రూ.307 కోట్ల ఎఫ్టీఐఎల్ ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ: జిగ్నేష్ షా ఫైనాన్షియల్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఎఫ్టీఐఎల్)కు చెందిన రూ.306 కోట్ల విలువైన ఆస్తులను(మ్యూచువల్ ఫండ్స్) ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) గురువారం జప్తు(అటాచ్) చేసింది. ఈ మేరకు తమకు ఈడీ(ముంబై విభాగం) నుంచి ప్రాథమిక ఆదేశాలు జారీ అయ్యాయని ఎఫ్టీఐఎల్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. దీనిపై తదుపరి చర్యలకు తమ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్కు అనుమతులను పొందేవిషయంలో నిబంధనలను ఉల్లంఘించడం, వాస్తవాలను దాచిపెట్టడం, మోసం ఆరోపణలపై తాజాగా సీబీఐ జిగ్నేష్ షాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మరోపక్క, జిగ్నేష్ షా ప్రమోట్ చేసిన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్లో 2013 ఆగస్టులో రూ.6,000 కోట్ల మేర స్కామ్ వెలుగుచూసినప్పటినుంచీ షాపై పలు అభియోగాలు నమోదవుతున్నాయి. స్కామ్ తర్వాత ఎఫ్టీఐఎల్లో ఎన్ఎస్ఈఎల్ను విలీనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కార్పొరేట్ వ్యవహారాల శాఖ జారీ చేసిన తుది ఆదేశాల అమలుకు ఈ నెల 26 వరకూ బాంబే హైకోర్టు స్టే మంజూరు చేసింది.