Golugonda
-
780 కేజీల గంజాయి పట్టివేత
గొలుగొండ: గొలుగొండ ఎస్ఈబీ పోలీసులు బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మండలంలో మారుమూల గ్రామం నిమ్మగెడ్డలో బలోరా వ్యాన్‌లో తరలించడం కోసం దాచి ఉంచిన 780 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఇంత పెద్ద మొత్తంలో గంజాయి దొరకడం ఇదే మొదటిసారి. ఏజెన్సీ నుంచి బలోరా వ్యాన్‌లో 38 బ్యాగ్‌ల్లో 780 కేజీల గంజాయి రవాణాకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో పోలీసులకు సమాచారం రావడంతో దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గొలుగొండ ఎస్ఈబీ సీఐ రాజారావు, ఎస్ఐ గిరి మాట్లాడుతూ ఇటీవల గంజాయి రవాణా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఒక్కో బ్యాగ్‌లో 20 కేజీల చొప్పున 38 బ్యాగ్‌ల్లో గంజాయి తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో దాడి చేశామని తెలిపారు. బలోరా వ్యాన్ మాత్రమే నిమ్మగెడ్డ పరిసర ప్రాంతాల్లో ఉందని వాహనంలో ఎవరూ దొరకకపోవడంతో వ్యాన్ యజమానిని గుర్తించి అతనిపై కేసు నమోదు చేస్తున్నట్టు చెప్పారు. గంజాయిని, వాహనాన్ని సీజ్ చేశామన్నారు. రూ 3లక్షల విలువైన గంజాయి స్వాధీనం నాతవరం : వాహనాలు తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.3 లక్షల విలువ చేసే గంజాయి పట్టుబడిందని నాతవరం ఎస్ఐ దుంçపల శేఖరం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు నర్సీపట్నం తుని మధ్య డి.యర్రవరం జంక్షన్లో బుధవారం వాహనాలు తనిఖీలు చేస్తుండగా తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ముందు బైక్ దాని వెనుక కారును వదిలి నిందితులు పరారయ్యారని తెలిపారు. దీంతో కారులో సోదా చేయగా 80 కేజీలు గంజాయి లభ్యమైందన్నారు. బైక్‌ను, కారును పోలీసుస్టేషన్‌కు తరలించామన్నారు. బైక్, కారు తెలంగాణ రాష్ట్రానికి చెందినవిగా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3 లక్షలకు పైగా ఉంటుందన్నారు. -
ఎస్ఐ తీరుపై వైసీపీ కార్యకర్త మౌనదీక్ష
సాక్షి,విశాఖపట్నం : గొలుగొండ ఎస్ఐ ఎం.నారాయణరావు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ నాయకుడు సుర్ల గిరిబాబు మౌనదీక్ష చేపట్టారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం రాత్రి దీక్ష చేశారు. వివరాల్లోకి వెళితే..చీడిగుమ్మల గ్రామానికి చెందిన లోకారపు రామరాజు తనపై నాలుగు రోజులు క్రితం ఇదే గ్రామానికి చెందిన కామిరెడ్డి గోవింద్ రాయితో దాడి చేశాడని.. తీవ్రంగా గాయపడి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత గొలుగొండ ఎస్ఐ నారాయణరావుకు ఫిర్యాదు చేశానని తెలిపాడు. అయితే ఎస్ఐ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రామరాజు గిరిబాబుకు చెప్పడంతో ఆయన వచ్చి ఎస్ఐకి కలసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కుసిరెడ్డి రాజుబాబుపై ఇంటి దారి స్థలం వివాదం జరిగితే పక్క ఇంటి యజమాని ఫిర్యాదు ఇవ్వడంతో రాజుబాబును ఎస్ఐ కొట్టినట్టు గిరిబాబు ఆరోపించారు. ఇదేం తీరు అని ఎస్ఐను నిలదీసి పక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. గిరిబాబుకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు లెక్కల సత్యనారాయణ, పోలిరెడ్డి రాజుబాబు, మాకిరెడ్డి రామకృష్ణనాయుడు, చిటికెల వరహాలబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు గండెం ఈశ్వర్రావు మద్దతు తెలిపారు. దీంతో ఎస్ఐ వచ్చి గిరిబాబుకు క్షమాపణ చెప్పారు రామరాజుపై దాడి చేసిన కామిరెడ్డి గోవింద్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో గిరిబాబు దీక్షను విరమించారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని గిరిబాబు ఎస్ఐని కోరారు. -
స్నోయగం
గొలుగొండ: ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మంచు కురిసింది. ఉదయం దట్టంగా మంచు కురవడంతో వాహనదారులు లైట్లు సహాయంతో ప్రయాణం చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో మంచు కురవడంతో పలువురు వింతఅనుభూతికి లోనయ్యారు. ఉదయం నర్సీంగబిల్లి, జానికిరాంపురం, ఆరిల్లోవ అటవీ ప్రాంతంలో ఈ మంచు ప్రభావం కనిపించింది. -
స్కూల్ బస్సు బోల్తా,32 మందికి గాయాలు
-
గాల్లో దీపాల్లా పిల్లల ప్రాణాలు
విశాఖపట్నం: ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యానికి పిల్లల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి. వరుస ప్రమాదాలతో విద్యార్థులు జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నా యజమాన్యాలకు చీమకుట్టినట్టు కూడా ఉండడం లేదు. రాష్టంలో రోజూ జరుగుతున్న ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. తాజాగా విశాఖపట్నం జిల్లాలో ఓ స్కూలు బస్సు ప్రమాదానికి గురై 32 మంది చిన్నారులు గాయపడ్డారు. గొలుగొండ మండలం రావణాపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రిషి వ్యాలీ స్కూల్ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన చిన్నారులంతా 3 నుంచి12 ఏళ్లలోపు వారు. క్షతగాత్రులను గాయపడినవారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
గొలుగొండ, హుకుంపేట, నర్సీపట్నం, అనకాపల్లి అర్బన్, రావికమతం, న్యూస్‌లైన్: జిల్లావ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి, మంగళవారాల్లో పోలీసులు నిర్వహించిన దాడుల్లో భారీఎత్తున గంజాయి పట్టుబడింది. మొత్తం 1329 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 కిలోలకు పైగా గంజాయి పట్టివేత గడ్డిలోడు ట్రక్కర్లో సుమారు 400 కిలోలకు పైగా తరలిస్తున్న గంజాయిని మంగళవారం సాయంత్రం భీమవరం చెక్‌పోస్టు వద్ద అటవీ శాఖ బేస్ క్యాంపు సిబ్బంది పట్టుకున్నారు. చింతపల్లి మండలం చౌడుపల్లి నుంచి గంజాయిని కె.డి.పేట మీదుగా కంఠారం తరలిస్తుండగా భీమవరం చెక్‌పోస్టు సిబ్బంది తనిఖీ నిర్వహించారు. గడ్డిలోడు కింద తవుడు బస్తాల మాటున గంజాయి మూటలున్నట్టు గుర్తించారు. వెంటనే రేంజర్ మహలక్ష్మినాయుడు, డీఆర్వో అచ్యుతరామారావు, కె.డి.పేట ఎస్ఐ గోపాలరావులకు సమాచారమందించారు. వెంటనే వీరు అక్కడికి చేరుకుని ట్రక్కర్ను స్వాధీనపరచుకున్నారు. నాతవరం మండలం జిల్లేడిపూడికి చెందిన డ్రయివర్ గాడి చిట్టిబాబును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 100 కిలోల గంజాయి స్వాధీనం అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం అర్ధరాత్రి హుకుంపేట వారపు సంతకు సమీపంలో పట్టుకున్నారు. పెదబయలు మండలం మారుమూల ప్రాంతం నుంచి కెఎల్06క్యూ 2925 జిప్సీ వాహనంలో తరలిస్తుండగా హుకుంపేట ఎస్ఐ భరత్‌కుమార్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు. నాలుగు బస్తాల్లో తెస్తున్న 100 కిలోల గంజాయితో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన బిజు చాకో, టి.ఎఫ్.అనీష్లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి వస్తోందన్న సమాచారంతో పోలీసులు సంత కూడలి వద్ద మాటువేసి ఉండటాన్ని గమనించిన స్మగ్లర్లు తప్పించుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. 92 కిలోల గంజాయి స్వాధీనం అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు వద్ద ఆటోలో సుమారు రూ.2 లక్షల విలువైన 92 కిలోల గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన అయిదుగురిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు సీఐ పి. శ్రీనివాసరావు తెలిపారు. సీఐ కథనం ప్రకారం పాడేరు మండలం మద్దిగరువు నుంచి 46 సంచుల్లో 92 కిలోల శీలావతి రకం గంజాయిని అయిదుగురు మంగళవారం ఆటో లో అనకాపల్లికి తరలించారు. అనంతరం కారులో వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రణాళిక రూపొందించారు. కాంప్లెక్స్ వద్ద గస్తీని గమనించిన స్మగ్లర్లు ఆటోను తుప్పల వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు చుట్టుముట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. పాడేరు మండలం కింతూరు గ్రామం సాంబే రాధారో (30), పాడేరు మండలం తొట్లగంది గ్రామానికి చెందిన సాంబే వెంకటేశ్వర్లు, పెదబయలు బనుగుబిల్లికి చెందిన దర్శింగ్ వెంకటేశ్వర్లు (21), చింతపల్లి పెండ్లిమామిడికి చెందిన శెట్టి మత్స్యరాజు (25), చీడికాడ మండలం దండి సురవరానికి చెందిన ఆటో డ్రయివర్ గొర్లి రాజేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ తెలిపారు. 187 కిలోల గంజాయి స్వాధీనం రావికమతం మండలం కొత్తకోట సమీపంలోని కన్నంపేట పొలాల్లో తరలిస్తున్న రూ.27 లక్షల విలువైన గంజాయిని కొత్తకోట పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఇండికా కారును, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోట సీఐ పి.వి.కె.వర్మ కథనం ప్రకారం కన్నంపేట, వమ్మవరం గ్రామాల మధ్య గంజాయి తరలుతున్నట్టు సమాచారం అందడంతో సోమవారం రాత్రి నుంచి కొత్తకోట ఎస్ఐ శిరీష్‌కుమార్, సిబ్బందితో గస్తీ నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము ప్రాంతంలో ఏపీ35 ఏసీ 4357 నంబరు ఇండికా కారు వేగంగా వస్తుండటంతో ఆపు చేశారు. కారులోని నలుగురు దిగి పారిపోతుండటంతో సిబ్బంది వెంబడించి ఇద్దరిని పట్టుకోగా, మరో ఇద్దరు పారిపోయారు. కారులో 187 కిలోల గంజాయి లభించింది. పట్టుబడిన ఇద్దరిలో ఒకరు తమిళనాడు ప్రాంతానికి చెందిన కొట్యాసా పాండే (21), మరొకరు రోలుగుంట మండలం బి.బి.పట్నం గ్రామానికి చెందిన శవాకుల రాముగా గుర్తించారు. వీరి నుంచి రూ.లక్షా 75 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నట్టు సీఐ వర్మ తెలిపారు. 550 కిలోల గంజాయి స్వాధీనం రూ.55 లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్నీ మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రా, ఒడిశా సరిహద్దు లోని ఏజెన్సీ మండలాల నుంచి తమిళనాడు థైయినీ జిల్లాకు 550 కిలోల గంజాయి ప్యాకెట్లను లారీలో తరలిస్తున్నట్టు చెప్పారు. ఈ లారీని గొలుగొండ మండలం ఏటిగైరంపేట వద్ద తనిఖీలు నిర్వహిస్తూ పట్టుకున్నట్టు చెప్పారు. మంచినీరు ప్యాకెట్ల లోడుతో వస్తున్న లారీ అడుగు భాగంలో ప్యాకెట్లను ఉంచినట్టు వివరించారు. వీటి విలువ సుమారు రూ.55 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా మత్తుకుట్టి, డ్రయివర్ వీరమృగన్, క్లీనర్ కార్తీకన్కరూర్ను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్టు ఏఎస్పీ చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ తిరుమలరావు, ఎస్ఐ ప్రభాకరరెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
కొండంతవాడు!
పాత్రలో సగం నీటిని చూసి నిరాశావాది ఉసూరంటాడు.. సగం ఖాళీ ఉందని విసుక్కుంటాడు.. ఆశావాది మాత్రం సగమైనా నిండి ఉందని సంబరపడతాడు.. పదమూడేళ్ల ఆ కుర్రాడు రెండో కోవకు చెందిన వాడు.. జీవితంలో ఏదీ లేదని నిరాశపడే వారు ఎక్కువవుతున్న లోకాన ఆ ఆశాసంపన్నుడు వేగుచుక్కలా వెలుగుతున్నాడు. కష్టాలు కడలి కెరటాల్లా విరుచుకు పడినా చిరునవ్వుతో బతకాలని సందేశమిచ్చేలా కులాసాగా కాలం గడుపుతున్నాడు. కాళ్లివ్వని విధిని నిందించడం కాదు.. చేతులిచ్చి బతుకుకు ఆసరా కల్పించినందుకు దండం పెట్టాలంటున్నాడు.. రాళ్లూముళ్లున్న జీవితపథంలో కష్టాలను భరిస్తూ పురోగమిస్తున్నాడు. బతుకు బరువు చూసి భయపడేవారికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గొలుగొండ, న్యూస్‌లైన్ : ఉదయం ఎనిమిది గంటల వేళ.. చలికాలం కావడంతో మంచుతెరలు ఇంకా తొలగలేదు.. ఆ చలిలో గొలుగొండ మండలం భీమునిపట్నం నుంచి జోగుంపేట వెళ్లే రోడ్డు మీద ఓ కుర్రాడు చురుగ్గా నడుస్తున్నాడు.. జిల్లా పరిషత్ హైస్కూలు దిశగా వడివడిగా సాగిపోతున్నాడు.. ఏ ఒక్క రోజో కాదు.. నిత్యం అతడు నాలుగు కిలోమీటర్ల దూరాన్ని నడుచుకునే వెళ్లాడు.. ఇంటికి నడుచుకునే వస్తాడు. ఎందరో పిల్లలు రోజూ స్కూలుకు అలాగే వెళ్తున్నప్పుడు ఇందులో ఆశ్చర్యం ఏముందీ అనిపిస్తుంది కదూ! నిజమే.. ఇందులో ఆశ్చర్యమేమీ ఉండదు కానీ.. ఆ బాలుడికి కాళ్లనే నిర్మాణాలు లేవు.. పదమూడేళ్ల ఉల్లి రాము శరీరంలో పాదాలు తప్ప కాళ్లు కానరావు.. విధి జన్యులోపం రూపంలో చిన్నచూపు చూడడంతో అతడికి శరీరం బాగానే ఉన్నా కాళ్లు మాత్రం లేకుండా పోయాయి. అడుగులు వేయడానికి పాదాలు మాత్రం మిగిలాయి. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన రామును ఆర్థిక సమస్యలూ వెంటాడుతున్నాయి. అయితేనేం.. చిన్నవాడైనా ఆత్మవిశ్వాసంలో కొండంతవాడైన రాము మనో నిబ్బరం ముందు ఈ కష్టాలు తలవంచాయి. పొట్టివాడైనా, గట్టివాడైన రాముకు సమస్యలు ‘పాదాక్రాంత’మయ్యాయి. అడుగులో అడుగు.. : కాళ్లు లేవని రాము కుంగిపోడు.. ఉత్సాహంతో ఉరకలేస్తాడు.. కాళ్లు, చేతుల సాయంతో ఉదయం 4 కిలోమీటర్లు, సాయంత్రం 4 కిలోమీటర్లు ‘నడిచి’ చదువుకుంటున్నాడు. జోగుంపేట జిల్లాపరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న రాము అన్ని రంగాల్లో సహాధ్యాయులతో పోటీ పడతాడు. చదువులో ప్రతిభ చూపుతాడు.. నృత్యంలో అదరగొడతాడు. హైస్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యం చేసి పలువురి అభినందనలు అందుకున్నాడు. ప్రశంసాపత్రాలు కూడా పొందాడు. రెండడుగులే.. :నిరుపేద గిరిజన తెగకు చెందిన రాముకు రాము తండ్రి అప్పారావు, తల్లి వరలక్ష్మి. కూలి పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. రాముకు ఇద్దరు అక్కలు ఉన్నారు. జన్యులోపంతో పుట్టిన రాము పొడవు రెండడుగుల ఎనిమిది సెంటీమీటర్లే. బస్సు సౌకర్యం లేకపోవడంతో స్వగ్రామం నుంచి స్కూలుకు నడుచుకు వెళ్తాడు. ఇందుకు గంటన్నర సమయం పడుతుంది. ఉదయం ఎనిమిది గంటల సమయంలో బయల్దేరి పది గంటలకు స్కూలుకు వెళ్తాడు. సాయంత్రం మళ్లీ సుమారు ఆరున్నరకు ఇంటికి వస్తాడు. ఇన్ని కష్టాలున్నా చదువులో మాత్రం రాణిస్తున్నాడు. యూనిట్ టెస్టు నుండి ప్రతి పరీక్షలో 85 శాతానికి పైగా మార్కులు పొందుతున్నాడు. డ్యాన్స్‌లో ఘనుడు చేతులే ఆధారంగా రాము డ్యాన్స్‌లో అదరగొడతాడు. రెండేళ్లుగా గొలుగొండ మండలంతో పాటు కంఠారం, బాలారం, బకులూరు, నర్సీపట్నం ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చాడు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలుస్తున్నాడు. హైస్కూల్లో ఎఫ్పుడు ఉత్సవాలైనా రాము డ్యాన్స్ ఉండాల్సిందే. చిత్రలేఖనంలో కూడా ప్రతిభ చూపుతున్నాడు. ఉపాధ్యాయుల సహకారంతో నైపుణ్యానికి మెరుగులు దిద్దుకుంటున్నాడు. పాఠశాలలో ప్రథమస్థానంలో నిలుస్తున్నాడు.