సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈమేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీలు), జిల్లా విద్యాధికారులకు (డీఈవోలకు) పాఠశాలవిద్య కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మార్గదర్శకాలు జారీచేశారు. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ‘ఈనెల 6వ తేదీన ఫలితాలు విడుదలైన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరైన 6,15,908 మంది విద్యార్థుల్లో 2,01,627 మంది ఫెయిలయ్యారు.
చదవండి: ఐఆర్‌సీటీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో..
రెండేళ్లుగా కరోనా వల్ల పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన లేక విద్యార్థుల్లో అభ్యాస నష్టం వల్ల వారంతా ఫెయిలైనట్లు విశ్లేషణలో తేలింది. వీరికి జూలైలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్‌ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని వివరించారు.
విద్యార్థులు, తల్లి దండ్రుల ప్రయోజనార్థం ఈ కోచింగ్ తరగతులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ సంయు క్త సంచాలకులు, జిల్లా విద్యాధికారులు శ్రద్ధ తీసుకుని ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీనికి సం బంధించిన ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. రెమిడియల్ తరగతులు అవసరమైన స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూళ్ల వారీగా ప్రణాళికలను, టైమ్‌టేబుళ్లను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. ఏ టీచర్ ఏ సమయంలో స్కూల్‌లో ఆయా సబ్జెక్టులపై తర్ఫీదు ఇవ్వాలో కూడా జాబితా రూపొందించాలని సూచించారు. ఈ ప్రణాళికలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలని నిర్దేశించారు.
చదవండి: ఆర్‌ఆర్‌బీ అభ్యర్థులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్..
తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు
పాఠశాలవిద్య కమిషనర్ మార్గదర్శకాలు అందిన వెంటనే జిల్లాల్లో క్షేత్రస్థాయి అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టారు. కొన్ని జిల్లాల విద్యాధికారులు ఈ ఏర్పాట్లపై డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు, హెడ్మాస్టర్లకు సూచనలిచ్చారు. క్షేత్రస్థాయి అధికారులతో స్కూళ్ల వారీగా తరగతుల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని స్థానిక పరిస్థితుల ఆధారంగా ఎవరు ఏ బాధ్యత నెరవేర్చాలో సూచనలు జారీచేస్తున్నారు.
కొందరు డీఈవోలు జారీచేసిన సూచనలు..
►సంబంధిత ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా తన పాఠశాలలో టెన్త్ ఫెయిలైన విద్యార్థులంతా ఈ ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడాలి.
►షెడ్యూల్ ప్రకారం తరగతులకు హాజరుకావాలని ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులకు తెలియజేయడంతో పాటు వారి సబ్జెక్టు విభాగం ప్రకారం బాధ్యత ఇవ్వాలి.
►సంబంధిత సీఆర్పీ సహాయంతో గూగుల్ ఫారం ద్వారా రోజువారీ హాజరు నివేదికను డీసీఈబీ సెక్రటరీకి సమర్పించాలి.
►సబ్జెక్టు టీచర్లందరూ తమ సబ్జెక్టుల్లో ఫలితాల మెరుగుదల కోసం సొంత కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని అమలు చేయాలి.
►సబ్జెక్టు వారీగా ప్లాన్‌తో పాటు టైమ్‌టేబుల్, దానికోసం రూపొందించిన ఉపాధ్యాయుల జాబితాను గూగుల్ ఫారం ద్వారా ప్రధానోపాధ్యాయులు జూన్ 11వ తేదీ నాటికి డీసీఈబీలకు తెలియజేయాలి.
►రెమిడియల్ తరగతులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి.
►ఈ కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా డిప్యూటీ డీఈవోలు పర్యవేక్షించాలి.
►తక్కువ పనితీరు కనబరుస్తున్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
Comments
Please login to add a commentAdd a comment