వెబ్‌సైట్‌తోనే కంపెనీలకు గుర్తింపు
♦ అతి తక్కువ చార్జీలతో సేవలు
♦ గో డాడీ ఇంటర్నేషనల్ ఈవీపీ ఆండ్రూ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న, మధ్యతరహా కంపెనీలకు (ఎస్ఎంబీ) వెబ్‌సైట్‌తోనే గుర్తింపు లభిస్తుందని డొమైన్ రిజిస్ట్రీ, వెబ్ హోస్టింగ్ దిగ్గజం ‘గో డాడీ’ తెలిపింది. వెబ్సైట్లను కలిగి ఉన్న కంపెనీల వ్యాపారం పెరిగిందన్న విషయం తమ అధ్యయనంలో తేలిందని గో డాడీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ లోకీ బుధవారమిక్కడ తెలిపారు.
ఎస్ఎంబీలకు అతి తక్కువ ఖర్చుతో నెలకు రూ.99 మొదలుకుని ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఔత్సాహికులు ఎవరైనా అర గంటలోనే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసుకునేలా టెక్నాలజీని సులభరీతిన డిజైన్ చేశామన్నారు. ఫేస్బుక్ పేజీ ఉన్నప్పటికీ, కంపెనీలు సొంత వెబ్సైట్లను కలిగి ఉంటున్నాయని వివరించారు. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించి అయిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో 7.5 లక్షల మంది కస్టమర్లను సొంతం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
అపార అవకాశాలు..: దేశవ్యాప్తంగా 5.1 కోట్ల ఎస్ఎంబీలు ఉన్నాయి. వీటిలో 1.2 కోట్ల కంపెనీలు మాత్రమే ఇంటర్నెట్తో అనుసంధానం అయ్యాయని గో డాడీ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఎండీ నిఖిల్ అరోరా తెలిపారు. దేశంలో డొమెయిన్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. వెబ్సైట్ల కోసం ఎస్ఎంబీల నుంచి రిజిస్ట్రేషన్లు రెండంకెల వృద్ధి నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు.
వెబ్సైట్ ప్రయోజనాలపై చిన్న కంపెనీలకు అవగాహన లేదని.. పోర్టల్‌కు ఎక్కువ ఖర్చు అవుతుందన్న అపోహ ఉందని చెప్పారు. కాగా, 5 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 31 వరకు రెన్యువల్స్ పై 40% దాకా డిస్కౌంట్‌ను గో డాడీ ప్రకటించింది.