failed students
-
AP: టెన్త్ ఫెయిల్ అయ్యారా?.. అయితే ఇది మీకోసమే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ‘ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు. చదవండి: ఐఆర్సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో.. రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్‌ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని వివరించారు. విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్‌టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలని నిర్దేశించారు. చదవండి: ఆర్ఆర్బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు పాఠశాలవిద్య కమిషనర్ మార్గదర్శకాలు అందిన వెంటనే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఏర్పాట్లపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు ఏ బాధ్యత నెరవేర్చాలో సూచనలు జారీచేస్తున్నారు. కొందరు డీఈవోలు జారీచేసిన సూచనలు.. ►సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా తన పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులంతా ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలి. ►షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాటు వారి సబ్జెక్టు విభాగం ప్రకారం బాధ్యత ఇవ్వాలి. ►సంబంధిత సీఆర్పీ సహాయంతో గూగుల్ ఫారం ద్వారా రోజువారీ హాజరు నివేదికను డీసీఈబీ సెక్రటరీకి సమర్పించాలి. ►సబ్జెక్టు టీచర్లందరూ తమ సబ్జెక్టుల్లో ఫలితాల మెరుగుదల కోసం సొంత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలి. ►సబ్జెక్టు వారీగా ప్లాన్‌తో పాటు టైమ్‌టేబుల్, దానికోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను గూగుల్ ఫారం ద్వారా ప్రధానోపాధ్యాయులు జూన్ 11వ తేదీ నాటికి డీసీఈబీలకు తెలియజేయాలి. ►రెమిడియల్ తరగతులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. ►ఈ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా డిప్యూటీ డీఈవోలు పర్యవేక్షించాలి. ►తక్కువ పనితీరు కనబరుస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి. -
ఫెయిలైనా ' పీజీ' అడ్మిషన్ దొరుకుతుంది ఇక్కడ
సాక్షి, కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయం అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలు అవుతోంది. పరీక్షల విభాగంలో జరిగే అవకతవకలకు అంతే లేకుండా పోతోంది. ఇక్కడ అధికారులు అనుకుంటే ఏదైనా సాధ్యమే అనేది చాలా సార్లు నిరూపితమైంది. ‘నిబంధనలు వర్తించవు.. ఎన్ని సార్లైనా తప్పులు చేస్తాం..మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు’ అనే ధైర్యంతో చలామణి అవుతున్నారు. గతంలో డిగ్రీ రీవ్యాల్యుయేషన్ సమాధాన పత్రాలు మాయమైనా ఎలాంటి చర్యలు లేవు. గత నాలుగు రోజుల కిత్రం డిగ్రీ సమాధాన పత్రాలు తడిసినా పట్టించుకునే దాఖలాలు లేవు. ఇన్ని తప్పిదాలు జరిగినా ఎలాంటి చర్యలు లేక పోవటంతో తప్పులు చేస్తుండటం పరిపాటిగా మారింది. అలాంటిదే బుధవారం ఒక ఘటన జరిగింది. ఇది గురువారం రోజు బయట పడింది. ఫెయిల్ అయిన డిగ్రీ విద్యార్థినికి ఏకంగా పీజీ కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చారు. అయితే ఈ విద్యార్థిని ఫెయిల్ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఫలితాలు విడుదల కాలేదు. అయినా పరీక్షల విభాగం సీఈ డాక్టర్ వెంకటే«శ్వర్లు..‘‘ ఆ విద్యార్థిని ఫెయిల్ కాలేదు. ఉత్తీర్ణత సాధించారు. సీజీపీఏ 7.58 పాయింట్లు వచ్చాయి’’ అని లిఖిత పూర్వకంగా ఒక కాపీ ఇచ్చారు. దీంతో ఆ అమ్మాయిలో పీజీ సెట్ రెండో విడత కౌన్సె లింగ్ హాజరయ్యారు. గాయత్రీ ఎస్టేట్‌లోని శంకరాస్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ (బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ) డిగ్రీ చదివిన ఒక విద్యార్థిని డిగ్రీ నాలుగోసెమిస్టర్లో జువాలజీ, ఆరో సెమిస్టర్ బాటనీలో ఏడో పేపర్ ఫెయిల్ అయ్యారు. ఈ విద్యార్థిని ఆర్యూ పీజీ సెట్లో బాటనీ కోర్సుకు ప్రవేశ పరీక్ష రాసింది. అందులో 46వ ర్యాంక్ సాధించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులకు రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వర్సిటీ పరీక్షల విభాగం సీఈని కలిశారు. అయిన ఏమి ఆలోచన చేశారో కానీ ఆ విద్యార్థిని ఏప్రెల్, 2019లో డిగ్రీ బీఎస్సీ పూర్తి చేసిందని, సీజీపీఏ 7.58 పాయింట్లతో ఉత్తీర్ణత సాధించిందని, ప్రొవిజినల్ సర్టిఫికెట్‌కు దరఖాస్తు చేసుకున్నారని, అది ప్రాసెస్‌లో ఉందని ఒక లిఖిత పూర్వక లేఖను విద్యార్థినికి ఇచ్చారు. ఆ అమ్మాయి కౌన్సెలింగ్ కేంద్రంలోని అధికారులను కలిసి సంబంధిత లేఖను చూపించారు. కౌన్సెలింగ్‌లో ఉన్న వెరిఫికేషన్ అధికారులు సర్టిఫికెట్లు పరిశీలించినట్లు సంతకాలు చేశారు. సీఈ ఇచ్చిన కాపీని కాకుండా వెరిఫికేషన్ అధికారులు డిగ్రీ మార్కుల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించి ఉంటే జరిగిన తప్పిదం బయట పడేది. ఇవేమీ పట్టించుకోకుండా సీఈ లేఖను ఆధారంగా చేసుకొని వెరిఫికేషన్ పూర్తి చేసి ఆప్షన్లు నమోదు చేసుకోడానికి అనుమతి ఇచ్చారు. ఇది వర్సిటీ అధికారులు నిర్వాకం. ఈ విషయమై సీఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘ఆ విద్యార్థిని డిగ్రీ ఆరో సెమిస్టర్లో ఒక పేపర్ ఫెయిల్ అయింది. రీ వ్యాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. వర్సిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ అమ్మాయి ఉత్తీర్ణత సాధించినట్లు బోనఫైడ్ సర్టిఫికెట్ ఇచ్చాను. తరువాత ఆ అమ్మాయి సమాధాన పత్రాలను రీ వ్యాల్యు చేయించాను. పాస్ అయింది. మార్కుల జాబితా రావాల్సి ఉంది.’’ అని పేర్కొన్నారు. -
అకౌంటెంట్ పరీక్షలో అందరూ ఫెయిలే..
పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్‌కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్ కాలేజీలు విద్యార్థులను ఇలా చేయడం సిగ్గుచేటని శివసేన దుయ్యబట్టారు. -
ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
పాపన్నపేట(మెదక్) : పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరెట్లో అధి కారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను ఈ వేసవి సెలవుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్మాణాలు పూర్తిచేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిం చాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం తరువాత పనులు కొనసాగకూడదన్నారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
12 మంది విద్యార్థుల ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10, 12 తరగతుల పరీక్ష పలితాలు శుక్రవారం విడుదలవ్వగా ఉత్తీర్ణత సాధించలేకపోయిన 11 మంది విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో ఒకే ఇంటికి చెందిన అక్కా తమ్ముళ్లు(సాంతా జిల్లా) రష్మీ(18) దీపేంద్ర(15) కూడా ఉన్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. జాబల్పూర్కు చెందిన విద్యార్థిని ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. రాజధాని భోపాల్‌కు చెందిన నమన్ కడ్వే అనే 10వ తరగతి విద్యార్థి మాత్రం 90 శాతం మార్కులు వస్తాయని ఊహించగా 74 శాతం మార్కులే రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పరీక్షల ఫలితాలు విడుదలైన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 12కు చేరింది. ఫలితాలు వెలువడిన వెంటనే సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు హెల్ప్‌లైన్ నంబర్లకు విద్యార్థుల నుంచి ఫోన్స్ కాల్స్ పోటెత్తాయి. 12 తరగతి పరీక్షల్లో 72 శాతం మంది బాలికలు, 64.16 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. 67.87 శాతం ఉత్తీర్ణత నమోదయింది. 10వ తరగతి పరీక్షల్లో బాలికలు 51.43 శాతం, బాలురు 48.53 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 49.86 శాతం ఉత్తీర్ణత నామోదయింది. -
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు ఉచిత శిక్షణ
రంగారెడ్డి(శంషాబాద్): పదవ తరగతి ఫెయిలైన విద్యార్థులకు మండల కేంద్రంలోని శ్రీ విజ్ఞాన్ కళాశాల ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. జూన్ 3 తేదీ నుంచి గణితం, భౌతికశాస్త్రం సబ్జెక్టులకు సంబంధించి రాబోయే సప్లిమెంటరీ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు కరస్పాండెంట్ సతీష్ వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఫోన్: 9989021453 నంబర్లో సంప్రదించాలన్నారు.