ఎంత పనిచేశావు అమ్మా!
పెళ్లై ఏడేళ్ల తరువాత గర్భం
సిజేరియన్ కావచ్చని తెలిపిన వైద్యులు
అవగాహన లేమితో భయపడిన గర్భిణి
ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత
శోకసంద్రంలో గలగల గ్రామం
గుమ్మఘట్ట : అమ్మతనం ఓ మధుర జ్ఞాపకం.. ఎన్నో నోముల పుణ్యఫలం.. అందరిలాగే ఆమె పిల్లల కోసం తపించింది. వివాహమై ఏడేళ్లుగా ఎందరో దేవుళ్లకు మొక్కుకుంది. ఆలయాల చుట్టూ తిరిగింది. వైద్యులు చెప్పినట్లుగా నడుచుకుంది. చివరకు గర్భం దాల్చింది. రోజులు గడిచాయి.. నెలలు నిండాయి.... ఇరుగుపొరుగు.. బంధువులు అట్టహాసంగా సీమంతం చేశారు. ప్రసవ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో తెలియని ఉద్వేగం. ఆరోగ్య పరీక్షలు చేసిన వైద్యులు సిజేరియన్ తప్పదన్నారు. మరో రెండ్రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండగా.. కడుపుకోతకు భయపడి.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ హృదయ విదారక ఘటన గుమ్మఘట్ట మండలం గలగలలో ఆదివారం చోటు చేసుకుంది.
గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన బంగి వన్నూరు స్వామికి అదే గ్రామానికి చెందిన బంగి దురుగమ్మ(26)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. సంతానం కలగకపోవడంతో అందరిలా ఆమె ఆలయాలచుట్టూ, ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ఎంతో డబ్బు ఖర్చు చేసుకుంది. ఏడేళ్ల తర్వాత ఆమె గర్భందాల్చింది. లేకలేక సంతానం కలుగుతోందని తెలిసి ఎంతో సంబరపడింది. బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ వచ్చి సీమంతం కూడా ఘనంగా జరిపించారు.
నెలలు పూర్తికావడంతో నాలుగు రోజుల క్రితం కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంది. మరో రెండు, మూడురోజుల్లో కాన్పు అయ్యే అవకాశం ఉంది. బిడ్డకూడా ఆరోగ్యంగా ఉన్నాడు. సిజేరియన్ తప్పనిసరి అని చెప్పడంతో ఆమె భయపడింది. కడుపుకోస్తారేమోనని బెంగతో శనివారం అర్ధరాత్రి తన తల్లి మారెక్క నిద్రిస్తుండగా వరండాలోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని, నిప్పంటించుకుంది. మంటల దాటికి తట్టుకోలేక కేకలు పెట్టింది. ఆసమయంలో ఇరుగుపొరుగువారు పోగై మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆమెను వెంటనే రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా అంతలోనే ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనతో గలగల గ్రామం విషాదంలో మునిగిపోయింది. ‘దేవుడా ఎంత పనిచేశావయ్యా’.. అంటూ మృతురాలి తల్లి , బంధువులు రోదించడం అందరి కంట కన్నీరు తెప్పించింది. తహసీల్దార్ ఆఫ్జల్ఖాన్ ఆధ్వర్యంలో మృతదేహానికి పంచనామా చేశారు. ఈఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హైదర్వలి తెలిపారు.