Gharana Donga
-
ఈ దొంగ కోటీశ్వరుడు..
- 6 కిలోల బంగారం - రూ.5 కోట్ల వజ్రాలు - రూ.2 కోట్ల డబ్బు బంజారాహిల్స్ ఆరు కిలోల బంగారు ఆభరణాలు.. రూ.5 కోట్ల విలువ చేసే వజ్రాభరణాలు.. రూ.2 కోట్ల నగదు.. మొత్తం 28 దొంగతనాలు.. ఇదీ గజదొంగ కర్రి సతీష్‌రెడ్డి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ల పరిధిలో చోరి చేసిన సొత్తు. పోలీసుల దర్యాప్తులో విస్మయం గొలిపే కేసులు వెలుగు చూసున్నాయి. విశాఖకు చెందిన కర్రి సతీష్‌రెడ్డి 2007లో మొదలుపెట్టి.. 2013 వరకు స్థానికంగానే దొంగతనాలకు పాల్పడ్డాడు. 2014లో మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. సంపన్నులు నివాసం ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ -14లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ చీఫ్ సెక్రటరీ హరిహరన్ నివాసంలో మొట్టమొదటి దొంగతనం చేశాడు. ఆ ఇంట్లో రూ.5కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు దొంగిలించి 2016 వరకు దొరక్కుండా పోలీసులకు సవాల్ విసిరాడు. సూర్యాపేట పోలీసులకు ఇటీవల సతీష్ చిక్కడంతో ఈ దొంగతనం కేసులన్నీ వెలుగు చూశాయి. బంజారాహిల్స్పోలీస్స్టేషన్ పరిధిలోనే మొత్తం ఎనిమిది ఇళ్లల్లో దొంగతనానికి పాల్పడ్డాడు. రోడ్ నంబర్ -12లోని ఎమ్మెల్యేకాలనీలో నాలుగు దొంగతనాలు చేశాడు. మొత్తం 13 దొంగతనం కేసుల్లో బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై చిట్టా రూపొందించారు. ఇక జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు దొంగతనం కేసుల్లో నిందితుడు. చోరీ చేసిన సొత్తును వైజాగ్‌లో ఓ రిసీవర్‌కు ఇచ్చేవాడు. అడ్డికి పావుశేరు చందంగా సదరు రిసీవర్ ఈ దొంగ తెచ్చిన సొత్తులో పావుశాతానికి ధర కట్టి మిగతాది నొక్కేసేవాడు. ముఖ్యంగా ఖరీదైన వజ్రాలకు లేకుండానే నొక్కేసినట్లు తేలింది. పోలీసులతో చెట్టాపట్టాల్... దొంగతనాల్లో ఆరితేరిన సతీష్ పోలీసులతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేవాడు. వైజాగ్‌లో ఓ ఏఎస్ఐతో సంబంధాలు పెట్టుకొని చోరీలకు పాల్పడ్డట్లు తేలడంతో ఆ ఏఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. తరచూ దొంగతనాలు చేస్తూ చెడ్డపేరు తెచ్చుకుంటున్న సతీష్‌ను జనజీవన స్రవంతిలో కలపాలని ఏలూరుకు చెందిన ఓ సీఐ చేరదీశాడు. తన పోలీసు జీపుకు డ్రై వర్గా పెట్టుకున్నాడు. ఓ రోజు రాత్రి ఒంటిగంట సమయంలో ఆ సీఐ కుటుంబ సభ్యులను ఇంటి వద్ద దింపి వస్తూ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మనవరాలు ఇంటికే కన్నం వేశాడు. చోరీ చేసిన సొత్తును పోలీస్ జీపులోనే వేసుకొని పరారయ్యాడు. అంతేకాదు మొన్న సూర్యాపేటలో కారు దొంగతనం చేసి, తిరిగి ఆ కారును పెట్టే క్రమంలో పోలీసు జీపు సైరన్ విని వారిని తప్పించుకునే క్రమంలో పక్కింట్లోకి దూకాడు. ఊరికే ఉండటం ఎందుకనుకున్నాడో ఏమో ఆ ఇంటికి కూడా కన్నం వేసి బంగారు ఆభరణాలు తస్కరించాడు. పోలీసులను తప్పించుకునే క్రమంలోనూ సతీష్ దొంగతనాలకు పాల్పడ్డట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వాహనానికి ప్రెస్... సతీష్ తన హోండా ఆక్టీవా వాహనానికి ప్రెస్ అని స్టికర్ తగిలించుకున్నాడు. దీంతో పోలీసులు ఎక్కడా ఆపేవారు కాదు. దొంగతనాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆ బైక్‌ను తీసుకెళ్లేవాడుకాదు. ఎక్కడ దొంగతనం చేసినా ఆటోలో వెళ్లడం అలవాటు. అంతేకాదు అర్ధరాత్రి ఒంటిగంటకు తెరిచి ఉన్న కిటికీలను లక్ష్యంగా చేసుకునేవాడు. తనతోపాటు తెచ్చుకునే మూడు పనిముట్లతో కిటికీ ఊచలు తొలగించి లోనికి ప్రవేశించి గ్లౌజ్‌లు తొడక్కొని చోరీలకు పాల్పడుతూ ఒక్క ఆధారం కూడా పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడం సతీష్ అలవాటు. ఈ ఘరానా దొంగకు సెంటిమెంటు కూడా ఎక్కువే. ఎక్కడ దొంగతనానికి వెళ్లినా తెల్లవారుజామున 4 గంటలకు చోరీ చేసిన వస్తువులతో ఆ ఇంట్లో నుంచి బయట పడతాడు. ముందే చోరీ వస్తువులు మూటకట్టుకున్నా సరే 4గంటలయ్యే వరకు అక్కడే ఉండిపోవడం ఇతడి సెంటిమెంట్ అని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. -
ఘరానా దొంగతో..!
ఓ యువకుడు చోర కళలో ప్రావీణ్యుడు. కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు. కానీ చిక్కడు..దొరకడు. ఈ ఘరానా దొంగ ఎవరు...అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎవరు దొంగ’. నవీన్, ప్రియాంక జంటగా ఎస్.బాబ్జీ దర్శకత్వంలో ఎస్. చంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘దొంగ కథాంశంతో వచ్చిన చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం సాగుతుంది. ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ ను త్వరలో చిత్రీకరించనున్నాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కపిల్ ఒరికూటి. -
ఘరానా దొంగ ఆటకట్టు
కొలిక్కి వచ్చి 20 ఇళ్ల చోరీ కేసులు 20.35 తులాల బంగారం స్వాధీనం నల్లకుంట: నల్లకుంట పోలీసులు ఓ ఘరానా దొంగను అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో 20 ఇళ్ల చోరీ కేసులు కొలిక్కి వచ్చాయి. నిందితుడి నుంచి సుమారు రూ. 7.5 లక్షల విలువ చేసి 20.35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు మండలం డీసీపీ షనవాజ్ఖాసిం తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ మండలం మైలార్‌దేవరంపల్లి (మార్దనాపల్లి)కి చెందిన కొమ్ము శ్రీనివాస్ (25)కు భార్య, ఏడాదిన్నర కూతురు ఉంది. కార్వాన్ ఇమాంపురలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం శ్యామ్ అనే పాతనేరస్తుడితో పరిచయమై చోరీల బాట పట్టాడు. చోరీ విధానం... ఒంటరిగానే చోరీలు చేస్తాడు. పీకలదాక మద్యం తాగి టార్గెట్ చేసిన ఇంటికి చేరుకుంటాడు. గోడ దూకి లోపలికి ప్రవేశిస్తాడు. కిటికీలోంచి చేయిపెట్టి ఇంటి తలుపు తీస్తాడు. యజమానులు నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియపెడతాడు. తర్వాత ఇంట్లోని అల్మారాలను తెరిచి నగలు, నగదు చోరీ చే స్తాడు. తర్వాత యజమానుల నిద్రపోతున్న గది గడియతీసి వెళ్లిపోతాడు. అలాగే, కిటికీలోంచి కర్ర సాయంతో ఇంట్లో హుక్కులకు తగిలించి ఉన్న ప్యాంట్లు బయటకు లాగి అందులోని పర్సులు కాజేస్తాడు. చోరీ చేసే క్రమంలో చిక్కితే తాగిన మైకంలో ఇంట్లోకి వచ్చానని వేడుకొని తప్పించుకుంటాడు. తండ్రి ఆత్మహత్య: చోరీ కేసులో నాలుగేళ్ల క్రితం వికారాబాద్ పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. దొంగతనం కేసులో కొడుకు అరెస్టు కావడంతో అవమానభారంతో అతని తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా శ్రీనివాస్‌లో మార్పురాలేదు. జైలుకెళ్లి వచ్చినా... 2013 జూన్ 22 సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఏడాది జూన్ 2న జైల్ నుంచి విడుదలైన శ్రీనివాస్ మళ్లీ చోరీలు ప్రారంభించాడు. ఇటీవల నల్లకుంటలో జరిగిన చోరీ కేసులో క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో శ్రీనివాస్ చోరీకి పాల్పడ్డాడని గుర్తించిన నల్లకుంట పోలీసులు గురువారం సాయంత్రం ఇమామ్పురలోని అతడి ఇంటిపై దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 20 చోరీలకు పాల్పడినట్టు విచారణలో తేలింది. ఇతని నుంచి 20.35 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి వస్తువులు, రెండు పట్టు చీరలు, డిజిటల్ కెమరా స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్‌పై డోసియల్ క్రిమినల్ షీట్ తెరుస్తామని పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో కాచిగూడ ఏసీపీ రంజన్ రతన్ కుమార్, నల్లకుంట ఇన్స్పెక్టర్ వి.జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.