False assurances
-
మోదీ తొమ్మిదేళ్ల పాలనపై... కాంగ్రెస్ 9 ప్రశ్నలు
న్యూఢిల్లీ: కేంద్రంలో మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోసింది. మోదీ తొలిసారిగా ప్రధాని పదవి స్వీకరించి శుక్రవారానికి తొమ్మిదేళ్లయ్యాయి. తప్పుడు హామీలతో జాతిని దగా చేసినందుకు ఈ సందర్భంగా ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ డిమాండ్ చేశారు. ‘నౌ సాల్, నౌ సవాల్ (తొమ్మిదేళ్లు, తొమ్మిది ప్రశ్నలు)’ పేరుతో మోదీకి 9 ప్రశ్నలు సంధిస్తూ బుక్లెట్ విడుదల చేశారు. కోట్లాది మంది నిరుద్యోగ యువత నుంచి తొమ్మిదేళ్లుగా మోదీ పారిపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, విద్వేషం, నిరుద్యోగానికి మోదీయే బాధ్యత వహించాలని రాహుల్ అన్నారు. మోదీకి కాంగ్రెస్ సంధించిన 9 ప్రశ్నలు... 1. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నాయి? ప్రజా ఆస్తుల్ని మోదీ స్నేహితులకి ఎందుకు విక్రయిస్తున్నారు? 2. సాగు చట్టాల రద్దు ఒప్పందాలను ఎందుకు గౌరవించడం లేదు? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లేదేం? 3. మీ స్నేహితుడు అదానీ లబ్ధి కోసం ఎల్ఐసీ, ఎస్బీఐలలో ప్రజలు కష్టించి దాచి పెట్టుకున్న డబ్బుని ఎందుకు ప్రమాదంలో పడేశారు? 4. మీరు క్లీన్చిట్ ఇచ్చిన చైనా భారత భూభాగాలను ఆక్రమించుకుంటోందేం? 5. ఎన్నికల ప్రయోజనాల కోసం విద్వేష రాజకీయాలతో సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు ? 6. సామాజిక న్యాయ పునాదుల్ని ధ్వంసం చేస్తున్నారెందుకు? అణగారిన వర్గాలపై అరాచకాలపై మౌనమెందుకు? 7. ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామ్య సంస్థల్ని ఎందుకు బలహీనపరుస్తున్నారు? విపక్ష నేతలపై కక్ష సాధింపు రాజకీయాలెందుకు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని ధనబలంతో ఎందుకు కూలదోస్తున్నారు? 8. పేదల సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి ఎందుకు బలహీనపరుస్తున్నారు? 9. కోవిడ్‌తో 40 లక్షల మంది పై చిలుకు మరణించినా వారి కుటుంబసభ్యులకు ఇప్పటికీ నష్టపరిహారం ఎందుకు చెల్లించడం లేదు? -
మోదీలా అబద్ధాలు చెప్పను
సుల్తాన్ బతేరి/వయనాడ్: ప్రధాన నరేంద్ర మోదీలా తాను అబద్ధపు హామీలు ఇవ్వనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆచరణ సాధ్యమైన హామీలనే ఇస్తానని, ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన వయనాడ్‌లోని మూడు ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లు తమ భావజాలాన్ని దేశ ప్రజలపై రుద్దాలని చూస్తున్నాయని ఆరోపించారు. దేశ సంస్కృతి, చరిత్ర గురించి ఉద్భోద చేయడానికి అసలు మోహన్ భగవత్ ఎవరని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాల గొంతుకను దేశానికి వినిపించడం ముఖ్యమని భావించానని అన్నారు. దేశంలోని మిగతా ప్రాంతాలు ఎంత ముఖ్యమో దక్షిణాది కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని చాటడం కోసమే ఇక్కడి నుంచి పోటీచేస్తున్నానని వెల్లడించారు. తనను ఒక సోదరుడిలా, కుమారుడిలా భావించాలని వయనాడ్ వాసులను కోరారు. విభిన్న కులాలు, మతాల ప్రజలంతా కలిసి వయనాడ్‌లో నివసిస్తున్నారని తెలిపారు. దేశ ప్రజలంతా కేరళ, వయనాడ్ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అంతకుముందు రాహుల్‌గాంధీ వయనాడ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరునెల్లిని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ అస్థికలను కలిపిన ఈ ప్రాంతంలో ‘బలి తర్పణం’కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీధన్యను కలిసిన రాహుల్ తిరువంబడి: కేరళ నుంచి సివిల్స్ సాధించిన తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందిన వయనాడ్ యువతి శ్రీధన్య సురేష్‌ను రాహుల్ గాంధీ బుధవారం కలిశారు. సుల్తాన్ బతేరీలోని గెస్ట్ హౌస్‌లో శ్రీధన్యతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఓ ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తూ.. శ్రీధన్య సివిల్స్ సాధించడానికి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంట్రీ స్కీమ్ (ఎమ్ఎన్ఏఆర్ఈజీఎస్) తోడ్పడిందని తెలిపారు. -
శాలువాలు కప్పి గోతులు తవ్వొద్దు
ఇల్లందకుంట (హుజూరాబాద్): సోషల్ మీడియాలో అసత్యపు ఆరోపణలు మానుకోవాలని, తనకు ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టబోనని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. కరీంనగర్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనతో మంచిగా ఉంటూ.. శాలువాలు కప్పి వెనకాల గోతులు తవ్వవద్దని ఈటల హితవు పలికారు. వెన్నుపోటు పొడవకుండా ప్రతి ఒక్కరూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీని నమ్ముకొని ఉన్నవారికి సముచిత స్థానం దక్కుతుందని భరోసా ఇచ్చారు. కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
అబద్ధపు హామీల బాబును ఎండగడదాం! : వైఎస్ జగన్
* ప్రజలకు అండగా నిలుద్దాం: జగన్ పిలుపు * ఆరునెలల్లోనే టీడీపీ సర్కారుపై ప్రజల్లో నిరసన * ప్రతిపక్షంగా చంద్రబాబు మోసాలను ఎండగడదాం * వచ్చే నెల 5న అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా చేద్దాం * ప్రకాశం జిల్లా సమీక్షలో తొలిరోజు ఐదు నియోజకవర్గాల నేతలతో భేటీ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబును ఎండగడదాం... టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలైపై ఉద్యమిద్దాం... మనకు ఓట్లేసిన ప్రజలకు అండగా నిలుద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వచ్చే నెల ఐదో తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరా రు. పార్టీని గ్రామస్థాయివరకూ బలోపేతం చేయడమే లక్ష్యంగా సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయన సోమవారం ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు నియోజకవర్గాల సమీక్షలను ప్రారంభించారు. తొలిరోజు కందుకూరు, అద్దంకి, సంతనూతల పాడు, చీరాల, పర్చూరు నియోజకవర్గాల సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు చెప్పిన విషయాలను జగన్ ఆసాంతం విన్నారు. టీడీపీ చేస్తున్న అరాచకాలను కలసికట్టుగా ఎదిరిద్దామంటూ మనోధైర్యం నింపారు. ఇంకా ఆయనేమన్నారంటే... - ఏ ప్రభుత్వానికైనా ప్రజల్లో అసంతృప్తి మూటగట్టుకోవడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. కానీ ఆరు నెలలు తిరగకుండానే చంద్రబాబు మాకు వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే ఇంత వ్యతిరేక పవనాలు వీచిన రాష్ట్రం దేశంలోనే లేదు. మనంకూడా ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా నిలదీయాల్సిన అవసరం ఉంది. - మన పార్టీ అధికారంలోకి వస్తే 30 ఏళ్లపాటు ప్రజలకు గుర్తుండిపోయేలా పాలన అందించాలనుకున్నాను. నాన్న ఫోటో పక్కన ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా ఉండాలని భావించాను. అందుకే అబద్ధపు హామీలు ఇవ్వలేదు. అబద్ధపు హామీలు ఇవ్వడం వల్లనే చంద్రబాబు ధైర్యంగా గ్రామాల్లోకి వెళ్లలేకపోతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఏ చిన్నపిల్లవాడిని అడిగినా ఆయన ఎలా మోసం చేసాడో చెబుతాడు. - 2012 కడప పార్లమెంట్ ఎన్నికలో నేను పోటీ చేసినపుడు నాకు వచ్చిన మెజారిటీ 5.45 లక్షలు. గత ఎన్నికల్లో చంద్రబాబుకూటమికి, మనకు ఓట్ల తేడా కేవలం ఐదు లక్ష లు. రాష్ట్రవ్యాప్తంగా చూసినపుడు ఇది పెద్ద తేడా కాదు. చంద్రబాబు ఇచ్చినట్లుగా మనంకూడా రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అంతకన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవి. ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక్క కోరికతో అడ్డమైన అబద్ధాలు చెప్పిన ఘనత చంద్రబాబునాయుడిదే. రుణమాఫీకి రూ.5 వేల కోట్లా? - రైతు రుణమాఫీకి బడ్జెట్లో కేవలం రూ. ఐదు వేల కోట్లు కేటాయించారు. దీంతో 20 శాతం రుణం మొదటి దశలో మాఫీ చేస్తానని చెప్పారు. రైతుల రుణాలు 87 వేల కోట్లుంటే, డ్వాక్రా రుణాలు 14 వేల కోట్లున్నాయి. మొత్తం కలిపితే రూ.1.01 లక్షల కోట్లు. చంద్రబాబుమాట విని రైతులు వడ్డీలు చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ 14 శాతం కింద మరో రూ.14 వేల కోట్ల భారం పడింది. ఈ ఏడాది ఐదు వేల కోట్లే బడ్జెట్ కేటాయింపు ఉండటంతో వచ్చే ఏడాదికి ఈ వడ్డీ 28 వేల కోట్లకు చేరుతుంది. అసలు సంగతి దేవుడెరుగు. వడ్డీ కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. - తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, జాబు రావాలంటే బాబు రావాలని, జాబు రాకపోతే నిరుద్యోగ భృతి చెల్లిస్తానని పెద్దపెద్ద కటౌట్లు, లైట్లు పెట్టి రాష్ట్రమంతా ఊదరగొట్టారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో నిలదీస్తే తాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని అనలేదని, ప్రైవేటు ఉద్యోగాలు వస్తాయని చెప్పానని దాటవేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోతే సీఎంతో పనేంటి? - గ్రామాల్లో అవ్వా తాతల పెన్షన్ల విషయంలో కూడా మోసం చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల 11 వేల పెన్షన్లున్నాయి. వాటిని వెయ్యి రూపాయలు చేస్తే నెలకి రూ.431 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.3,700 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే కేవలం రూ.1,338 కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టారు. అంటే అవ్వా తాతల పెన్షన్‌లో కూడా రూ.2,400 కోట్లు కోత వేశారు. అసలు ఈ మనిషికి మానవత్వం ఉందా? ఈ పాపంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, టీవీ9 భాగస్వామ్యం - ఇంత మోసం చంద్రబాబు ఒక్కడే చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 కలిసి ఈ మోసపు వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. ఐదేళ్ల తర్వాత కూడా వీరు చంద్రబాబును మోస్తారు. చంద్రబాబు మంచివాడే, ఆర్బీఐ ఒప్పుకోలేదు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదంటూ ప్రచారం చేస్తారు. చంద్రబాబు మాది రిగా మనకు తోడుగా మోసపూరిత పత్రికలు, ఛానళ్లు లేవు. అయినా మనకు ఉన్నది చంద్రబాబుకు లేనిది దేవుని దయ. దేవుడు ఇంతమంది ప్రజల్లో పుట్టించిన ప్రేమానురాగాలను తోడుగా తీసుకుని రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు వెళ్తాం. చంద్రబాబు చేసిన మోసాన్ని, అన్యాయాన్ని ప్రజలకు చెబుదాం.