
ఘరానా దొంగ ఆటకట్టు
నల్లకుంట పోలీసులు ఓ ఘరానా దొంగను అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో 20 ఇళ్ల చోరీ కేసులు కొలిక్కి వచ్చాయి. నిందితుడి నుంచి సుమారు రూ. 7.5 లక్షల విలువ చేసి 20.35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
- కొలిక్కి వచ్చి 20 ఇళ్ల చోరీ కేసులు
- 20.35 తులాల బంగారం స్వాధీనం
నల్లకుంట: నల్లకుంట పోలీసులు ఓ ఘరానా దొంగను అరెస్టు చేశారు. ఇతడి అరెస్టుతో 20 ఇళ్ల చోరీ కేసులు కొలిక్కి వచ్చాయి. నిందితుడి నుంచి సుమారు రూ. 7.5 లక్షల విలువ చేసి 20.35 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు మండలం డీసీపీ షనవాజ్‌ఖాసిం తెలిపిన వివరాల ప్రకారం... వికారాబాద్ మండలం మైలార్‌దేవరంపల్లి (మార్దనాపల్లి)కి చెందిన కొమ్ము శ్రీనివాస్ (25)కు భార్య, ఏడాదిన్నర కూతురు ఉంది. కార్వాన్ ఇమాంపురలో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం శ్యామ్ అనే పాతనేరస్తుడితో పరిచయమై చోరీల బాట పట్టాడు.
చోరీ విధానం...
ఒంటరిగానే చోరీలు చేస్తాడు. పీకలదాక మద్యం తాగి టార్గెట్ చేసిన ఇంటికి చేరుకుంటాడు. గోడ దూకి లోపలికి ప్రవేశిస్తాడు. కిటికీలోంచి చేయిపెట్టి ఇంటి తలుపు తీస్తాడు. యజమానులు నిద్రపోతున్న గదికి బయట నుంచి గడియపెడతాడు. తర్వాత ఇంట్లోని అల్మారాలను తెరిచి నగలు, నగదు చోరీ చే స్తాడు. తర్వాత యజమానుల నిద్రపోతున్న గది గడియతీసి వెళ్లిపోతాడు. అలాగే, కిటికీలోంచి కర్ర సాయంతో ఇంట్లో హుక్కులకు తగిలించి ఉన్న ప్యాంట్లు బయటకు లాగి అందులోని పర్సులు కాజేస్తాడు. చోరీ చేసే క్రమంలో చిక్కితే తాగిన మైకంలో ఇంట్లోకి వచ్చానని వేడుకొని తప్పించుకుంటాడు.
తండ్రి ఆత్మహత్య: చోరీ కేసులో నాలుగేళ్ల క్రితం వికారాబాద్ పోలీసులు శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. దొంగతనం కేసులో కొడుకు అరెస్టు కావడంతో అవమానభారంతో అతని తండ్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయినా శ్రీనివాస్‌లో మార్పురాలేదు.
జైలుకెళ్లి వచ్చినా...
2013 జూన్ 22 సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఏడాది జూన్ 2న జైల్ నుంచి విడుదలైన శ్రీనివాస్ మళ్లీ చోరీలు ప్రారంభించాడు. ఇటీవల నల్లకుంటలో జరిగిన చోరీ కేసులో క్లూస్ టీం సేకరించిన ఆధారాలతో శ్రీనివాస్ చోరీకి పాల్పడ్డాడని గుర్తించిన నల్లకుంట పోలీసులు గురువారం సాయంత్రం ఇమామ్‌పురలోని అతడి ఇంటిపై దాడిచేసి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 20 చోరీలకు పాల్పడినట్టు విచారణలో తేలింది.
ఇతని నుంచి 20.35 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి వస్తువులు, రెండు పట్టు చీరలు, డిజిటల్ కెమరా స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. శ్రీనివాస్‌పై డోసియల్ క్రిమినల్ షీట్ తెరుస్తామని పోలీసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో కాచిగూడ ఏసీపీ రంజన్ రతన్ కుమార్, నల్లకుంట ఇన్‌స్పెక్టర్ వి.జయపాల్‌రెడ్డి పాల్గొన్నారు.