Fast and Furious 7
-
బాక్సు బద్దలు కొట్టారు!
అవును! ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీ ధాటికి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ బద్దలైంది. ఏప్రిల్ 2న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 4006 స్క్రీన్లపై విడుదలైన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్- 7 కళ్లుతిరిగే కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తోంది. భారతదేశంలోనే 2800 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా మొదటి వారంలోనే రూ. 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి హాలీవుడ్ చిత్రం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 కావడం విశేషం. గతంలో జేమ్స్ కామెరాన్ రూపొందించిన అవతార్ సినిమా తొలివారంలో రూ.78 కోట్ల వసూళ్లను సాధించింది. ఆ రికార్డును ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చెరిపేసింది. ఏప్రిల్ 2 నుంచి 10 వరకు సాధించిన ఈ వసూళ్లన్ని ప్రధానంగా మల్టీప్లెక్స్, మిని మల్టీప్లెక్స్ స్క్రీన్లద్వారా వచ్చినవేనని యూనివర్సల్ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి సరబ్జిత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. దాదాపు ప్రధాన భారతీయ భాషలన్నింటిలోనూ సిసిమాను డబ్ చేయడం, కారుప్రమాదంలో మరణించిన పాల్ వాకర్ నటించిన చివరిచిత్రం కావడం, ఆద్యాంతం విస్మయం గొలిపే యాక్షన్ సీన్లు ఉండటం వల్లే ఈ మేరకు రికార్డు కలెక్షన్లు సాధ్యమయ్యాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. -
వసూళ్ళలోనూ ఫాస్ట్ అండ్... ఫ్యూరియస్!
మన సినిమాలు తొలి వారంలో ఇక్కడ పదుల కోట్లు వసూలు చేయడం కొత్త కాదు. అదే గనక ఒక హాలీవుడ్ చిత్రం ఇక్కడకు వచ్చి, బాక్సాఫీస్ దుమ్ము దులిపితే? తాజా హాలీవుడ్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7’ ఆ రకంగా వార్తల్లో నిలిచింది. ఏప్రిల్ 2న వచ్చిన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులకే మన దేశంలో బాక్సాఫీస్ వద్ద రూ. 49 కోట్ల మేర నికర వసూళ్ళు సాధించింది. విన్ డీసెల్, డ్వానే జాన్సన్, కీర్తిశేషులు పాల్ వాకర్ నటించిన ఈ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లోని 7వ సినిమా ఆ రకంగా ఇప్పుడు చరిత్రకెక్కుతోంది. భారతదేశంలో రూ. 50 కోట్ల పైగా వసూళ్ళు సాధించిన అతికొద్ది హాలీవుడ్ సినిమాల్లో ఒకటి అవుతోంది. ఇదే ఊపు గనక కొనసాగి, రాగల కొద్దివారాల్లో ఈ సినిమా గనక మరొక్క రూ. 30 కోట్లు వసూలు చేస్తే, మన దేశంలో ఇప్పటి దాకా అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటి దాకా జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలోని ‘అవతార్’ చిత్రం రూ. 78 కోట్ల వసూళ్ళతో భారతదేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన హాలీవుడ్ సినిమా అన్న ఘనత సాధించింది. కాగా, మన దేశంలో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ చిత్రం ఇటు ఇంగ్లీషులోనూ, అటు డబ్బింగ్ వెర్షన్లోనూ కలిపి దాదాపు 1800 నుంచి 2000 స్క్రీన్స్‌లో ప్రదర్శితమవుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్, క్రేజీ ఫైట్లు, పంచ్ డైలాగులతో ఈ చిత్రం భారతీయ ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది. 2013లో అనుకోకుండా జరిగిన కారు ప్రమాదంలో అర్ధంతరంగా కన్నుమూసిన పాల్ వాకర్ నటించిన ఆఖరు చిత్రం కావడం కూడా ఈ సినిమాకు క్రేజు పెంచింది. సినిమాలోని కథ, కథనాలతో పాటు మార్కెటింగ్ కూడా తోడవడంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ప్రస్తుతం భారత్‌లోనే కాక, ప్రపంచమంతటా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. -
హాలీవుడ్ ఛాన్స్ వదులుకున్న దీపిక
బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హాలీవుడ్లో అరంగ్రేటం చేసే అవకాశాన్ని వదులుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘విన్ డీసెల్ ఫ్రాంచైజ్’ నిర్మిస్తున్న ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ చిత్రంలో నటించే అవకాశం వచ్చినా అందుకోలేకపోయింది. డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆమె హాలీవుడ్ ఛాన్స్ మిస్ చేసుకుంది. ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ సినిమాలో నటించడం ఖాయమని అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఈనెల 10 నుంచి డేట్స్ కావాలని నిర్మాతలు అడిగారు. అయితే ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌తో ' హ్యేపీ న్యూ ఇయర్' సినిమాలో దీపిక నటిస్తోంది. అంతేకాకుండా సంజయ్‌లీలా భన్సాలీ 'రామ్ లీలా' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాల్సివుంది. దీంతో ‘ఫాస్ట్ అండ్ ప్యూరియస్-7’ అవకాశాన్ని వదులుకుంది. దీపిక పదుకొనే హాలీవుడ్ అవకాశం వదులుకోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు.