french writer
-
పట్టనట్టుండే రచయిత
ఆధునిక కాలంలో దాదాపు ఒక సన్యాసిగా బతికిన సుప్రసిద్ధ ‘ఫ్రెంచ్’ రచయిత మిలన్ కుందేరా జూలై 11న తన 94వ ఏట కన్నుమూశారు. ఒక దశ తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నిరాకరించి, అధికారిక జీవిత చరిత్రలు రాయడానికి ఒప్పుకోక, జనానికి దూరంగా, తన గురించి వీలైనంత తక్కువ తెలిసేలా మసలుకున్నారు. రాతలోకి వచ్చినది మాత్రమే జీవితం; రచయిత వ్యక్తిగత జీవితం గురించిన కుతూహలం రచనల సమగ్రతను దెబ్బకొడుతుందనేది ఆయన భావన. కమ్యూనిస్టు రచయితగా మొదలైన కుందేరా, అనంతర కాలంలో ఆ భావజాలంతో పాటు తన మాతృదేశం చెకొస్లొవేకియాకూ, దాని పౌరసత్వానికీ, చివరకు తన మాతృభాష ‘చెక్’కూ దూరం కావాల్సి వచ్చింది. మొదట్లో చెక్ భాషలోనే రాసినప్పటికీ, మలి దశలో ఫ్రెంచ్‌లోనే రాయడానికి నిర్ణయించుకున్నారు. తనను ఫ్రెంచ్ రచయితగానే చూడాలనీ, తన రచనలను ఫ్రెంచ్ భాషవిగానే పరిగణించాలనీ కోరారు. 1929 ఏప్రిల్ 1న జన్మించిన మిలన్ కుందేరా యవ్వనోత్సాహంలో కమ్యూనిస్టు విప్లవాన్ని సమర్థించినవాడే. సోషలిస్టు రష్యాకు జైకొట్టినవాడే. 24వ యేట మొదటి సంపుటి సహా, విప్లవ సమర్థనగా మూడు కవితా సంపుటాలను వెలువరించినవాడే. విమర్శక గొంతులను నిరసిస్తూ, ఇంకా ఎవరినీ లోపలేసి తాళాలు వేయడం లేదు కదా అని వాదించినవాడే. కానీ పై అధికారిని విమర్శించినందుకు ఒకసారీ, పార్టీలో సంస్కరణలు జరగాలని కోరినందుకు మరోసారీ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. దీనివల్ల తనకు విముక్తి లభించిన భావన కలిగిందని తర్వాత చెప్పారాయన. రాయాలనుకుంటున్న థీమ్స్ మీద పెట్టుకున్న మానసిక నిరోధం తొలగినట్టయి రచయితగా మరింత స్వేచ్ఛను పొందారు. ఆయన తొలి నవల ‘ద జోక్’(1967)లో వినోదానికి అనుమతి లేని సంతోషంలో ఉంటారు మనుషులు. ప్రేయసికి రాసిన లేఖలోని ఒక సరదా వాక్యాన్ని (ఆశావాదం అనేది మానవాళి నల్లమందు) కూడా ఓ త్రిసభ్య కమిటీ విచారిస్తుంది. ఈ కారణంగా కథానాయకుడిని పార్టీ నుంచి బహిష్కరించే ఓటింగుకు ఆఖరికి కర్తవ్యోన్ముఖురాలైన అతడి ప్రేయసీ చెయ్యెత్తి సమ్మతిస్తుంది. పార్టీ నుంచి బహిష్కరణ వల్ల కుందేరా తన ప్రొఫెసర్ ఉద్యోగం పోగొట్టుకుని, పియానో వాయించే తండ్రి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని పాఠాలుగా చెబుతూ, దినసరి కూలీగా పనిచేస్తూ, మారుపేరుతో పత్రికలకు జాతక ఫలాలు రాస్తూ బతకాల్సి వచ్చింది. ఆయన ఫోన్ ను ట్యాప్ చేశారు. రచనలను నిషేధించారు. ఒక దశలో సీక్రెట్ పోలీసులు రాతప్రతుల కోసం ఆయన గదిని గాలించారు. అప్పుడే పూర్తయివున్న ‘లైఫ్ ఈజ్ ఎల్స్వేర్’(1973) నవల రాతప్రతిని దాని పేరుకు తగినట్టుగానే స్నేహితుల సాయంతో అప్పటికే ఫ్రాన్స్‌కు తరలించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆయన ఫ్రాన్స్‌కు వెళ్లిపోయారు. 1979లో చెక్ పౌరసత్వం రద్దయింది. 1981లో ఫ్రాన్స్ పౌరసత్వం పొందారు. (నలభై ఏళ్ల తర్వాత, 2019లో మాత్రమే చెక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించారు. గొప్ప చెక్ రచయిత పునరాగమనానికి ప్రతీకగా చూస్తున్నామని చెబుతూ, ఆ చర్యను గొప్ప గౌరవంగా అభివర్ణించింది ప్రభుత్వం.) స్టాలినిస్టు కాని మనిషిని నేను సులభంగా గుర్తించగలిగేవాడిని; ఆయన నవ్వే విధానం నేను భయపడాల్సిన మనిషి కాదని చెప్పేది, అన్నారు కుందేరా. ఆయనకు అత్యంత ప్రసిద్ధి తెచ్చిపెట్టిన నవల ‘ది అన్ బేరబుల్ లైట్నెస్ ఆఫ్ బీయింగ్’ (1984)లో కథానాయిక తమ కుక్కపిల్లను ఒడిలోకి తీసుకుని జోకొడుతూ, ‘భయపడకు, భయపడకు, భయపడకు’ అని దాన్ని ఊరడిస్తుంది. ‘ద బుక్ ఆఫ్ లాఫ్టర్ అండ్ ఫర్గెటింగ్’(1979)లోని ‘అధికారానికి వ్యతిరేకంగా మనిషి చేసే పోరాటం, మరపునకు వ్యతిరేకంగా జ్ఞాపకం చేసే పోరాటం’ అనే వాక్యం చదివినప్పటినుంచీ తనతో ఉండిపోయిందనీ, ప్రపంచంలోని ఘటనల పట్ల తన అవగాహనను ప్రజ్జ్వరిల్లజేసిందనీ చెబుతారు సల్మాన్ రష్దీ. తన రచనా గదిలోని ఒక గోడకు తండ్రి ఫొటోనూ, తన అభిమాన సంగీత కారుడు లియోస్ యానాచెక్ ఫొటోనూ పక్కపక్కనే పెట్టుకున్న కుందేరా, నవల మాత్రమే సాధించేది సాధిస్తూనే అది ఒక మ్యూజికల్ నోట్లా ఉండాలనీ, నవలలోని అందరి కథనాలూ ఏకసూత్రతతో లయబద్ధంగా అమరాలనీ అంటారు. ఒక కామా కూడా ఉండాల్సిన చోట లేకపోతే నచ్చని పర్ఫెక్షనిస్టు ఆయన. చిత్రంగా ఆయన మొదటి నవల జోక్ ఆంగ్లంలో వచ్చినప్పుడు, తన నియంత్రణలో లేని అనువాదం కారణంగా అధ్యాయాలు తారుమారయ్యాయి. దీనివల్ల ‘ఐరనీ’ కాస్తా ‘సెటైర్’ అయ్యింది. 1992లో మాత్రమే ఆయనకు సంతృప్తి కలిగించే అనువాదం వచ్చింది. ఆంగ్లభాషలో ఇది ఐదో వెర్షన్ అని ఆయనే ముందుమాట రాస్తూ నవ్వుకున్నారు. అయితే నవలల పేర్ల విషయంలో మాత్రం ఆయనకు పట్టింపు లేదు. ఒక నవల పేరును ఇంకో నవలకు పెట్టినా సరిగ్గా సరిపోతుందంటారు. తనను పీడించే అంశాలు పరిమితమైనవనేది ఆయన ఉద్దేశం. 2015లో వచ్చిన ‘ద ఫెస్టివల్ ఆఫ్ ఇన్ సిగ్నిఫికెన్స్’ ఆయన చివరి నవల. మలి దశ రచనల్లో రాజకీయాల కంటే తత్వానికి ప్రాధాన్యం ఇచ్చిన కుందేరా, జీవితానికి రెండో అవకాశం లేకపోవడం కూడా ఒక విముక్తి లాంటిదేనంటారు. ప్రపంచ వ్యాప్తంగా జనాలు అర్థం చేసుకోవడం కంటే తీర్పులు ఇవ్వడానికే ఇష్టపడుతున్నారంటూ, ప్రపంచంలోని ఘటనలను మరీ అంత సీరియస్‌గా తీసుకోకపోవడం కూడా ఒక ప్రతిఘటనే అని చెబుతారు. అన్నీ పట్టించుకుంటూనే ఏమీ పట్టనట్టుగా ఉండాలంటే చాలా సంయమనం కావాలి. -
ప్రెంచ్ రచయిత " అనీ ఎర్నాక్స్ " కు నోబెల్ ప్రైజ్
-
గ్రేట్ రైటర్.. మొపాసా
జీవితంలోని ఏకైక అతిముఖ్యమైన విషయం ప్రేమ, అని నమ్మాడు మొపాసా. అందుకే ఆయన కథల్లో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రత్యేక శ్రద్ధ కనబడుతుంది. స్త్రీ కౌగిలి కూర్చగలిగే ధన్యత గురించి రాశాడు. స్త్రీ దుఃఖం పట్ల సానుభూతిని ప్రకటించాడు. స్త్రీ అంతరంగ లోతులను తడిమి చూశాడు. ఫ్రాన్స్‌లో జన్మించిన మొపాసా (1850–93) మొదట చిరుద్యోగిగా పనిచేశాడు. రచనావ్యాసంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే విపరీతమైన పాఠకాదరణ లభించింది. వేగంగా రాశాడు. మూడు వందల కథలు రాసి, ప్రపంచం విస్మరించలేని గొప్ప కథకుల్లో ఒకడిగా నిలిచాడు. ఫ్రెంచ్ సమాజపు ఆత్మను పట్టుకున్న నవలాకారుడిగానూ గుర్తింపుపొందాడు. విపరీతంగా వచ్చి చేరిన సంపదతో సొంత నౌక కొన్నాడు. బెల్ ఎమీ అని దానికి తన నవల పేరే పెట్టాడు. దాని మీదే వివిధ దేశాలు తిరిగాడు. మితిమీరిన స్త్రీ సాంగత్యం ఆయన్ని వ్యాధిగ్రస్థుణ్ని చేసింది. మృత్యువు ముందు నిస్సహాయుడిగా మోకరిల్లేట్టు చేసింది. ఏకాంతంలోకి జారేట్టు చేసింది. విఫల ఆత్మహత్యకు పురిగొల్పింది. తన కథల్లోలాగే అత్యంత సంతోషాన్నీ, అత్యంత దుఃఖాన్నీ అనుభవించిన మొపాసా నాలుగు పదుల వయసులోనే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాడు, పాఠకులకు కూడా ధన్యతను కూర్చే సాహిత్య సంపదను మిగిల్చి. -
గ్రేట్ రైటర్.. స్టెండాల్
ఏమాత్రం ఊహాశక్తి లేని నాన్నంటే తీవ్ర అసంతృప్తి. ఏడేళ్లప్పుడే చనిపోయిన తల్లి గురించిన తీరని శోకం. రష్యాపై నెపోలియన్ చేసిన దాడిలో దగ్ధమవుతున్న మాస్కోను సైన్యపు మనిషిగా చూసిన చారిత్రక అనుభవం. సంగీతం పైనా, స్త్రీలన్నా విపరీతమైన కాంక్ష. ఇదీ క్లుప్తంగా స్టెండాల్ నేపథ్యం. ఎన్నో కలంపేర్లు ఉపయోగించిన తర్వాత, చివరకు తనకు నచ్చిన చరిత్రకారుడు పుట్టిన జర్మనీ నగరం ‘స్టెండాల్’ పేరునే తన కలంపేరుగా స్వీకరించాడు మేరీ హెన్రీ బేల్ (1783–1842). జన్మతహః ఫ్రెంచీయుడు. సాహిత్యంలో వచ్చిన ‘రియలిజం’ (వాస్తవికవాదం) ధోరణికి ఆద్యుడిగా స్టెండాల్ను కీర్తిస్తారు విమర్శకులు. పాత్రల లోలోపలి ఆలోచనలూ భావాలూ లోతుగా వ్యక్తం చేసిన కారణంగా ‘మనస్తాత్విక నవల’ సృష్టికర్తగా కూడా చెబుతారు. ఆమోస్, ద రెడ్ అండ్ ద బ్లాక్, ద చార్టర్హౌజ్ ఆఫ్ పార్మా ఆయన నవలలు. మెమొయిర్స్ ఆఫ్ యాన్ ఈగోటిస్ట్ ఆత్మకథాత్మక రచన. ‘యుద్ధము శాంతి’ నవలలో టాల్‌స్టాయ్ చిత్రించిన వాస్తవిక యుద్ధఘట్టాలకు స్టెండాల్ ప్రేరణ. -
ఫ్రెంచ్ చలం
సత్వం ఉన్న ఒక్కగానొక్క జీవితంలో, మనిషి పొందాల్సిన అతిముఖ్యమైనది ఏమిటి? ఈ ‘మనిషి’, అనేచోట మగవాడిని గనక ప్రతిష్టించుకుంటే, దీనికి జవాబివ్వడం సులువు కావొచ్చు; అప్పటికీ, దీనికి సమాధానం ఒకేవిధంగా ఉండకపోవచ్చు, ఒక్క మొపాసా లాంటివాడికి తప్ప! ‘జీవితంలో ఉన్న ఏకైక ముఖ్యవిషయం- ప్రేమ’! ఇందాక, మనిషి స్థానంలో మగవాడిని ఉంచడానికి కారణం, అతడికి భిన్నమైన లింగానికి మరింత ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికే! స్త్రీ కౌగిలి మాత్రమే మగవాడికి ధన్యతను చేకూర్చుతుంది; అతడి జన్మను చరితార్థం చేస్తుంది. ధనం, కీర్తి - ఇవేవీకూడా, ఒక స్త్రీ ప్రేమను పొందడానికి పనికిరావు. అలా పనికిరానివేవీకూడా మొపాసాకు పొందగలిగినంత విలువైనవి కావు. గై డి మొపాసా, గీ ద మొపాసా, గై ద మొపాసా, గి ది మొపాసా, గీ డ మొపాసా, గీ డీ మొపాసా... రకరకాలుగా ఉచ్చారణ ‘వీలున్న’ పేరు ఆయనది; నిజానికి ఆ వీలుండదు, అసలు ధ్వని తెలియని పరాయిభాష అలాంటి ‘సౌలభ్యం’ కల్పిస్తుంది. సింపుల్‌గా మొపాసా అందాం! మొపాసా స్త్రీని ప్రేమిస్తాడు. బాహ్య రూపురేఖలను మాత్రమేగాక, ఆమె ఆత్మను కూడా దర్శిస్తాడు. ఆమెలోని మంచినీ, ఆమె దుఃఖం పట్ల సానుభూతినీ పాఠకుడికి బదిలీ చేస్తాడు. సమాజంలోని ప్రతి మంచీ ధ్వంసమవుతూ వస్తోంది. నీతిలేని, వివేకరహిత సమాజంలో ప్రతి మంచికీ స్థానం లేదు. దివ్యమూర్తిలాంటి స్త్రీ కూడా ఒక్కోసారి ధ్వంసమవడానికి కారణం ఇదే! స్త్రీని బహుముఖీనంగా చిత్రించాడు మొపాసా(1850-93). మానవనైజంలోని అనేక పార్శ్వాలనూ పట్టుకున్నాడు. కథాయువతికి పట్టుగౌను కుట్టాడు. ‘కొత్తది, వేరే ఎవరూ గమనించలేనిది’ చూశాడు. ఎవరూ చేరుకోలేనంతటి అందమైన వచనాన్ని సృజించాడు. చిరుద్యోగిగా రచనావ్యాసంగం ప్రారంభించి, వెన్వెంటనే విపరీతమైన ఆదరణ పొందాడు. పదేళ్ల కాలంలో వేగంగా 300 కథలు, 6 నవలలు రాశాడు. ‘లె మిజెరెబుల్స్’(హ్యూగో) తర్వాత ఫ్రెంచ్ సమాజాన్ని పట్టించిన గొప్ప నవలగా మొపాసా ‘ఉనె వి’ (ఒక జీవితం) పేరుతెచ్చుకుంది. ‘నా బాస్ తలనొప్పిగా ఉందన్నా ఇంటికి వెళ్లడానికి అనుమతించలే’దని తల్లికి ఉత్తరం రాసిన మొపాసా... ఉద్యోగానికి స్వస్తి పలికాడు. పుస్తకాలతో వచ్చిన పేరు, పేరుతో ఒనగూడిన సంపదతో నౌక కొన్నాడు. తన తొలి నవల పేరుమీదుగా ‘బెల్ ఎమీ’ (అందమైన స్నేహితుడు)గా దానికి నామకరణం చేశాడు. అందులో అల్జీరియా, ఇటలీ, ఇంగ్లండ్, సిసిలీలాంటి దేశాల్లో పర్యటించాడు. తన అపార్టుమెంటులోని ఒక రహస్య మూలను, అందమైన స్త్రీల చెవుల్లో తన సాహసయాత్రలు వర్ణించి చెప్పటానికే వినియోగించాడు. ఫలితంగా సుఖవ్యాధి బారిన పడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది. ‘పళ్లను వదులుచేసి, వెంట్రుకలను రాల్చి, అవయవాల్ని ధ్వంసం చేసి మింగేయడానికి వచ్చే మృత్యువు’ ముంగిట శక్తిలేక కూలబడ్డాడు. ఎలుకను వేటాడే పిల్లిలాగా అది తరుముతూవుంటే ఎటూ తప్పించుకోలేక నిస్సహాయుడయ్యాడు. ఏకాంతంలోకీ, స్వీయధ్యానంలోకీ పోవడం మొదలుపెట్టాడు. తీవ్రమైన నిరాశలో గొంతు కోసుకుని ప్రాణం తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. జీవనశైలిని కాకుండా రచనాశైలినే పరిగణిస్తే- చలానికి ప్రకృతి వయసు పొడిగించింది కాబట్టి, దాన్ని ఆయన మరింత ‘సార్థకం’ చేసుకున్నట్టుగా కనబడుతుంది; ఆ అవకాశం మొపాసాకు లేదు. 43వ పుట్టినరోజు కూడా చూడకుండానే, జీవితరంగం నుంచి నిష్ర్కమించాడు. శృంగారాన్ని అన్ని కోణాలనుంచీ తరచిచూసి, కీలకమైన ఆధ్యాత్మిక ముఖాన్ని మాత్రం మొపాసా విస్మరించాడని టాల్‌స్టాయ్ అంటాడు. దానివల్ల పునాదిలేని అందమైన భవనంలాగా ఆయన నిలబడ్డాడని విమర్శించాడు. అయితే, ‘ఆధ్యాత్మిక జననం’ జరిగేలోగా మరణించాడనీ, అయినప్పటికీ, ఆయన సృష్టించినది తక్కువేమీకాదనీ, దానికే మనం కృతజ్ఞులమై ఉండాలనీ చెబుతాడు. ‘నేను ప్రతిదాన్నీ కాంక్షించాను, ఎందులోనూ ఆనందం పొందలేకపోయాను,’ అని తన సమాధిఫలకాన్ని లిఖించుకున్నాడు మొపాసా. ఆయనే చెప్పుకున్నట్టుగా, ఉల్కలాగా సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించాడు; పిడుగులాగా వెళ్లిపోయాడు. ‘అత్యంత సంతోషంగానూ, భయానక దుఃఖంలోనూ’ గడిపివెళ్లిపోయాడు. - ఆర్.ఆర్.