అమరావతి చుట్టూ 4 ఎక్స్‌ప్రెస్ వేలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నాలుగు ఎక్స్‌ప్రెస్ వేలు రూపుదిద్దుకోనున్నాయి. ఇప్పటి వరకు ఓ ఎక్స్‌ప్రెస్ వేకు (మణిపాల్ ఆస్పత్రి నుంచి హరిశ్చంద్రపురం వరకు) మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) రూపొం దించేందుకు కసరత్తు చేస్తున్న రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) మరో మూడు ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. వీటిలో గుంటూరు జిల్లా పరిధిలో మంగళగిరి వై-జంక్షన్ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి అనంతవరం వరకు, వెంకటపాలెం నుంచి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి వరకు, కృష్ణా జిల్లాలో జూపూడి నుంచి బోరుపాలెం మీదుగా అనంతవరం వరకు ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మించనున్నారు.
మణిపాల్ ఆస్పత్రి నుంచి లోటస్ ఫుడ్ సిటీ మీదుగా ఉండవల్లి ఇస్కాన్ టెంపుల్, హరిశ్చంద్రపురం వరకు నిర్మించే ఎక్స్‌ప్రెస్ వే ఇస్కాన్ టెంపుల్ వద్ద ఆర్డియల్ రోడ్డుగానూ, ఎక్స్‌ప్రెస్ వేగా రెండుగా చీలుతుంది. రాజధాని ప్రాం తంలో ఆర్టియల్ రోడ్లన్నీ 165 అడుగుల మేర విస్తరించనున్నారు. ఎక్స్‌ప్రెస్ వేలు 200 అడుగుల మేర నిర్మించనున్నారు. ఈ నెల 23న రాజధాని రోడ్ల మ్యాప్ విడుదల చేసేందుకు సీఆర్‌డీఏ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.
ఎక్స్‌ప్రెస్ వేలతో గ్రామాలను కదిలించక తప్పదా?
రాజధాని ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ వేలు నిర్మిస్తే గ్రామాలను కదిలించక తప్పదనే అభిప్రాయం అధికారుల నుంచే వినిపిస్తోంది. రాజధాని నిర్మాణంలో గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లో కదిలించబోమని పలుమార్లు మున్సిపల్ మంత్రి నారాయణ రాజధాని గ్రామాల్లో ప్రచారం చేశారు. అయితే ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణంతో గ్రామాలను కదిలిస్తారా? లేదా? అన్నది సీఆర్‌డీఏ అధికారులే స్పష్టత ఇవ్వలేకపోవడం గమనార్హం.