జీవితంలోని ఏకైక అతిముఖ్యమైన విషయం ప్రేమ, అని నమ్మాడు మొపాసా. అందుకే ఆయన కథల్లో స్త్రీ పురుష సంబంధాల మీద ప్రత్యేక శ్రద్ధ కనబడుతుంది. స్త్రీ కౌగిలి కూర్చగలిగే ధన్యత గురించి రాశాడు. స్త్రీ దుఃఖం పట్ల సానుభూతిని ప్రకటించాడు. స్త్రీ అంతరంగ లోతులను తడిమి చూశాడు. ఫ్రాన్స్‌లో జన్మించిన మొపాసా (1850–93) మొదట చిరుద్యోగిగా పనిచేశాడు. రచనావ్యాసంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే విపరీతమైన పాఠకాదరణ లభించింది. వేగంగా రాశాడు.
మూడు వందల కథలు రాసి, ప్రపంచం విస్మరించలేని గొప్ప కథకుల్లో ఒకడిగా నిలిచాడు. ఫ్రెంచ్ సమాజపు ఆత్మను పట్టుకున్న నవలాకారుడిగానూ గుర్తింపుపొందాడు. విపరీతంగా వచ్చి చేరిన సంపదతో సొంత నౌక కొన్నాడు. బెల్ ఎమీ అని దానికి తన నవల పేరే పెట్టాడు. దాని మీదే వివిధ దేశాలు తిరిగాడు. మితిమీరిన స్త్రీ సాంగత్యం ఆయన్ని వ్యాధిగ్రస్థుణ్ని చేసింది. మృత్యువు ముందు నిస్సహాయుడిగా మోకరిల్లేట్టు చేసింది. ఏకాంతంలోకి జారేట్టు చేసింది. విఫల ఆత్మహత్యకు పురిగొల్పింది. తన కథల్లోలాగే అత్యంత సంతోషాన్నీ, అత్యంత దుఃఖాన్నీ అనుభవించిన మొపాసా నాలుగు పదుల వయసులోనే ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాడు, పాఠకులకు కూడా ధన్యతను కూర్చే సాహిత్య సంపదను మిగిల్చి.
Comments
Please login to add a commentAdd a comment