మించే భారీ ప్రణాళికను జాతీయ రహదారుల అథీకృత సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణ కోసం స్సెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీ)లను ఏర్పాటు చేయాలని కూడా ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈ మెగా ప్లాన్‌లో భాగంగా తొలుత ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే కోసం తొలి ఎస్పీవీకి ఎన్హెచ్ఏఐ బోర్డు ఆమోదముద్ర వేసింది. పూర్తిగా హైవేస్ అథారిటీ భాగస్వామ్యంతో ఈ ఎస్పీవీ ఏర్పాటైందని అధికారులు తెలిపారు. ఎన్హెచ్ఏఐ స్వతంత్ర సంస్థ కావడంతో ఎస్పీవీకి బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు, బీమా సంస్ధలు, పెన్షన్ నిధుల నుంచి రుణాలు పొందడం సులభతరం కానుంది. కాగా, రూ 45,000 కోట్ల విలువైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే కోసం ఏర్పాటైన తొలి ఎస్పీవీలో ఎన్హెచ్ఏఐ రూ 5000 కోట్లు వెచ్చిస్తుండగా, మిగిలిన 40,000 కోట్లను రుణ మార్కెట్ నుంచి సమీకరించనున్నారు. భారత మౌలిక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు, పెన్షన్ నిధుల సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులు సైతం ఆసక్తికనబరుస్తున్నారని ఎన్హెచ్ఏఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి : ఆ రోడ్డు ఖర్చు భరించలేం : ఢిల్లీ ప్రభుత్వం -
అమరావతి చుట్టూ 4 ఎక్స్‌ప్రెస్ వేలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నాలుగు ఎక్స్‌ప్రెస్ వేలు రూపుదిద్దుకోనున్నాయి. ఇప్పటి వరకు ఓ ఎక్స్‌ప్రెస్ వేకు (మణిపాల్ ఆస్పత్రి నుంచి హరిశ్చంద్రపురం వరకు) మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) రూపొం దించేందుకు కసరత్తు చేస్తున్న రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) మరో మూడు ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. వీటిలో గుంటూరు జిల్లా పరిధిలో మంగళగిరి వై-జంక్షన్ ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అనంతవరం వరకు, వెంకటపాలెం నుంచి ఎన్ఆర్ఐ ఆస్పత్రి వరకు, కృష్ణా జిల్లాలో జూపూడి నుంచి బోరుపాలెం మీదుగా అనంతవరం వరకు ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మించనున్నారు. మణిపాల్ ఆస్పత్రి నుంచి లోటస్ ఫుడ్ సిటీ మీదుగా ఉండవల్లి ఇస్కాన్ టెంపుల్, హరిశ్చంద్రపురం వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్ వే ఇస్కాన్ టెంపుల్ వద్ద ఆర్డియల్ రోడ్డుగానూ, ఎక్స్‌ప్రెస్ వేగా రెండుగా చీలుతుంది. రాజధాని ప్రాం తంలో ఆర్టియల్ రోడ్లన్నీ 165 అడుగుల మేర విస్తరించనున్నారు. ఎక్స్‌ప్రెస్ వేలు 200 అడుగుల మేర నిర్మించనున్నారు. ఈ నెల 23న రాజధాని రోడ్ల మ్యాప్ విడుదల చేసేందుకు సీఆర్డీఏ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఎక్స్‌ప్రెస్ వేలతో గ్రామాలను కదిలించక తప్పదా? రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తే గ్రామాలను కదిలించక తప్పదనే అభిప్రాయం అధికారుల నుంచే వినిపిస్తోంది. రాజధాని నిర్మాణంలో గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో కదిలించబోమని పలుమార్లు మున్సిపల్ మంత్రి నారాయణ రాజధాని గ్రామాల్లో ప్రచారం చేశారు. అయితే ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణంతో గ్రామాలను కదిలిస్తారా? లేదా? అన్నది సీఆర్డీఏ అధికారులే స్పష్టత ఇవ్వలేకపోవడం గమనార్హం.