French court
-
డొమినిక్ పెలికాట్కు 20 ఏళ్ల జైలు
అవిగ్నోన్: తీవ్ర సంచలనం సృష్టించిన కేసులో ఫ్రాన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. భార్యకు మత్తు మందిచ్చి ఇతరులతో అత్యాచారం చేయించడంతోపాటు తీవ్ర లైంగిక వేధింపులకు పాల్పడిన మాజీ భర్త డొమినిక్ పెలికాట్(72)కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసులో మొత్తం 51 మందిని దోషులుగా ప్రకటించింది. మిగతా 50 మందిలో కొందరికి 3 నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్షలను ఫ్రాన్స్‌లోని అవిగ్నోన్ నగర కోర్టు గురువారం ప్రకటించింది. ఇలాంటి నేరాలకు ఫ్రాన్స్‌లో గరిష్ట జైలు శిక్ష 20 ఏళ్లు కావడం గమనార్హం. రేప్‌పై దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన ఈ కేసు విచారణ మూడు నెలలపాటు సాగింది. ఓ డిపార్టుమెంట్ స్టోర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే డొమినిక్ పెలికాట్ 2020లో మొదటిసారిగా మహిళలను డ్రెస్ కింది నుంచి ఫొటో తీస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేసిన పోలీసులకు నివ్వెరపోయే విషయాలు తెలిశాయి. ఇతరులతో కలిసి భార్య గిసెలి పెలికాట్‌ను రేప్, ఇతర వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలు, వీడియోలు 20 వేల వరకు అతడి కంప్యూటర్ డైవ్లలో కనిపించాయి. వాటిలోని ఫోల్డర్లకు అబ్యూజ్, రేపిస్ట్స్, నైట్ ఎలోన్.. తదితర పేర్లు పెట్టాడు డొమినిక్. దశాబ్దకాలంపాటు ఈ ఘోరం కొనసాగింది. గిసెలిపై మొత్తం 72 మంది అత్యాచారం సహా వేర్వేరు నేరాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. వీరిలో డొమినిక్ సహా 51 మందిని మాత్రం గుర్తించిన అధికారులు వివిధ నేరాభియోగాలను మోపారు. -
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి మూడేళ్ల జైలు శిక్ష
పారిస్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి ఆ దేశ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోకు చెందిన న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతి కల్పించారన్న ఆరోపణల నేపథ్యంలో సర్కోజీకి ఈ శిక్ష పడింది. సర్కోజీపై ఆరోపణలతో ఏకీభవించిన ఫ్రెంచ్ న్యాయస్థానం సోమవారం అతన్ని దోషిగా తేల్చింది. సర్కోజీకి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ.. ఆ దేశ నిబంధనల ఏడాది మాత్రమే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాగా, ఈ తీర్పుపై అపీల్ చేసుకునేందుకు ఆయనకు కోర్టు పది రోజుల గడువు ఇచ్చింది. నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన భారీ ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు సందర్భంగా సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు అప్పట్లో సంచలనం రేపాయి. (చదవండి: 2024లో మళ్లీ వస్తా: ట్రంప్) -
కోర్టే ఆ పాపకు పేరు పెట్టబోతోందా?
పిల్లలకు పేరు పెట్టేటప్పుడు బోలెడన్ని ఆలోచిస్తారు తల్లిదండ్రులు. ఏ పేరైతే పిలవడానికి బాగుంటుంది, ఏ పేరైతే కలిసి వస్తుందంటూ వంద లెక్కలు వేస్తారు. పిల్లలకు పేర్లు పెట్టడానికి తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ఒకప్పుడైతే ఏదో ఒక పేరుతో పిలవాలి కాబట్టి పెట్టామా? అంటే పేరు పెట్టేసేవాళ్లు. కానీ ఇప్పుడు పేరు పెట్టాలంటే పుస్తకాలు చూసి, ఇంకెన్నో రిసెర్చ్‌లు చేసి మరీ పెడుతున్నారు?. అయితే కొన్ని దేశాల్లో మన లెక్కలు పని చేయవు. ఎందుకంటే... కొన్ని పేర్లను ఆయా ప్రభుత్వాలు నిషేధించాయి. మనకి ఎంత నచ్చినా కూడా ఆ లిస్టులో పేరు కనుక పెట్టామో ఆ పేరును నిషేధించే అధికారం న్యాయస్థానాలకు ఉంటుంది. తాజాగా ఫ్రెంచ్ దేశంలోని ఒక జంట వారి సంతానానికి ఇలానే పేరు పెట్టారు. అయితే ఈ వ్యవహారం చివరకూ కోర్టు మెట్లు కూడా ఎక్కింది. వివరాల్లోకి వెళితే....గత నవంబర్‌లో ఓ ఫ్రెంచ్ జంట తల్లిదండ్రులయ్యారు. వారికి కలిగిన ఆడ సంతానానికి లియామ్ అని నామకరణం చేశారు. అయితే అది మగవారి పేరు అని, ఆ పేరు ఆమెకు భవిష్యత్తులో నష్టం చేకూర్చేలా ఉందనీ ఒక ప్రాసిక్యూటర్ కోర్టులో కేసు వేశారు. ఆ చిన్నారి పేరును మార్చాలనీ, న్యాయస్థానమే ఆ పాపకు సరైన పేరును సూచించాలని వేడుకున్నారు. అయితే దీనికి వ్యతిరేకంగా ఆ జంట కూడా కేసు వేసింది. తమకు ఇష్టమైన పేర్లు పెట్టుకోవడం ఈ కాలంలో సర్వసాధారణమే అయినా..ఫ్రెంచ్ ప్రభుత్వం మాత్రం పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. అక్కడ కొన్ని పేర్లుపై నిషేధం కూడా ఉంది. ఆ దేశ చట్టం ప్రకారం పిల్లల అభిష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ పేర్లు పెడితే వాటిని రద్దు చేసే అధికారం న్యాయస్థానానికి ఉంది. ఇంతకీ కోర్టు ఆ చిన్నారికి మరి ఏ పేరు పెడుతుందో.. -
నవ్వుతూ ఫొటో దిగితే పాస్‌పోర్టు ఇవ్వరు
పారిస్: ఒకప్పుడు కొత్తగా ఫొటో దిగాలంటే ఎవరికైనా అదోరకమైన ఆందోళన ఉండేది. కెమేరా కంటిలోకి చూడాలంటే కళ్లు మిటకరించేవాళ్లం. మూతి బిగబట్టి బిక్క మొహంతో దిగేవాళ్లం. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో నవ్వుతూ తుళ్లుతూ సరదాగా, అనేక హావభావాలతో అందంగా దిగుతున్నాం. ఫొటోగ్రఫీలో ఇంత విప్లవాత్మక మార్పులు వచ్చిన నేటికి కూడా ఫ్రాన్స్ పాస్‌పోర్టు కార్యాలయం మాత్రం మడి కట్టుకునే కూర్చుంది. పాస్‌పోర్టుకు ఇచ్చే ఫొటోల్లో ఎలాంటి హావభావాలు, అంటే నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టుగానీ, విషాదంగానీ కనిపించకూడదు. ఎలాంటి భావాలు లేకుండా, ఒకరకంగా చెక్క మొహంలా ఉండాలి. పక్కచూపులు చూస్తున్నట్లు అసలు ఉండరాదు, జుట్టు ముందుకు వేలాడేసుకున్నట్లు స్టైయిల్ గా ఉండరాదు. పెదవులు బిగించి, కెమేరా కన్నులోకి చూస్తూ ఫొటో దిగాలి అంతే. లేదంటే ఫొటోను తిరస్కరిస్తుంది. ఫొటోలో నవ్వుతున్నాడన్న కారణంతో ఓ ఫ్రెంచ్ పౌరుడి ఫొటోను ఫ్రెంచ్ పాస్‌పోర్టు కార్యాలయం తిరస్కరించడంతో ఆయన కోర్టుకు ఎక్కారు. ఎప్పుడో కాలతీతమైన నిబంధనలను ఇప్పటికీ పాటించడమేందని, ఈ నిబంధన ప్రజల మానసిన స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్ వాదించారు. ఫ్రెంచ్ ప్రజలను నవ్వొద్దని శాసించడం, ఫ్రెంచ్ సమాజాన్నే కృంగదీస్తుందని కూడా ఆయన ఆరోపించారు. అయినా పారిస్ అడ్మినిస్ట్రేషన్ కోర్టు ఆయన వాదనను వినిపించుకోలేదు. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. కెమేరా కంటిలోకి చూస్తూ, తటస్థ భావంతో పెదాలు బిగించి ఫొటో దిగాలనే నిబంధనలో ఎలాంటి తప్పులేదని తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సదరు పిటిషనర్ ఇప్పుడు పారిస్ అప్పీల్ కోర్టును ఆశ్రయించారు. కెమేరాను చూస్తూ, పెదాలు మూసి ఫొటో దిగాలని మాత్రమే పాస్‌పోర్టు నిబంధన తెలియజేస్తోందని, నవ్వొద్దని చెప్పడం లేదని, పెదాలు మూసి కూడా నవ్వొచ్చని పిటీషనర్ న్యాయవాది రొమేన్ బౌలెట్ మీడియా ముందు వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ‘మోనాలిసో’ చిత్రం కూడా పెదాలు మూసి నవ్వుతున్నట్లే ఉంటుందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాస్‌పోర్ట్ నిబంధనను కొట్టివేస్తూ అప్పీల్ కోర్టు తీర్పు చెబుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. -
రష్యా అభిమానులకు జైలు
యూరో కప్‌లో అల్లర్లు సృష్టించిన రష్యా అభిమానులపై ఫ్రాన్స్ ప్రభుత్వం కఠినచర్యలకు దిగింది. ఇందులో భాగంగా గత మంగళవారం 43 మంది అభిమానులను పోలీసులు అరెస్ట్ చేయగా ముగ్గురికి ఫ్రెంచ్ కోర్టు జైలుశిక్షను విధించింది. ఓ వ్యక్తిని ఇనుపరాడ్‌తో బాదిన యెరునోవ్ అనే అభిమానికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష విధించగా మరో ఇద్దరికి ఏడాదిన్నర, ఏడాది పాటు శిక్ష వేసింది. అయితే తమ దేశస్థుల అరెస్ట్‌ను రష్యా ప్రభుత్వం ఖండించింది. ఈవిషయంలో ఫ్రాన్స్ రాయబారికి సమన్లు పంపింది. అలాగే 20 మంది రష్యా అభిమానులను పోలీసులు ఫ్రాన్స్ నుంచి బహిష్కరించారు.