General Secretary IYR. Krishnarao
-
ఆ ప్రతిపాదనలను ఆమోదించొద్దు
ప్రభుత్వ శాఖలకు సీఎస్ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో గల ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి షీలాభిడే కమిటీ చేసిన ప్రతిపాదనలను ఆమోదించవద్దని, వాటిని అమలు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు శుక్రవారం అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు లేఖ రాశారు. ఇటీవల విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన 1,253మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ ఉద్యోగులను వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం సూచించినా తెలంగాణ సర్కారు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు ఉద్యోగుల పంపిణీ తేలే వరకు ఈ సంస్థల్లో ఆస్తులు, అప్పుల పంపిణీని చేయరాదంటూ షీలాభిడే కమిటీకి, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. దీని కొనసాగింపుగా ఇప్పటికే ఆస్తులు, అప్పులు పంపిణీ చేసిన ప్రతిపాదనలను అమలు చేయరాదని, తిరిగి షీలాభిడే కమిటీకి పంపించేయాలని అన్ని శాఖలను సీఎస్ ఆదేశించారు. -
అమరావతికి కుటుంబంతో వెళ్తారా? లేదా?
* ఉద్యోగులు వారం రోజుల్లోగా తెలియజేయాలి * నమూనా పత్రాలతో సర్క్యులర్ మెమో జారీ సాక్షి, హైదరాబాద్: ‘ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి లేదా ఏపీలోని ఏ ప్రాంతానికైనా కుటుంబ సమేతంగా వెళ్తారా? లేదా? తెలియజేయండి. వెళ్లేపక్షంలో ఏమైనా వెసులుబాటులు, మినహాయింపులు కోరుకుంటున్నట్టైతే తెలపండి..’ రాష్ట్ర సచివాలయంలో, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరి నుంచి ఈ వివరాలను సేకరించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన నమూనా పత్రాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు మంగళవారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. నూతన రాజధానికి కుటుంబాలతో సహా వెళితే తమ పిల్లలు అక్కడ స్థానికేతరులవుతారని, అందువల్ల తమ పిల్లలకు అక్కడి స్థానికత కల్పించాలని, అందుకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు తీసుకురావాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. అసలు ఎంతమంది ఉద్యోగులు కుటుంబ సమేతంగా నూతన రాజధానికి తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు, వారి పిల్లలు ఎక్కడ ఎంతవరకు చదివారు. పిల్లలను ఏపీ విద్యా సంస్థల్లో చేర్పిస్తారా లేదా? అనే వివరాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ సర్క్యులర్ జారీ చేశారు. ఉద్యోగులందరూ వారం రోజుల్లోగా ఈ వివరాలను సమర్పించాలని మెమోలో పేర్కొన్నారు. ఆ వివరాలను బట్టి ఎంతమంది ఉద్యోగులు హైదరాబాద్‌లో స్థానికత కోరుకుంటున్నారు, ఎంత మంది ఏపీ నూతన రాజధానికి వెళ్లాలని కోరుకుంటున్నారు, అక్కడికి వెళ్లే ఉద్యోగుల పిల్లలు ఎంతమంది ఆటోమెటిక్‌గా అక్కడ స్థానికులవుతారు, ఎంతమంది స్థానికత కోరుకుంటున్నారు.. అనే సమాచారాన్ని ఆయా శాఖల అధిపతులు క్రోడీకరించి ప్రభుత్వానికి పంపించాలని తెలిపారు.