పంచాయతీలకు గుదిబండ
‘‘పల్లెలు సర్వతోముఖాభివృద్ధి సాధించాలి. ఇది జరగాలంటే పంచాయతీలు ఆర్థికంగా బలపడాలి. అందుకే వాటి కరెంటు భారాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది’’ జీఓ నం 80 విడుదల సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలివి. ఆయన మాట నిలుపుకున్నారు. కానీ, ఆయన తదనంతర ప్రభుత్వాలు ఈ జీఓను నిర్లక్ష్యం చేశాయి. తెలంగాణ సర్కారూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరెంటు బకాయిలు పంచాయతీలకు గుదిబండగా మారాయి. -మోర్తాడ్
- కలవరపెడుతున్న కరెంటు బకాయిలు
- భారం దాదాపు రూ.117 కోట్లు
- పన్నులతో ఆదాయం రూ.12 కోట్ల లోపే
- అమలుకు నోచుకోని జీఓ నం 80
- నాడు అండగా నిలచిన వైఎస్ఆర్
మోర్తాడ్ : గ్రామపంచాయతీలకు సంబంధించిన వీధి దీపాలు, రక్షిత మంచినీటి సరఫరా పథకాలకు సంబంధించిన కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లించే విధంగా జారీ చేసిన ఉత్తర్వులు (జీఓ నంబర్ 80) అమలు కావడం లేదు. దీంతో పంచాయతీలకు కరెంటు బిల్లులు గుదిబండగా మారాయి. పంచాయతీలకు ఇంటి పన్ను, నల్లాల ద్వారా లభించే ఆదా యం ఏటా రూ.12 కోట్లకు మించడం లేదు. జిల్లాలో గ్రామ పంచాయతీ లు కరెంటు సంస్థకు రూ.117 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పంచాయతీలపై భారాన్ని తగ్గించడం కోసం జీఓ నంబర్ 80ను విడుదల చేశారు. దీని ప్రకారం గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల బిల్లులు, రక్షిత మం చినీటి సరఫరా పథకాలకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే భరి స్తుంది. రాజశేఖరరెడ్డి మరణం తరువాత జీఓ నం. 80 అమలు నిలిచిపోయింది. దీంతో పంచాయతీల కరెంటు బకాయిలు పెరిగిపోయాయి.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 74 మేజర్ గ్రామ పంచాయతీలు రూ.53 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 644 మైనర్ గ్రామ పంచాయతీలు రూ.64 కోట్లు బకాయి ఉన్నాయి. ఆదాయం తక్కువగా ఉండటంతో ప్రభుత్వమే కరెంటు బిల్లును చెల్లిస్తుందని వైఎస్ నిర్ణయం తీసుకున్నారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతో సిబ్బందికి వేతనాలు, పంచాయతీ నిర్వహణ, సామాగ్రి కొనుగోలు, చిన్న చిన్న మరమ్మత్తులు చేపట్టడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. వైఎస్ మర ణం తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి జీఓ 80ను బుట్ట దాఖలు చేశారు.
ఇప్పటి ప్రభుత్వం కూడా ఆ జీఓను పట్టించుకోవడం లేదు. బకాయిల వసూలు కోసం ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పంచాయతీలపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రాత్రిపూట వీధి దీపాలకు కరెంటు సరఫరాను నిలపివేస్తున్నారు. దీంతో గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఆర్థిక సంఘం నిధుల నుంచి కరెంటు బిల్లులను చెల్లిం చాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల నుంచి కరెంటు బిల్లులు చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందని సర్పంచులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. అభివృద్ధి పనులకు తక్కు వ శాతం నిధులు మంజూరు కావడం, పన్నుల వసూలు అంతంత మాత్రంగానే ఉండటంతో కరెంటు బిల్లుల చెల్లింపు పంచాయతీలకు సాధ్యం కావడం లేదు. గతంలో మాదిరిగా ప్రభుత్వం కరెంటు బిల్లును చెల్లిస్తే తమకు భారం తప్పుతుందని సర్పంచులు అంటున్నారు. ప్రభుత్వం జీఓ 80ను అమలు చేయక పోవడాన్ని నిరసిస్తూ వేల్పూర్ మండల సర్పంచులు రిలే దీక్షలను చేపట్టారు.