ఈ రోజు కశ్మీర్ స్వేచ్ఛకు అంకితం
భారత్‌లో పాక్ హైకమిషనర్ బాసిత్ తీవ్ర వ్యాఖ్య
►పీఓకే విముక్తి మాత్రమే అపరిష్కృత అంశమని భారత్ ఘాటు జవాబు
న్యూఢిల్లీ/జమ్మూ: కశ్మీర్ అంశంపై భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలను పాక్ కొనసాగిస్తోంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కశ్మీర్ స్వాతంత్య్రానికి అంకితం చేస్తున్నామని, కశ్మీరీ ప్రజలకు దౌత్యపరమైన, రాజకీయ, నైతిక మద్దతు ఇవ్వడాన్ని కొనసాగిస్తామని ఆదివారం భారత్‌లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీ ప్రజల త్యాగాలు వృథా పోవని, వారి రాజకీయ ఆకాంక్షలను సాయుధ బలంతో అణచేయలేరన్నారు. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కూడా ఇస్లామాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
స్వయం పాలన కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కొనసాగిస్తామని ప్రకటించారు. మమ్నూన్ హుస్సేన్, అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలపై భారత ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. పాక్ అక్రమ అధీనంలో ఉన్న జమ్మూ కశ్మీర్‌లోని ప్రాంతాలను విముక్తి కల్పించడమే ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న అపరిష్కృత అంశమని తేల్చిచెప్పింది. ‘జమ్మూకశ్మీర్‌కు సంబంధించి మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు పాక్‌తో ఏమైనా సమస్య ఉందంటే అది పాక్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూకశ్మీర్(పీఓకే) భాగానికి స్వేచ్ఛ కల్పించడమే’ అని పీఎంవో సహాయ మంత్రి జితేందర్‌సింగ్ పేర్కొన్నారు. అలాగే, జమ్మూకశ్మీర్‌కు నిత్యావసర వస్తువులు పంపుతామన్న పాకిస్తాన్ ప్రతిపాదనపై కూడా భారత్ ఘాటుగా స్పందించింది. భారత్‌తో పాటు పొరుగు దేశాలకు మీరు ఇప్పటి వరకూ ఎగుమతి చేసిన ఉగ్రవాదం, చొరబాట్లు చాలని ఎద్దేవా చేసింది.
కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్
జమ్మూ కశ్మీర్‌లోని వాస్తవాధీనరేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. ఈ విషయాన్ని భారత్ వెల్లడించింది. పాక్ సైనికులు రాష్ట్రంలోని రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డారని, పూంచ్ సెక్టార్లో మోర్టార్లతో దాడి చేశారని లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా తెలిపారు.