గూర్ఖాలాండ్ ఉద్యమంలో మళ్లీ హింస
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ కోసం 29 రోజులుగా సాగుతున్న ఉద్యమం మరోసారి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు గురువారం గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలన(జీటీఏ) కార్యాలయంతో పాటు రైల్వే స్టేషన్, అటవీశాఖ బంగ్లాకు నిప్పు పెట్టారు. దగ్గరిలోని పలు వాహనాలను ధ్వంసం చేశారు. మరోవైపు నేపాలీ కవి భానుభక్త ఆచార్య జయంతి సందర్భంగా వందలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం నినాదాలు చేశారు.
గూర్ఖాలాండ్ ఉద్యమ సమన్వయ కమిటీ(జీఎంసీసీ) ఇచ్చిన పిలుపు మేరకు రచయిత, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ కృష్ణసింగ్ మొక్తాన్ 2004లో అందుకున్న భానుభక్త అవార్డును బెంగాల్ ప్రభుత్వానికి తిరిగిచ్చేశారు. సంగీత్ సమ్మాన్ అవార్డును గాయకుడు కర్మయోన్జన్ వెనక్కి ఇచ్చారు. జాతీయ జలవిద్యుదుత్పత్తి సంస్థ(ఎన్హెచ్పీసీ)కు చెందిన రామ్దీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని 600 మంది ఆందోళనకారులు చుట్టుముట్టడంతో కార్యకలాపాలను నిలిపివేశారు. మరోవైపు, ఈ హింసాత్మక ఘటనలపై రాష్ట్ర పర్యాటక మంత్రి గౌతమ్ దేబ్ తీవ్రంగా మండిపడ్డారు.