అల్పాదాయ వర్గాలకూ భరోసా..
ఎటువంటి ఆర్థిక సర్వీసులు అందని, కనీసం బ్యాంకు అకౌంటు కూడా లేని కుటుంబాలు దేశ జనాభాలో దాదాపు 66 శాతం ఉన్నాయంటూ ఇటీవ ల ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇక, బీమా కవరేజీ విషయానికొస్తే..90 శాతం పైచిలుకు జనాభాకు ఇన్సూరెన్సే లేదు. ఈ నేపథ్యంలోనే అల్పాదాయ వర్గాలకు బీమా కవరేజీ కల్పించే ఉద్దేశంతో బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) మైక్రో - ఇన్సూరెన్స్ పాలసీలను 2005లో అందుబాటులోకి తెచ్చింది. ఇవి జీవిత లేదా సాధారణ బీమా పాలసీల రూపంలో ఉండొచ్చు.
సమ్ అష్యూర్డ్ దాదాపు రూ. 50,000 దాకా, ప్రీమియం రూ. 500 నుంచి రూ. 1,000 దాకా ఉండొచ్చు. అటుపైన.. సవరించిన మైక్రో లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధనల ముసాయిదా ప్రకారం కవరేజీ మొత్తాన్ని గరిష్టంగా రూ, 2,00,000 దాకా, గరిష్ట ప్రీమియంను రూ. 6,000కు పరిమితం చేశారు. ఈ పాలసీలు ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాలకు బీమా రక్షణ కల్పిస్తుండగా.. మరోవైపు ఇన్సూరెన్స్ సంస్థలకు కూడా కొత్త మార్కెట్లలోకి చొచ్చుకువెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. అల్పాదాయ వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఐఆర్‌డీఏ.. బీమా కంపెనీలు తమ మొత్తం వ్యాపారంలో నిర్ణీత భాగాన్ని తప్పనిసరిగా మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలను గ్రామీణ ప్రాంతాల్లో విక్రయించడం ద్వారా ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించింది.
గ్రామీణ బ్యాంకుల్లో లభ్యం..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు, సహకార బ్యాంకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సెల్ఫ్ - హెల్ప్ గ్రూప్‌లు, డెయిరీ ఫెడరేషన్స్ మొదలైన వాటిలో ఈ పాలసీలు లభిస్తున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం పోస్టర్లు, నాటికలు మొదలైన మాధ్యమాల ద్వారా ఈ మైక్రో ఇన్సూరెన్స్ పాలసీల గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు, తమపై విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే బీమా కంపెనీలు కూడా వేగవంతంగా క్లెయిములను (అన్ని పత్రాలు చేతికి అందిన తర్వాత వీలైతే కొద్ది రోజుల వ్యవధిలోనే) పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. క్లెయిముల తిరస్కరణల సంఖ్య తక్కువగా ఉండాలి. అల్పాదాయ వర్గాలకు క్లెయిముల విషయంలో తగిన తోడ్పాటు అందించాలి.