Faruq
-
గెలిపిస్తేనే ఫరూక్‌కు ప్రమోషన్
– బాబు షరతు నంద్యాల: ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తేనే మాజీ మంత్రి ఫరూక్‌కు ప్రమోషన్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు షరతు విధించారు. ఆయన నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం సంజీవనగర్, శ్రీనివాస జంక్షన్లలో పర్యటించారు. పార్టీనే నమ్ముకున్న ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చానని, కానీ ఉప ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డిని గెలిపిస్తేనే ప్రమోషన్ ఇస్తామని అన్నారు. పట్టణంలో రోడ్ల విస్తరణ పనులను మున్సిపల్ డైరెక్టర్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలుస్తారని చమత్కరించారు. కాగా.. చంద్రబాబుకు సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన ఓ రైతును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఆగ్రహంతో పాసు పుస్తకాలను రోడ్డుపై విసిరేశారు. వెంటనే డీఎస్పీ గోపాలకృష్ణ, సిబ్బంది అతన్ని ఈడ్చుకొని వెళ్లారు. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు
♦ ఆడుకుంటూ ఇరుకైన గోడల మధ్య చిక్కుకున్న బాలుడు ♦ వైఎస్సార్ జిల్లాలో నాలుగు గంటలు ఉత్కంఠ ♦ ఎట్టకేలకు రక్షించిన అగ్నిమాపక సిబ్బంది లక్కిరెడ్డిపల్లె: దసరా సెలవుల్లో దాగుడుమూతలాట ఓ పిల్లాడి ప్రాణాలు మీదికి తెచ్చింది. రెండు ఇళ్ల ఇరుకైన గోడల మధ్య నాలుగు గంటల పాటు ఇరుక్కుపోయిన ఆ బాలుడిని చివరకు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం చింతకుంటవాండ్లపల్లెలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాలివీడు మండలం పూలుకుంట గ్రామానికి చెందిన ఫరూక్(6) దసరా సెలవులు కావడంతో రెండురోజుల క్రితం అమ్మమ్మగారి ఊరైన చింతకుంటవాండ్లపల్లెకు వచ్చాడు. గురువారం పిల్లలంతా కలసి దాగుడుమూతలాట ప్రారంభించారు. ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని భావించిన ఫరూక్ సమీపంలోని రెండు ఇళ్ల గోడల మధ్య ఉన్న 20 అడుగుల పొడవైన ఇరుకైన సందులోకి వెళ్ళి ఇరుక్కుపోయాడు. దాదాపు 10 అడుగుల మేర లోపలికి వెళ్లిన అతను బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఏడుపు లంకించుకున్నాడు. బాలుడి ఏడుపు విన్న ఆ ఇళ్లలోని వారు అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. వారు స్థానికుల సహకారంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. అగ్నిమాపక అధికారి గాబ్రియేల్ సిబ్బందితో పూలుకుంట చేరుకుని డ్రిల్లింగ్ మిషన్ సాయంతో ఓ ఇంటి గోడను తొలగిస్తూ వెళ్లి బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో 4 గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బందిని గ్రామస్తులందరూ అభినందించారు.