‘ఆసరా’ ఇవ్వరా..?
గజ్వేల్/రామాయంపేట/రేగోడు/జగదేవ్‌పూర్ : ప్రజ్ఞాపూర్‌లోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉదయం అధికారులు పింఛన్లు ఇవ్వడానికి సన్నద్దమయ్యారు. ఈ క్రమంలో ఒక్కొక్కరి పేర్లు చదువుతూ పంపిణీ చేపడుతుండగా.. ఆ జాబితాలో చోటు దక్కని వారంతా ఒకచోట చేరి అధికారులు తీరుపై నిప్పులు చెరిగారు. తమకు అన్ని రకాల అర్హతలున్నా పింఛన్ ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా పక్కనున్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రహదారిపై బైఠాయించారు. ఈ ఆందోళనకు టీడీపీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి సంఘీభావం ప్రకటించి వారితో పాటు ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ రకమైన పరిస్థితి ఉంటే.. మిగితా చోట్ల ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అర్హులందరికీ పథకం అందేవరకు టీడీపీ పక్షాన పోరాటం చేస్తామన్నారు. గజ్వేల్ మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, డీబీఎఫ్ (దళిత బహుజన ఫ్రంట్) జిల్లా అధ్యక్షుడు దాసరి ఏగొండస్వామిలు సైతం ఆందోళనకు మద్దతు పలికారు. రాస్తారోరో కారణంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి కొద్దిసేపు స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ జార్జి సంఘటనా స్థలానికి ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న నగర పంచాయతీ కమిషనర్ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ అర్హల వివరాలను పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
రామాయంపేటలో..
మండల ంలోని అక్కన్నపేట, బచ్చురాజ్‌పల్లి, రామాయంపేటకు చెందిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పలువురు పింఛన్ల కో సం స్థానిక ఎంపీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరికి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు కార్యాలయం ఎదుట భైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భ ంగా పలువురు వృద్ధులు ఎంపీడీఓ అనసూయాబాయితో గొడవకు దిగారు. బీజేపీ నాయకులు వెల్ముల సిద్దరాంలు, నరసింహులు మాట్లాడుతూ పింఛన ్లపేరిట ప్రభుత్వం పేద ప్రజలను మోసగిస్తుందని ఆరోపించారు. అనంతరం వారు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.
రేగోడ్‌లో..
ప్రభుత్వం పంపిణీ చేసే పింఛన్ జాబితాలో పేర్లు లేపోవడంతో మండలంలోని ఖాదిరాబాద్‌కు చెందిన పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సోమవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి గంటపాటు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గతంలో నాలుగువందల మందికి పింఛన్లు మంజూరు కాగా.. ప్రస్తుతం 370 పింఛన్లు మంజూరు చేశారని తెలిపారు. అయితే మిగిలిన 70 మందికి అర్హత ఉన్నా.. అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
ఎంపీడీఓ బయటకు వచ్చి సమాధానం చెప్పాలని నినదించారు. ఎంపీడీఓ రత్నమాల బయటకు రావడంతో ఆమెతో లబ్ధిదారులు గొడవకు దిగారు. పింఛన్ మంజూరు చేయకపోతే ఎలా బతికేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి ధర్నాకు ఖాదిరాబాద్ సర్పంచ్ రమేష్‌జోషీ, దళిత సంఘాల మండల అధ్యక్షుడు దేవరాజ్‌లు మద్దతు తెలిపారు. ఏపని చేతగాని వృద్ధులకు పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదని సర్పంచ్ రమేష్‌జోషీ ఎంపీడీఓను నిలదీశారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని ఎంపీడీఓ తెలిపారు.
జగదేవ్‌పూర్‌లో..
పింఛన్ ఇస్తారా.. లేకుంటే చావమంటారా.. కూలీనాలీ చేసుకుని బతుకేటోళ్లం.. మాకే పింఛన్ రాకపోతే ప్రభుత్వం ఇంకెవ్వరికి ఇస్తారంటూ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన 30 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మండలంలోని గణేష్‌పల్లి చౌరస్తాలో ధర్నాకు దిగారు. వీరికి టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పార్టీల నాయకులు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూమయ్యయాదవ్, యువజన కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి భానుప్రకాష్రావులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఫించన్లు అందిస్తామని చెప్పినసీఎం కేసీఆర్ నేడు అర్హులకు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
దళితుల సంక్షేమమే లక్ష్యమని చెప్పిన సీఎం దళితులకే పింఛన్లు కట్ చేశారని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వీరన్న. తహశీల్దార్ శ్రీనివాసులు, ఈఓఆర్డీ రాంరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నాను విరమించాలని కోరారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ వారం రోజులోగా అర్హులైన వారందరికీ ఫించన్ అందిస్తామని హమీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు కోటయ్య, టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు మల్లేశం, నరసింహులు, బాలకృష్ణరెడ్డి, లింగం, ఎల్లారెడ్డి, ఐలయ్య, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.