నవ్వుతూ ఫొటో దిగితే పాస్‌పోర్టు ఇవ్వరు | Don't say cheese: French court upholds ban on passport photo smiling | Sakshi
Sakshi News home page

నవ్వుతూ ఫొటో దిగితే పాస్‌పోర్టు ఇవ్వరు

Published Fri, Sep 30 2016 6:32 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

నవ్వుతూ ఫొటో దిగితే పాస్‌పోర్టు ఇవ్వరు

నవ్వుతూ ఫొటో దిగితే పాస్‌పోర్టు ఇవ్వరు

పారిస్‌: ఒకప్పుడు కొత్తగా ఫొటో దిగాలంటే ఎవరికైనా అదోరకమైన ఆందోళన ఉండేది. కెమేరా కంటిలోకి చూడాలంటే కళ్లు మిటకరించేవాళ్లం. మూతి బిగబట్టి బిక్క మొహంతో దిగేవాళ్లం. సోషల్‌ మీడియా రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో నవ్వుతూ తుళ్లుతూ సరదాగా, అనేక హావభావాలతో అందంగా దిగుతున్నాం. ఫొటోగ్రఫీలో ఇంత విప్లవాత్మక మార్పులు వచ్చిన నేటికి కూడా ఫ్రాన్స్‌ పాస్‌పోర్టు కార్యాలయం మాత్రం మడి కట్టుకునే కూర్చుంది. పాస్‌పోర్టుకు ఇచ్చే ఫొటోల్లో ఎలాంటి హావభావాలు, అంటే నవ్వుతున్నట్టు, ఏడుస్తున్నట్టుగానీ, విషాదంగానీ కనిపించకూడదు. ఎలాంటి భావాలు లేకుండా, ఒకరకంగా చెక్క మొహంలా ఉండాలి. పక్కచూపులు చూస్తున్నట్లు అసలు ఉండరాదు, జుట్టు ముందుకు వేలాడేసుకున్నట్లు స్టైయిల్ గా ఉండరాదు. పెదవులు బిగించి, కెమేరా కన్నులోకి చూస్తూ ఫొటో దిగాలి అంతే. లేదంటే ఫొటోను తిరస్కరిస్తుంది.

ఫొటోలో నవ్వుతున్నాడన్న కారణంతో ఓ ఫ్రెంచ్‌ పౌరుడి ఫొటోను ఫ్రెంచ్‌ పాస్‌పోర్టు కార్యాలయం తిరస్కరించడంతో ఆయన కోర్టుకు ఎక్కారు. ఎప్పుడో కాలతీతమైన నిబంధనలను ఇప్పటికీ పాటించడమేందని, ఈ నిబంధన ప్రజల మానసిన స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషనర్‌ వాదించారు. ఫ్రెంచ్‌ ప్రజలను నవ్వొద్దని శాసించడం, ఫ్రెంచ్‌ సమాజాన్నే కృంగదీస్తుందని కూడా ఆయన ఆరోపించారు. అయినా పారిస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్టు ఆయన వాదనను వినిపించుకోలేదు. ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. కెమేరా కంటిలోకి చూస్తూ, తటస్థ భావంతో పెదాలు బిగించి ఫొటో దిగాలనే నిబంధనలో ఎలాంటి తప్పులేదని తేల్చింది.

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సదరు పిటిషనర్‌ ఇప్పుడు పారిస్‌ అప్పీల్‌ కోర్టును ఆశ్రయించారు. కెమేరాను చూస్తూ, పెదాలు మూసి ఫొటో దిగాలని మాత్రమే పాస్‌పోర్టు నిబంధన తెలియజేస్తోందని, నవ్వొద్దని చెప్పడం లేదని, పెదాలు మూసి కూడా నవ్వొచ్చని పిటీషనర్‌ న్యాయవాది రొమేన్‌ బౌలెట్‌ మీడియా ముందు వ్యాఖ్యానించారు. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన ‘మోనాలిసో’ చిత్రం కూడా పెదాలు మూసి నవ్వుతున్నట్లే ఉంటుందనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పాస్‌పోర్ట్‌ నిబంధనను కొట్టివేస్తూ అప్పీల్‌ కోర్టు తీర్పు చెబుతుందని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement