ఖరీదైన చోరీలు..
ప్రపంచమొత్తం మీద నిత్యం ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి. వాటిలో కొన్ని దొంగతనాలు చిన్న చితకాగా ఉన్నప్పటికీ, మరికొన్ని మాత్రం చాలా భారీగా ఉంటాయి. ఇలాంటి దోపిడిల్లో కోల్పోయిన వస్తువుల విలువ చాలా భారీగా ఉంటుంది. అలాంటి భారీ దొంగతనాల గురించి ఓసారి తెలుసుకుందాం..
ఫాబెర్జ్ ఎగ్స్
రష్యాను రాజులు ఏలుతున్న కాలంలో వారి వద్ద అత్యంత విలువైన సంపద ఉండేది. అందులో ముఖ్యమైంది ఫాబెర్జ్ ఎగ్స్ అనే అతి విలువైన వస్తువులు ఉండేవి. వీటిని పీటర్ కార్ల్ ఫాబెర్జ్ అనే వ్యక్తి రూపొందించాడు. ఇవి మొత్తం 52 ఉండేవి. 1917లో రష్యాలో నియంతృత్వమైన రాచరిక పాలనకు వ్యతిరేకంగా బోల్ష్ విక్ విప్లవం మొదలైంది. అ విప్లవంలో పెదఎత్తున పాల్గొన్న ప్రజలు.. రాజ వంశంలోని అందర్ని హత్యచేసి నిర్మూలించారు. ఈక్రమంలో చాలా విలువైన సంపద రాజ భవనం నుంచి అదృశ్యమైంది. అందులో ఈ ఫాబెర్జ్ ఎగ్స్ కూడా మాయమయ్యాయి. అప్పట్లోనే ఒక్కో ఎగ్ విలువ ఒక మిలియన్ డాలర్‌గా ఉండేదని తెలుస్తోంది.
3 టన్నుల బంగారం చోరీ..
ఈ దొంగతనం ఇంగ్లండ్ రాజధాని లండన్‌లో జరిగింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల హీత్రూ విమానశ్రయ ప్రాంగణంలో జరిగింది. నిజానికి దొంగలు విమానశ్రయంలో అత్యంత విలువైన వస్తువులు భద్ర పరిచే గిడ్డంగిలో దొంగతనానికి ప్లాన్ వేశారు. ఈ దొంగతనం ద్వారా 3 మిలియన్ డాలర్ల విలువైన వస్తువుల్ని కొట్టేయాలని అనుకున్నారు. అయితే గిడ్డంగిలోకి ప్రవేశించిన అనంతరం వారికి కళ్లు తిరిగినంత పనైంది. పెద్ద పెద్ద బాక్సులలో 3 టన్నుల బంగారు కడ్డీలు దర్శనమిచ్చాయి. వీటి విలువ 34 మిలియన్ డాలర్లకు సమానం కావడం విశేషం. దొంగతనం జరిగిన తర్వాత చాలా మంది దొంగల్ని పోలీసులు పట్టుకున్నప్పటికీ బంగారాన్ని మాత్రం రికవరీ చేయలేకపోయారు.
డైనోసార్ శిలాజం
వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ డైనోసార్ అస్థిపంజరంలోని ఎముకల దొంగతనం జరిగింది. డైనోసార్లలోని ఉపజాతి అయిన టైరనోసారస్ బాటర్ శిలాజాన్ని 1945 మంగోలియాలో కనుగొన్నారు. అయితే ఈ శిలాజంలోని పూర్తి భాగం మాత్రం 2012లో ఓ రూపు వచ్చింది. ఎందుకంటే ఈ శిలాజంలోని కొన్ని వస్తువులు చోరీకి గురయ్యాయి. అమెరికా వాసి ఎరిక్ ప్రొక్పొయ్ మంగోలియా నుంచి అమెరికాకు ఈ శిలాజంలోని కొంత భాగాన్ని దొంగతనంగా తరలించాడు. ఈ క్రమంలో మన్‌హట్టన్‌లోని ఓ వ్యాపారికి 1.1 మిలియన్ డాలర్లకు అమ్మాలని చూశాడు. దీనిపై సమాచారమందుకున్న ఎఫ్‌బీఐ అధికారులు దాడిచేసి ప్రొక్పోయ్ను అరెస్ట్ చేశారు. నిజానికి పురాతన శిలాజాలను దొంగతనంగా విక్రయించడం ప్రొక్పొయ్ అలవాటని దర్యాప్తులో తెలుసుకున్నారు. అనంతరం డైనోసార్ శిలాజాలను మంగోలియాకు తరలించారు.
మోనాలిసా
ఇటలీకి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి లియోనార్డో డావిన్సీ గీసిన అద్భుత కళాఖండం ‘మోనాలిసా’. ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించిన చిత్ర పటంగా మోనాలిసా గుర్తింపు పొందింది. క్రీ.శ. 1503 కాలంలో రూపుదిద్దుకున్న ఈ కళాఖండం అత్యంత ఖరీదైనది. 1797లో ఫ్రాన్స్ రాజు పారిస్‌లోని లార్విన్ మ్యూజియానికి ఈ చిత్రరాజాన్ని బహుకరించాడు. అయితే 1911లో అదే మ్యూజియంలో పనిచేసే విన్సెంజో పెరుజ్జియా అనే వ్యక్తి దీన్ని దొంగిలించాడు. అయితే మరో రెండేళ్ల తర్వాత ఈ పెయింటింగ్‌ను కనిపెట్టి యథావిథిగా మ్యూజియంలో భద్రపరిచారు. అప్పట్లోనే దీని ధర 100 మిలియన్ డాలర్లు కాగా.. ప్రస్తుతం రెండు బిలియన్లకు పైగా రేటు పలుకుతుంది.
అతిపెద్ద వజ్రాల దొంగతనం..
అత్యంత ఖరీదైన వజ్రాల్ని దొంగలు చిత్రమైన వేషాలు వేసి దొంగలు కొట్టేయడం మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇలాంటి సంఘటనే నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టార్‌డమ్‌లో జరిగింది. అక్కడి కేఎల్ఎమ్ ఏయిర్లైన్స్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇద్దరు దొంగలు ఏయిర్‌లైన్స్ సిబ్బందిలాగా దుస్తులు వేసుకుని స్థానిక షిపోల్ విమానశ్రయంలోకి ప్రవేశించారు. అనంతరం ఖరీదైన వజ్రాలతో లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న భారీ ట్రక్‌ను హైజాక్ చేశారు. ఆఖరికి నిర్మానుష్యంగా ఉన్న చోట ఈ ట్రక్‌ను పోలీసులు కనుగొన్నారు. అయితే అందులో వారికి ఒక్క డైమండ్ కూడా లభించలేదు. దొంగతనానికి గురైన డైమండ్ల విలువ 118 మిలియన్ డాలర్ల పైమాటే కావడం విశేషం.
ఖరీదైన వయోలిన్
శాస్త్రియ సంగీతానికి ఉపయోగించే పరికరాల్లో వయోలిన్ ముఖ్యమైనది. స్ట్రాడివారస్ అనే ప్రముఖ సంస్థ అత్యంత ఖరీదైన, మన్నికైన వయోలిన్ లాంటి పరికరాలను ఉత్పత్తి చేసేది.1727లో ఈ కంపెనీ ఉత్పత్తి చేసిన ఓ వయోలిన్‌ను ప్రముఖ సంగీతకారుడు ఎరికా మోరిన్ ఉపయోగించేవాడు. ఒకరోజున మోరిన్ నివాసముండే అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. దొంగ ఈ వయోలిన్‌ను చోరీ చేశాడు. కాలక్రమంలో మోరిన్ పరమపదించినా ఆ వయోలిన్ జాడ ఇప్పటికీ తెలియలేదు. ఇంతకీ ఆ వయోలిన్ విలువ ప్రస్తుత లెక్కల ప్రకారం 3.5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా..