రూఫ్‘టాప్’లో ఫోర్ సోలార్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ రంగంలో ఉన్న ఫోర్ సోలార్ రూఫ్‌టాప్ విభాగంలో విస్తరిస్తోంది. కంపెనీ ఇప్పటికే 2 మెగావాట్ల ప్రాజెక్టులను పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని జహనుమా వద్ద ఉన్న బాయ్స్ టౌన్ పాఠశాలలో నెలకొల్పిన 100 కిలోవాట్స్ రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్ సోమవారం (నేడు) ప్రారంభం అవుతోంది. 1.5 మెగావాట్ల సామర్థ్యంతో చేపట్టిన కమర్షియల్ రూఫ్‌టాప్ ప్రాజెక్టు ఒకటి నాలుగు నెలల్లో పూర్తి చేయనున్నట్టు ఫోర్ సోలార్ ఫౌండర్ ఇంద్రసేన్ బొల్లంపల్లి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘పలు విద్యా సంస్థల వద్ద ఏర్పాటవుతున్న 800 కిలోవాట్ల ప్లాంట్లు మార్చిలోగా సిద్ధమవుతాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ విభాగంలోకి ప్రవేశించాం. ఇందులో భాగంగా 500 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ పవర్ ప్లాంట్‌ను రెండు నెలల్లో పూర్తి చేస్తున్నాం. ప్రాజెక్టుకయ్యే వ్యయాన్ని కంపెనీ భరిస్తోంది. రూఫ్‌టాప్ ప్లాంట్లకుగాను గృహ, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ ఇస్తోంది. కస్టమర్లు నాలుగైదేళ్లలో పెట్టుబడులపై రాబడి అందుకో వచ్చు’ అని ఆయన వివరించారు.