General insurance policy
-
బజాజ్ అలియాంజ్ గ్లోబల్ హెల్త్ ప్లాన్
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఎక్కడైనా హెల్త్ కవరేజీ పొందే ఫీచర్‌తో బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ‘గ్లోబల్ హెల్త్ కేర్’ పేరుతో ఒక పాలసీని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తీసుకున్న వారు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా తమ ఆరోగ్య సమస్యకు చికిత్స తీసుకుని, కవరేజీ పొందొచ్చు. భారత్‌లోనూ కవరేజీ ఉంటుంది. ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సదుపాయాలు ఎక్కడ ఉన్నా, వాటిని పొందే సదుపాయాన్ని కల్పించడమే ఈ ప్లాన్ ఉద్దేశ్యమని బజాజ్ అలియాంజ్ ప్రకటించింది. అలియాంజ్ పార్ట్నర్స్’ భాగస్వామ్యంతో బజాజ్ అలియాంజ్ ఈ పాలసీని తీసుకొచ్చింది. రూ.37.50 లక్షల నుంచి కవరేజీ (బీమా/సమ్ అష్యూర్డ్) ప్రారంభమై, రూ.3.75 కోట్ల వరకు అందుబాటులో ఉంటుంది. ఇంపీరియల్ ప్లాన్, ఇంపీరియల్ ప్లస్ ప్లాన్ అనే రెండు రకాలుగా ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ ప్రకటించింది. హాస్పిటల్లో చేరి తీసుకునే చికిత్సలు, చేరే అవసరం లేకుండా తీసుకునే డే కేర్ ప్రొసీజర్స్, మానసిక అనారోగ్యం, పాలియేటివ్ కేర్, ఎయిర్ అంబులెన్స్, అవయవదాతకు అయ్యే ఖర్చులు, ఆధునిక చికిత్సలకు ఈ ప్లాన్‌లో కవరేజీ ఉంటుంది. ప్రీమియం రూ.39,432తో ప్రారంభమవుతుంది. -
IRDAI: జీవితబీమా పాలసీల ఆవిష్కరణలకూ స్వేచ్ఛ
న్యూఢిల్లీ: తన నుంచి ముందస్తు అనుమతి లేకుండా అన్ని రకాల హెల్త్, సాధారణ బీమా పాలసీల ఆవిష్కరణకు ఇటీవలే అనుమతించిన బీమా రంగ అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ.. తాజాగా జీవిత బీమా పాలసీల విషయంలోనూ ఇదే స్వేచ్ఛ కల్పించింది. జీవిత బీమా సంస్థలు తన నుంచి ముందు అనుమతి తీసుకోకుండా ఉత్పత్తులను ఆవిష్కరించుకోవచ్చని ప్రకటించింది. దీంతో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల రూపకల్పన, ప్రీమియం ధరల్లో వాటికి వెసులుబాటు లభించనుంది. కొత్త ప్లాన్లను ముందుగా విడుదల చేసి, ఆ తర్వాత వాటి అనుమతికి బీమా సంస్థలు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఒక ఉత్పత్తిని వేగంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టొచ్చు. అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడక్కర్లేదు. ముందు అనుమతి తీసుకోవడానికి.. ఉత్పత్తి ఆవిష్కరించిన తర్వాత అనుమతి పొందడానికి మధ్య వ్యత్యాసం ఉంది. ముందస్తు అనుమతి పొందేట్టు అయితే ఎన్నో పరిమితులు, నిబంధనల పరిధిలో ఉత్పత్తుల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. కానీ, అనుమతి తీసుకోకుండా జారీ చేసే ఉత్పత్తుల రూలకల్పన విషయంలో కంపెనీలు స్వేచ్ఛగా వ్యవహరించగలవు. ఇప్పటి వరకు అన్ని రకాల జీవిత బీమా పాలసీలు, రైడర్లకు ముందస్తు అనుమతి అమల్లో ఉండడం గమనార్హం. భారత్‌ను మరింత బీమా రక్షణ కలిగిన దేశంగా మార్చేందుకు సంస్కరణలకు సుముఖంగా ఉన్నట్టు ఐఆర్డీఏఐ ప్రకటించింది. ‘‘మారుతున్న మార్కెట్ ధోరణులకు తగ్గట్టు బీమా పరిశ్రమ వేగంగా స్పందించేందుకు.. ఉత్పత్తుల డిజైన్, ధరలు, వ్యాపార నిర్వహణ సులభతరం చేసేందుకు వీలుగా.. జీవిత బీమా ఉత్పత్తులకు సైతం ‘యూజ్ అండ్ ఫైల్ ప్రక్రియ’ను విస్తరించాలని నిర్ణయించాం’’అని ఐఆర్డీఏఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. దీనివల్ల బీమా సంస్థలు మార్కెట్ అవసరాలకు వీలుగా వేగంగా ఉత్పత్తులను విడుదల చేయగలవని పేర్కొంది. సానుకూలం ఐఆర్డీఏ తీసుకున్న నిర్ణయం పరిశ్రమకు సానుకూలమని పీఎన్బీ మెట్‌లైఫ్ ఎండీ, సీఈవో ఆశిష్ కే శ్రీవాస్తవ తెలిపారు. మరింత ఆవిష్కరణలకు వీలు కల్పిస్తుందని, ప్రజలు తమ భవిష్యత్తుకు సంబంధించి ప్లాన్ల ఎంపికలకు ఆప్షన్లను విస్తృతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది చాలా సానుకూల నిర్ణయమని, ఉత్పత్తులకు అనుమతుల ప్రక్రియల సులభంగా మారినట్టు ఇన్సూరెన్స్బ్రోకర్ ‘సెక్యూర్ నౌ’ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా పేర్కొన్నారు. -
రిలయన్స్ జనరల్ కస్టమైజ్డ్ హెల్త్ ప్లాన్
ముంబై: కస్టమర్లు తమ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఫీచర్లను ఎంపిక చేసుకునే స్వేచ్ఛతో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ‘రిలయన్స్ హెల్త్ గెయిన్’ పేరుతో పాలసీని విడుదల చేసింది. ఈ ప్లాన్‌లో ప్లస్, పవర్, ప్రైమ్ అనే మూడు రకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. రెట్టింపు కవరేజీ (ఒకసారి కవరేజీ అయిపోతే తిరిగి పునరుద్ధరించడం), గ్యారంటీడ్ క్యుములేటివ్ బోనస్ ఇలా పరిశ్రమలో 38 రకాల ప్రధాన ఫీచర్లు ఈ పాలసీలో అందుబాటులో ఉన్న ట్టు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. -
అల్పాదాయ వర్గాలకూ భరోసా..
ఎటువంటి ఆర్థిక సర్వీసులు అందని, కనీసం బ్యాంకు అకౌంటు కూడా లేని కుటుంబాలు దేశ జనాభాలో దాదాపు 66 శాతం ఉన్నాయంటూ ఇటీవ ల ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇక, బీమా కవరేజీ విషయానికొస్తే..90 శాతం పైచిలుకు జనాభాకు ఇన్సూరెన్సే లేదు. ఈ నేపథ్యంలోనే అల్పాదాయ వర్గాలకు బీమా కవరేజీ కల్పించే ఉద్దేశంతో బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏ) మైక్రో - ఇన్సూరెన్స్ పాలసీలను 2005లో అందుబాటులోకి తెచ్చింది. ఇవి జీవిత లేదా సాధారణ బీమా పాలసీల రూపంలో ఉండొచ్చు. సమ్ అష్యూర్డ్ దాదాపు రూ. 50,000 దాకా, ప్రీమియం రూ. 500 నుంచి రూ. 1,000 దాకా ఉండొచ్చు. అటుపైన.. సవరించిన మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధనల ముసాయిదా ప్రకారం కవరేజీ మొత్తాన్ని గరిష్టంగా రూ, 2,00,000 దాకా, గరిష్ట ప్రీమియంను రూ. 6,000కు పరిమితం చేశారు. ఈ పాలసీలు ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాలకు బీమా రక్షణ కల్పిస్తుండగా.. మరోవైపు ఇన్సూరెన్స్ సంస్థలకు కూడా కొత్త మార్కెట్లలోకి చొచ్చుకువెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అల్పాదాయ వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఐఆర్డీఏ.. బీమా కంపెనీలు తమ మొత్తం వ్యాపారంలో నిర్ణీత భాగాన్ని తప్పనిసరిగా మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించడం ద్వారా ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించింది. గ్రామీణ బ్యాంకుల్లో లభ్యం.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు, సహకార బ్యాంకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సెల్ఫ్ - హెల్ప్ గ్రూప్‌లు, డెయిరీ ఫెడరేషన్స్ మొదలైన వాటిలో ఈ పాలసీలు లభిస్తున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం పోస్టర్లు, నాటికలు మొదలైన మాధ్యమాల ద్వారా ఈ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు, తమపై విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే బీమా కంపెనీలు కూడా వేగవంతంగా క్లెయిములను (అన్ని పత్రాలు చేతికి అందిన తర్వాత వీలైతే కొద్ది రోజుల వ్యవధిలోనే) పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. క్లెయిముల తిరస్కరణల సంఖ్య తక్కువగా ఉండాలి. అల్పాదాయ వర్గాలకు క్లెయిముల విషయంలో తగిన తోడ్పాటు అందించాలి.