కలంపై తూటా
* ‘ఫ్రాన్స్ పత్రిక’పై ఉగ్రవాదుల దాడి
* 12 మంది మృతి, 10 మందికి గాయాలు
* పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ పత్రిక కార్యాలయంలో విచక్షణరహితంగా కాల్పులు
* మృతుల్లో ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు
* దేశమంతటా హై అలర్ట్.. ముష్కరులను వేటాడి పట్టుకుంటాం: ఫ్రాన్స్ అధ్యక్షుడు
* దాడిని తీవ్రంగా ఖండించిన ప్రపంచ దేశాలు
ఉగ్రమూకల కర్కశత్వానికి నిదర్శనమీ చిత్రం. పత్రిక కార్యాలయం వద్ద గాయపడి నేలకొరిగిన పోలీసు అధికారి ఒకరు సరెండర్ అయినట్లుగా చేయి పెకైత్తినా.. ‘నన్నే చంపాలనుకుంటావా?’ అంటూ దగ్గరికొచ్చి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఇలా తూటాలు కురిపించి హతమార్చారు.
కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఫ్రాన్స్‌పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ప్రపంచ సంస్కృతుల రాజధానిగా పేరుగాంచిన పారిస్‌లో బీభత్సం సృష్టించారు. నగరంలో ‘చార్లీ హెబ్డో’ అనే వ్యంగ్య వారపత్రిక కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. ఓ కారును హైజాక్ చేసి కార్యాలయం వద్దకు దూసుకొచ్చిన ముష్కరులు ఏకే-47 తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు కార్టూనిస్టులు సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. కార్యాలయ సిబ్బందిపై తూటాల వర్షం కురిపించిన ఉగ్రవాదులు ‘అల్లాహో అక్బర్’ అంటూ నినాదాలు చేస్తూ పారిపోయారు. ఈ ఘటనతో ఫ్రాన్స్‌లో హై అలర్ట్ ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఉగ్రవాదులు ఫ్రాన్స్‌లో ఇంతమందిని పొట్టనబెట్టుకోవడం ఇదే ప్రథమం. దాడిని అమెరికా, రష్యా, భారత్ తదితర దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.
పారిస్: చేతిలో ఏకే-47 తుపాకులు.. భుజాలకు రాకెట్ లాంచర్లు.. ముఖాలకు ముసుగులు.. ఒక్కసారిగా దూసుకొచ్చారు.. విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు.. 12 మంది ప్రాణాలను బలిగొన్నారు.. ఏం జరుగుతుందో తెలిసేలోపే పరారయ్యారు.. వెళ్తూవెళ్తూ ‘ప్రవక్త పగదీర్చుకున్నాడు.. అల్లాహో అక్బర్..’ అంటూ నినాదాలు చేశారు! బుధవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ‘చార్లీ హెబ్డో’ పత్రికా కార్యాలయంపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్ స్టీఫెన్ చార్బోనియర్, ముగ్గురు కార్టూనిస్టులు కబూ, టింగోనస్, విలిన్స్కీ సహా 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు పోలీసులు ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాడిలో పాల్గొన్నది ఎందరో కచ్చితంగా తెలియడం లేదు.
ఇద్దరే ఉన్నారని కొందరు చెబుతుండగా.. నలుగురి దాకా ఉన్నారని మరికొందరు పేర్కొంటున్నారు. పారిపోయిన ఉగ్రవాదులు మరెక్కడైనా దాడికి పాల్పడే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం గట్టి బందోబస్తు చర్యలు చేపట్టింది. కాల్పులు చోటుచేసుకున్న కాసేపటికే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ ఘటనా ప్రదేశాన్ని సందర్శించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద దాడేనని, ముష్కరులను వేటాడి చట్టం ముందు నిలబెడతామని ప్రకటించారు. దాడిని ప్రపంచదేశాల అధినేతలు తీవ్రంగా ఖండించారు.
ఎలా జరిగింది.. ముష్కరులు ముందుగా ఓ కారును హైజాక్ చేసి దాన్ని నేరుగా పత్రికా కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. కారులోంచి దిగుతూనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం కార్యాలయంలోకి దూసుకెళ్లి అక్కడి సిబ్బందిపై తూటాల వర్షం కురిపించారు. అనంతరం అదే కారులో పారిపోయారు. పోతూపోతూ రోడ్డుపై కనిపించినవారిని కూడా కాల్చారు. ‘‘ఉదయం 11.30 గంటల సమయంలో ముఖాలకు ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు కార్యాలయంలోకి దూసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత కాల్పులు జరుపుతూ ఏవో నినాదాలు చేస్తూ పారిపోయారు. వారి భుజాలకు రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి’’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. ‘‘డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నవారిని పోలీసులు వెంబడిస్తున్నారేమోనని అనుకున్నా. తర్వాత వారు ఉగ్రవాదులని తెలిసింది’’ అని మరో ప్రత్యక్ష సాక్షి వివరించారు.
దాడి అందుకేనా..? వ్యంగ్య వారపత్రిక అయిన చార్లీ హెబ్డోకు వివాదాలు కొత్త కాదు. గతంలో అనేకసార్లు వివాదాస్పద కార్టూన్లు ప్రచురించింది. గతంలో డెన్మార్క్ పత్రిక జైలాండ్స్-పోస్ట్ ప్రచురించిన వివాదాస్పద మహమ్మద్ ప్రవక్త కార్టూన్‌ను 2006 ఫిబ్రవరిలో యథాతథంగా అచ్చేసింది. దీంతో ముస్లిం దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. అప్పట్నుంచీ ముస్లిం ఛాందసవాదులకు ఈ పత్రిక టార్గెట్‌గా మారింది. అయినా తీరుమారని చార్లీ హెబ్డో 2011లో మరోసారి ప్రవక్త కార్టూన్‌ను ప్రచురించింది. ఆ సమయంలో పత్రికా కార్యాలయాలపై బాంబు దాడులు జరిగాయి. 2012లో అమెరికాలో కొందరు ‘ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లిమ్స్’ పేరుతో ఓ వివాదాస్పద చిత్రాన్ని తీశారు. ముస్లింలను, ప్రవక్తను కించపరిచారంటూ ఈ చిత్రంపై ముస్లిం దేశాల్లో ఆందోళనలు మిన్నంటుతున్న సమయంలోనే... చార్లీ హెబ్డో మరోసారి ప్రవక్త కార్టూన్‌ను ప్రచురించింది. దీంతో ఆ పత్రికపై మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.
చంపేస్తామంటూ పత్రిక ఎడిటర్‌కు అనేక బెదిరింపులు వచ్చాయి. చివరికి ఆయనకు ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఆ సమయంలో దాడులు జరగొచ్చన్న భయంతో ఫ్రాన్స్ ఏకంగా 20 ముస్లిం దేశాల్లో తమ ఎంబసీలను, కాన్సులేట్లను, సాంస్కృతిక కేంద్రాలను, స్కూళ్లను తాత్కాలికంగా మూసివేసింది. కొన్నేళ్లుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. దాడికి సరిగ్గా ఒక గంట ముందు.. చార్లీ హెబ్డో తన వెబ్సైట్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అబూ బకర్ అల్-బాగ్దాదీ కార్టూన్‌ను పోస్ట్ చేయడం గమనార్హం. దాడిని ఫ్రాన్స్ ముస్లిం మండలి తీవ్రంగా ఖండించింది.
‘‘ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం. కష్టకాలంలో ఉన్న ఫ్రాన్స్‌కు అవసరమైన సాయం చేస్తాం’’
- బరాక్ ఒబామా, అమెరికా అధ్యక్షుడు
‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదు. ఈ దాడిని ఖండిస్తున్నాం. అన్ని చేతులు ఒక్కటైతేనే ఉగ్రవాదాన్ని సమర్థంగా ఓడించగలమని ఈ ఘటన నిరూపించింది’’
- వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
‘‘ప్రపంచంలో ఉగ్రవాదానికి ఎక్కడా చోటు ఉండకూడదు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించేందకు ప్రపంచదేశాలన్నీ ఏకం కావాలి. పారిస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నాం’’
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
‘‘ఇది హేయమైన చర్య. తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతున్నాం’’
- ప్రధాని నరేంద్ర మోదీ
‘‘ఇది పిరికిపందల చర్య. తీవ్రవాదం, అసహనం పత్రికా స్వేచ్ఛను హరించలేవు’’
- సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్