బెదిరించి.. రైలు వెనక్కి..
చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ తర్వాత 108వ నెంబర్ గేటు వద్ద గయా ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి జార్ఖండ్ రాష్ట్రంలోని ఫలామా జిల్లాకు చెందిన రాజేందర్ బుయ్యా (45) అనే వ్యక్తి సోమవారం మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి తోటి ప్రయాణికులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..కూలి పనుల కోసం రాజేందర్ బుయ్యాతో పాటు మరో నలుగురు చెన్నైకి వెళ్లేందుకు గయా నుంచి బయల్దేరారు.
రైలు పందిళ్లపల్లి రైల్వేస్టేషన్ దాటిన తర్వాత 107వ నెంబర్ గేటు వద్దకు రాగానే బోగీలోని డోర్ వద్ద కూర్చొని ఉన్న రాజేందర్ బుయ్యా జారిపడ్డాడు. గమనించిన అతని బంధువులు రైలు చైన్‌ను లాగడంతో 108వ నెంబర్ గేటు వద్దకు వచ్చాక ట్రైన్ ఆగింది. పడిపోయిన వ్యక్తిని వెతికేందుకు రైలును వెనక్కి తీసుకెళ్లాలని గార్డుతో బంధువులు ఘర్షణకు దిగారు. గార్డు విన్నపంతో లోకో పైలట్లు రైలును కిలోమీటరు మేరకు 107వ నెంబర్ గేటు వరకు వెనక్కి తీసుకెళ్లారు. ఇక్కడి గేట్‌మన్ ద్వారా పడిపోయిన వ్యక్తి చనిపోయినట్లు గుర్తించారు.
ఈ ఘటనతో రైలు గంటపాటు నిలిచి బయల్దేరింది. మృతదేహాన్ని రైల్వే పోలీసులు పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఖమ్మం తరలించారు. పందిళ్లపల్లి స్టేషన్ మాస్టర్ రైల్వే అధికారుల అనుమతితో గయా ఎక్స్‌ప్రెస్ రైలునుంచి దిగిన కొంతమంది ప్రయాణికులను 107వ నెంబర్ గేటు వద్ద సికింద్రాబాద్ - గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఆపుజేయించి ఎక్కించారు.
ప్రమాద ఘటన, గయా ఎక్స్‌ప్రెస్ నిలవడం కారణాలతో విజయవాడ వైపు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్, గూడ్స్ ైరె ళ్లు గంటపాటు ఆలస్యంగా నడిచాయి. సిగ్నల్ ఇవ్వని కారణంగా 110వ నెంబర్ గేటు వద్ద రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాద సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రైల్వే ఎస్సై రవిరాజు తెలిపారు.