ఫ్రాన్స్‌లో హై అలర్ట్
* మరిన్ని దాడులు చేస్తాం: అల్‌కాయిదా
* పారిస్‌లో ఆదివారం సంఘీభావ ర్యాలీ
* హాజరవనున్న జర్మనీ చాన్సెలర్, బ్రిటన్ ప్రధాని,
* ఇతర యూరోప్ దేశాల ప్రతినిధులు
పారిస్: ఫ్రాన్స్ చరిత్రలో గత బుధ, గురు, శుక్రవారాలు నెత్తుటి మరకలై నిలిచాయి. ఆ దేశంపై మరిన్ని దాడులు చేస్తామని యెమన్లోని ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా హెచ్చరించింది. చార్లీ హెబ్డొపై దాడి తమ ఆదేశాల మేరకే జరిగిందని ప్రకటించింది. కాగా, ఉగ్రదాడులు ఎదుర్కొన్న ఫ్రాన్స్‌కు సంఘీభావంగా దాదాపు అన్ని యూరోపియన్ దేశాల నేతలు పారిస్‌లో ఆదివారం జరిగే సంఘీభావ ర్యాలీలో పాల్గొననున్నారు.
పారిస్‌లో జరిగిన ఘాతుకాన్ని పశ్చిమదేశాలంటే పడని ఉత్తరకొరియా, క్యూబా, ఇరాన్‌లు సైతం తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో అమెరికా తన పౌరులను అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించింది. మరిన్ని దాడులు చేస్తామంటూ అల్‌కాయిదా హెచ్చరికలు చేయడంతో పర్యాటక ప్రదేశాలు, ప్రార్థన స్థలాలు, కీలక ప్రాంతాల్లో భద్రతను ఫ్రాన్స్ మరింత కట్టుదిట్టం చేసింది. వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దింపింది. ఉగ్రదాడులపై దర్యాప్తులో భాగంగా పలువురిని అదుపులోకి తీసుకుంది.
ప్రపంచ దేశాల మద్దతు: సూపర్‌మార్కెట్‌పై ఉగ్రవాద దాడిని యూదు వ్యతిరేక చర్యగా ఫ్రాంకోయిస్ హోలండ్ అభివర్ణించారు. ఉగ్రవాదులు మత ఛాందసులని, వారికి ఇస్లాం గురించి తెలియదని వ్యాఖ్యానించారు. ఫ్రాంకోయిస్ హోలండ్ శనివారం ఉదయం తన మంత్రివర్గంలోని కీలక మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం పారిస్‌లో జరగనున్న ఉగ్రవాద వ్యతిరేక సంఘీభావ ర్యాలీకి వేలాదిమంది హాజరయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్, జర్మనీ చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్లతో పాటు స్పెయిన్, బెల్జియం, పోర్చుగల్, పోలండ్, స్వీడన్,డెన్మార్క్, నార్వే, ఉక్రెయిన్, యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్ల ప్రతినిధులు హాజరుకానున్నారు.
మహిళా ఉగ్రవాది కోసం గాలింపు..
శుక్రవారం తూర్పు పారిస్‌లోని సూపర్మార్కెట్లో పలువురిని బందీలుగా పట్టుకుని వారిలో నలుగురిని కాల్చి చంపిన ఉగ్రవాది అమెదీ కౌలిబలితో పాటు ఉన్న మహిళా ఉగ్రవాది హయత్ బౌమెదీన్ ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో అమెదీ చనిపోగా, ఆమె తప్పించుకుంది. ఆమె వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉండొచ్చని, ఏదో ఒక ప్రాంతంలో ఆమె మరోసారి దాడులకు దిగొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సూపర్‌మార్కెట్‌ను ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున సమయంలో మూడేళ్ల చిన్నారి సహా ఐదుగురు ఒక ఫ్రిజ్‌లో దాదాపు 5 గంటలపాటు దాక్కొని ప్రాణాలు దక్కించుకున్నారు.
ఉగ్రవాది అమెదీ సాయంత్రం ప్రార్ధనల కోసం మోకాళ్లపై కూర్చున్న సమయంలోనే ఫ్రాన్స్ కమెండోలు సూపర్మార్కెట్లోకి దూసుకొచ్చారని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. సిరియా, మాలిల్లో పశ్చిమదేశాల మిలటరీ చర్యలను అమెదీ తీవ్రంగా విమర్శిస్తున్నట్లుగా ఉన్న ఆడియోను ఫ్రెంచ్ రేడియో ప్రసారం చేసింది. అమెదీతో పాటు చార్లీ హెబ్డొపై దాడి చేసిన ఉగ్ర సోదరులు చెరిఫ్ కౌచీ, సయీద్ కౌచీలు జీహాదీలుగా ఇప్పటికే నిఘా వర్గాల దృష్టిలో ఉన్నారు.