flamen
-
పురోహితులంటే అంత చులకనా!
ప్రతి విషయానికీ చికాకు పడుతున్న పోలీసులు పిండాలను నదిలో కలపకుండా అడ్డగింత గోదావరి పుష్కరాలకంటే దయనీయం సాక్షి, విజయవాడ : పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెబుతున్నా... పిండప్రదానం చేసే భక్తులు, పురోహితులు నానా అవస్థలు పడుతున్నారు. పోలీసుల నుంచి చీదరింపులు, చీత్కారాలు ఎదురవుతున్నాయని పురోహితులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాల్లో పనిచేశామని, అక్కడ కూడా ఇంతగా వేధింపులు లేవని పేర్కొంటున్నారు. పురోహితుల ఆరోపణలు ఇవీ.. ఒకవైపు పిండ ప్రదానం పూజ జరుగుతూనే ఉండంగా శుభ్రత పేరుతో పారిశుధ్య సిబ్బంది నీరు వదులుతున్నారని, దీంతో వారి దుస్తులు తడిసిపోతున్నాయి. తడిదుస్తులతోనే మధ్యాహ్నం వరకూ కూర్చోవాల్సి వస్తోంది. – పావుగంట కంటే ఎక్కువ సేపు పూజ చేయిస్తుంటే త్వరగా ముగించాలంటూ డ్యూటీలో ఉన్న పోలీసులు హుకుం జారీ చేస్తున్నారని, అదేమని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. – ఎక్కువ మంది పురోహితులు ఒకే ఘాట్‌లో కనిపిస్తే బయటకు వెళ్లాలంటూ వేధిస్తున్నారు. పద్మావతి, కృష్ణవేణి ఘాట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. సంగమం వద్దకు వెళ్లమని పోలీసులు సూచిస్తున్నారు. – పిండాలను పట్టుకుని నది వద్దకు రావడంలోనే వలంటీర్లు అడ్డుకుని ఘాట్ చివరకు వెళ్లి వేయాలంటూ ఆక్షలు పెడుతున్నారు. -
పురోహితులపై ఆంక్షలు లేవు
దేవాదాయ శాఖ కమిషనర్ అనూరాధ విజయవాడ(వన్‌టౌన్) : పుష్కరాల్లో భాగంగా పిండ ప్రదానాలు, పుష్కర సంకల్పం నిర్వహించే పురోహితులపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ అన్నారు. పుష్కరాల్లో భాగంగా దేవాదాయ ధర్మదాయ కమిషనర్ అనూరాధ నగరంలోని పున్నమి, దుర్గా, కృష్ణవేణి, పద్మావతి, భవానీ ఘాట్లను శనివారం పరిశీలించారు. అనంతరం దుర్గాఘాట్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ పురోహితులు అన్ని పుష్కర ఘాట్లలో అందుబాటులో ఉండాలన్నారు. యాత్రికుల సంక్పలం, పిండ ప్రదానం తదితర క్రతువుల నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల దృష్ట్యా పురోహితులు ఏ ఘాట్లలోనైనా తమ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. అయితే రద్దీగా ఉన్న ఘాట్లలలోనే పురోహితులు అందరూ ఉంటే మిగిలిన ఘాట్లలోని పుష్కర యాత్రికులకు పురోహితులు దొరకక పలు ఇబ్బందులకు గురవుతారన్నారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో మొదటి రోజున 38 వేల పిండ ప్రదానాలను పుష్కర యాత్రికులు నిర్వహించారన్నారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 27 వేలు, గుంటూరు జిల్లాలో 9600, కృష్ణాజిల్లాలో 1400 పిండ ప్రదానాలు చేశారని వివరించారు.