భారత రోడ్లపైకి ఎంవీ అగస్టా బైక్స్
పుణే: ఇటలీకి చెందిన ప్రీమియం హైపర్ఫార్మెన్స్ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ ఎంవీ అగస్టా భారత్‌లోకి అడుగుపెట్టింది. కంపెనీ తాజాగా ‘ఎఫ్4’, ‘ఎఫ్3’, ‘బ్రుటలె’ అనే మూడు మోడళ్లను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి డిస్ట్రిబ్యూషన్ కోసం కైనటిక్ గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బైక్స్ ధర రూ.16.78 లక్షలు-రూ.35.71 లక్షల శ్రేణిలో (ఎక్స్‌షోరూమ్ పుణే) ఉంది. ఈ ప్రీమియం బైక్స్ విక్రయాల కోసం కైనటిక్ గ్రూప్ ప్రత్యేకంగా ‘మోటొరాయలె’ డీలర్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం ఇవే దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్.
ఎఫ్4: దీని ప్రారంభ ధర రూ.26.87 లక్షలుగా ఉంది. ఇందులో 998 సీసీ 4 సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. దీని పవర్ 195 హెచ్‌పీ. టార్క్యూ 111 ఎన్ఎం. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 2.4 సెకన్లలో అందుకుంటుంది.
ఎఫ్3: దీని ధర రూ.16.78 లక్షలు. ఇందులో 800సీసీ 3 సిలిండర్ ఇంజిన్, మల్టీ రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
బ్రుటలె: దీని ప్రారంభ ధర రూ.20.10 లక్షలు. ఇందులో 1078 సీసీ 4 సిలిండర్ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీని పవర్ 144 హెచ్‌పీ.