Gestkalam
-
కొలకలూరి కీర్తిలో ‘విమర్శిని’
ఎట్టకేలకు ఆచార్య కొలకలూరి ఇనాక్‌ను సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఈ వార్త చూసిన వారిలో కొంతమందైనా ‘ఏంటి? ఇనాక్‌కి ఇంతకాలం అకాడమీ అవార్డు రాలేదా?’ అని ఆశ్చర్యపోయి ఉంటారు. అందుకు కారణం ఆయన ఆ అవార్డుకు మించి ఎదిగిపోవడమే. జ్ఞాన పీఠ్ వారి ప్రతిష్టాత్మకమైన మూర్తిదేవి పురస్కారంతోపాటు, పద్మశ్రీ కూడా ఇప్పటికే అందుకున్నారాయన. జులై 1, 1939లో గుంటూరు జిల్లా వేజెండ్లలో జన్మించిన ఇనాక్ అంచెలంచెలుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ శ్రీవేంకటేశ్వరి యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ స్థాయి వరకూ ఎది గారు. తన తండ్రి మరణం ప్రేరణతో 1954లో తొలి కథ రాశారు. ఈ దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న దళితుల చరిత్రను వెలికితీస్తూ అనేక గ్రంథాలు వెలువరించారు. చరిత్రలో మరుగునపడిన దళితుల కృషిని ‘ఆది ఆంధ్రుడు’ కావ్యంలో, శూర్పణఖ అంతరంగాన్ని ‘కన్నీటి గొంతు’ కావ్యంలో అపూర్వంగా ఆవిష్కరించారు. అళ్వారుల్లో ప్రసిద్ధుడైన ‘మునివాహనుడు’పై నాటకం రాశారు. ఇక కథలకైతే లెక్కేలేదు. ఊరబావి, అస్పృశ్య గంగ, సూర్యుడు తలెత్తాడు, గులాబీ నవ్వింది, కొలుపులు కథలు పాఠకులకు సుపరిచితం. సర్కార్ గడ్డి, అనంత జీవనం వంటి నవలలు ప్రసిద్ధాలు. వైవిధ్యభరితమైన సమాజాన్ని తన కథల ద్వారా అన్ని కోణాల్లో ఆవిష్కరించారు. దళితులు, దళిత స్త్రీలు, కులవృత్తులవారి కన్నీటితడిని రంగరించుకున్న ఇనాక్ సాహిత్యమంతా అట్టడుగువర్గాల జీవితానికి అద్దంపడుతుంది. తన చుట్టూ వున్న జీవితాల్ని, తాను చూసిన జీవితాల్ని, తాను అనుభవించిన జీవితాన్ని అక్షరాల్లో బందించడం వల్లే ఆయన రచనలన్నీ చెమటవాసనతో గుబాళిస్తుంటాయి. అనేక ప్రక్రియల్లో బడుగుల జీవితాన్ని చిత్రించడం ద్వారా అన్ని వర్గాలను చేరుకోవచ్చనేది ఇనాక్ ఆలోచన. కవిత, కథ, నవల, నాటకం, పరిశోధన, విమర్శ ఏది రాసినా వాటిపై ఆయన ముద్ర స్పష్టం. ఇప్పటి వరకు తొమ్మిది పదులకుపైగా పుస్తకాలను వెలువరించారు. తన రచనలు నచ్చినవారికైనా, నచ్చనివారికైనా; తాను లేవనెత్తిన సమస్యలు అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించడమే ఆయన సాహిత్యం ప్రధాన ఉద్దేశం. ఆయన రచనలు ఆవేశపూరితంగానో, రెచ్చగొట్టేవిగానో ఎప్పుడూ ఉండవు. ఆలోచనాత్మకంగా, నిలకడగా సాగుతూ ఆయా సంఘటనపట్ల పాఠకుడిలో వాస్తవిక దృష్టిని కలిగిస్తాయి. ఆయన రచనలు దేశ, విదేశీ భాషల్లోకి అనువాదమయ్యాయి. పలు విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై అనేకమంది ఎం.ఫిల్, పీహెచ్‌డీలు చేశారు. ఇనాక్‌కు అందని పురస్కారంమంటూ దాదాపు లేదనే చెప్పవచ్చు. ఎప్పుడో అలనాడు జాషువాకు, మధ్యలో ఓసారి బోయి భీమన్నకు దక్కిన అకాడమీ పురస్కారం చాలా ఆలస్యంగానే అయినా ఇనాక్ రచించిన వ్యాస సంపుటి ‘విమర్శిని’ని వరించడం తెలుగు దళిత సాహిత్యానికి కొత్త ఉత్సాహాన్నిస్తుందని భావించవచ్చు. – దేశరాజు (కొలకలూరి ఇనాక్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా) -
ఏ రంగమైనా..రాణించే సత్తా మహిళల సొంతం
గెస్ట్‌కాలమ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్‌గా బ్యాంకింగ్ కెరీర్ ప్రస్థానం ప్రారంభించి.. దేశంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంకు చైర్ పర్సన్ స్థాయికి ఎదిగారు ఉషా అనంత సుబ్రమణియన్. మహిళల్లో ఓర్పు, సహనం, శ్రమించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకునే మార్గాలు తెలియక వంటింటికే పరిమితమయ్యే మహిళలు ఎందరో! అలాంటి మహిళల్లో సాధికారత, స్వావలంబన కల్పించడం.. విద్యార్థినులకు కెరీర్‌పరంగా చేయూతనందించడమే భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) ప్రధాన లక్ష్యాలు అంటున్న ఉషా అనంత సుబ్రమణియన్‌తో ఇంటర్వ్యూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బ్యాంకుకు తొలి చైర్‌పర్సన్‌గా ఎంపికవడంపై మీ స్పందన? ఒక విధంగా ఇది సవాల్. అయితే, నాకు గత 30 ఏళ్లుగా బ్యాంకింగ్ రంగంలోనే పలు హోదాలు నిర్వర్తించిన అనుభవం ఉంది. మహిళా బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన కమిటీలోనూ నేను మెంబర్‌గా ఉన్నా. దాంతో బ్యాంకు విధి విధానాలపైనా అవగాహన వచ్చింది. ఇవన్నీ ప్రస్తుత బాధ్యతలకు న్యాయం చేయడంలో దోహదపడతాయనే విశ్వాసముంది. భారతీయ మహిళా బ్యాంకు లక్ష్యాలు? ప్రధానంగా మహిళలు, విద్యార్థినుల్లో స్వావలంబన, సాధికారత కల్పించడం ఈ బ్యాంకు ప్రధానోద్దేశం. ఇందుకోసం తొలిరోజు నుంచే మహిళలకు ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటికే ఏర్పాటైన బ్రాంచ్‌ల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇదే స్ఫూర్తితో త్వరలోనే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభిస్తాం. దేశంలోని అన్ని ప్రాంతాల మహిళలకు చేరువయ్యేలా అడుగులు వేస్తాం. విద్యార్థినులకు ఉన్నత విద్య పరంగా మహిళా బ్యాంకు నుంచి లభించే చేయూత? విద్యార్థినులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు.. బీఎంబీ సరస్వతీ లోన్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ స్కీం ప్రకారం.. భారత్‌లో ఉన్నత విద్యకు గరిష్టంగా రూ.10లక్షల వరకు.. విదేశీ విద్యకు గరిష్టంగా రూ.20 లక్షల రుణ సదుపాయాన్ని అందజేస్తాం. రూ.4 లక్షల రుణం వరకు ఎలాంటి హామీ లేకుండానే అందిస్తాం. వడ్డీ రేట్ల విషయంలోనూ విద్యార్థినులకు ఒక శాతం రాయితీ సదుపాయం కల్పిస్తున్నాం. మహిళల్లో స్వయం ఉపాధి దిశగా ఎలాంటి ప్రోత్సాహకాలు అందించనున్నారు? మహిళలకు, వారి అర్హతలు, వారు ఎంచుకున్న స్వయం ఉపాధి మార్గాలకు అనుగుణంగా పలు రుణ పథకాలు అమల్లోకి తీసుకొచ్చాం. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా.. మహిళలు మాత్రమే నిర్వహించగల ‘డే కేర్’.. ‘బ్యూటీ కేర్’ సెంటర్ ఏర్పాటు నుంచి.. అత్యున్నత ప్రొఫెషనల్ కోర్సులుగా పేరుగడించిన సీఏ, సీఎస్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి.. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే వారి వరకూ.. పలు రుణ సదుపాయాలు అందచేయనున్నాం. వీటితోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, స్వయం సహాయ బృందాలకు వేర్వేరుగా ప్రత్యేక రుణ పథకాలు రూపొందించాం. కేవలం రుణ పథకాలను ప్రారంభించడంతో సరిపెట్టకుండా.. వాటిని అర్హులైన వారికి అందించే విధంగా స్వీయ లక్ష్యాలు నిర్దేశించుకొని.. తద్వారా మహిళలు సాధికారత సాధించేలా కృషి చేస్తున్నాం. అకడెమిక్‌గా విద్యార్థినులు నేటికీ కొంత వెనుకంజలో ఉన్నారని.. లింగ వివక్షత ఇప్పటికీ కొనసాగుతోందనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? ఇది కొంతమేర వాస్తవమైనప్పటికీ.. గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో పరిస్థితిలో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ప్రతి రంగంలో మహిళల నిష్పత్తి పెరుగుతోంది. నూటికి దాదాపు 40శాతం మంది మహిళలు ప్రతి రంగంలో స్థానం సంపాదించుకుంటున్నారు. ఇది విద్యారంగం నుంచి ఉద్యోగాల వరకూ అన్ని చోట్లా ప్రస్ఫుటమవుతోంది. కెరీర్ పరంగా ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగంలో మహిళలకు గల అవకాశాలు? మహిళలకు చక్కటి కెరీర్ సోపానం బ్యాంకింగ్ రంగం. కూల్ అండ్ కంఫర్ట్ జాబ్ అని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభించాక.. స్వల్ప వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోనూ అవకాశాలున్నప్పటికీ.. ప్రమోషన్లు విషయంలో అమలయ్యే కొన్ని విధానాల కారణంగా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. భారతీయ మహిళా బ్యాంకులో ఖాళీలన్నీ మహిళలతోనే భర్తీ చేస్తారా? అలాంటి నిబంధన లేదు. అధిక శాతం మంది మహిళా సిబ్బంది ఉండేలా యత్నిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 60 బ్రాంచ్‌లు ప్రారంభించాలని యోచిస్తున్నాం. ఇందుకోసం 600 మంది సిబ్బందిని నియమిస్తాం. ఇందులో 400 ఖాళీలను డిప్యుటేషన్ విధానంలో.. 200 ఖాళీలను డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టనున్నాం. భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగ నియామకాలు ఎలా ఉండనున్నాయి? ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సమీప భవిష్యత్తులో వేల అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రతి బ్యాంకు.. ఆధునికీకరణ, శాఖల విస్తరణ కార్యకలాపాలు చేపడుతోంది. దాంతో రానున్న అయిదారేళ్లలో వేల సంఖ్యలో ఖాళీల భర్తీ జరగనుంది. మరోవైపు మరికొన్ని ప్రైవేటు బ్యాంకులకు కూడా అనుమతులిచ్చే అవకాశముంది. కాబట్టి అటు ప్రైవేటు రంగంలోనూ బ్యాంకుల్లో పలు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మీ అభిప్రాయంలో నేటి విద్యార్థినులకు అనుకూలించే రంగం? ప్రస్తుతం ఏ రంగంలోనైనా మహిళలు దూసుకెళ్తున్నారు. కారణం.. మహిళల్లో ఓర్పు, సహనం, శ్రమించే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని సాధనాలుగా చేసుకుంటే నేటి తరం విద్యార్థినులు భవిష్యత్తులో సమున్నత స్థానాలు అధిరోహించొచ్చు. అయితే చాలామంది మహిళల్లో లోపిస్తున్న లక్షణం ‘మొబిలిటీ’(స్థాన చలనం) లేకపోవడం. ఫలితంగా మంచి అవకాశాలు వచ్చినా చేజార్చుకుంటున్నారు. దీనికి మన కుటుంబ సంస్కృతి కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. కాబట్టి మహిళల అభివృద్ధి విషయంలో కుటుంబ స్థాయిలోనే తోడ్పాటుకు పునాది పడితే.. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. కెరీర్ ఎంపికలో విద్యార్థినులు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? మన దేశంలో విద్యార్థినులు ఇప్పటికీ కెరీర్ ఎంపికలో తల్లిదండ్రులు, ఇతరుల సలహాలపైనే ఆధారపడుతున్నారు. దాంతో కొంతకాలం గడిచాక ఆ రంగంలో ఆసక్తి తగ్గిపోయి.. యాంత్రికంగా వ్యవహరిస్తూ కెరీర్ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. మన సమాజంలో మహిళలు ఆశించిన స్థాయిలో ఉన్నతస్థానాల్లో లేకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. నా అభిప్రాయంలో.. ఆసక్తి, అభిరుచుల మేరకే కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే విజయాలు సాధించగలరు. పురుషులు సైతం క్లిష్టంగా భావించే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ, ఖగోళ శాస్త్రం వంటి రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని తమ ఆసక్తికి అనుగుణంగా కెరీర్ ఎంపిక చేసుకోవాలి. మహిళా విద్యార్థులకు మీరిచ్చే సూచన? ప్రస్తుతం దేశంలో మహిళలకు ఎన్నో రకాలుగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి. పాఠశాల స్థాయిలో స్కాలర్షిప్లు మొదలు పీహెచ్డీ ఫెలోషిప్స్ వరకూ.. మహిళలకు ఎన్నో విధాలుగా ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా లింగ సమానత్వం(జెండర్ ఈక్వాలిటీ) దిశగా అన్ని వర్గాలు కృషి చేస్తున్న తరుణంలో ప్రైవేటు రంగం నుంచి కూడా అనేక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ‘మనకు సాధ్యం కాదు’ అనే సనాతన భావన వీడితే సమున్నత స్థానాలు సొంతం చేసుకోవడం ఖాయం.