government information
-
ప్రభుత్వ సమాచారం కోసం అధికారిక పత్రిక
అయోమయం సృష్టించొద్దు! మీడియాపై సీఎం కేసీఆర్ మండిపాటు మేం అనుకునేది ఒకటైతే మరొకటి రాస్తున్నారు పిచ్చికూతలు, తప్పుడు రాతలను ఎలా అధిగమించవచ్చో తెలుసు సాక్షి, హైదరాబాద్: సంచలనాల కోసం రాసే వార్తలతో ప్రజల్లో అయోమయం సృష్టించొద్దంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మీడియాపై విరుచుకుపడ్డారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వం అనుకుంటున్నది, చేయాలనుకుంటున్నది ఒకటైతే.. పత్రికల్లో మరొకటి వస్తోందని వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘సంచలనాల కోసం అనవసర వార్తలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పిచ్చిరాతలు రాయకండి అని చాలాసార్లు ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా కొందరు మానుకోవడం లేదు. దీన్ని ఎలా అధిగమించాలని మేం ఆలోచిస్తున్నాం. అందుకే ప్రభుత్వ అధీనంలోని అధికారిక పత్రిక ద్వారా మంచి వార్తలు, వాస్తవ విషయాలను, పూర్తి సమాచారాన్ని ప్రజలకు ఎలా అందించాలన్న అంశాన్ని పౌర సంబంధాల శాఖ ఆలోచిస్తోంది. కొందరు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కట్టుకథలు రాస్తున్నారు. అలాంటి పత్రికల నిజాయితీ ఏమిటో బయట పెడతాం. ప్రజల ముందు ఉంచుతాం. విచ్చలవిడిగా రాసే పత్రికలు కొన్ని ఉన్నాయి. మేం ఏదైనా రాయగలమనే ధోరణిలో మీడియా సంస్థలు ఉన్నాయి. అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ వార్తలు రాసే ముందు అధికారులను, సంబంధిత మంత్రులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలని చెబుతున్నాం. అయినా పట్టించుకోకుండా కొన్ని పత్రికలు తమ ఇష్టం వచ్చినట్లు అభూత కల్పనలతో వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇది మంచిది కాదు. మళ్లీ మీడియాకు అప్పీలు చేస్తున్నాను... మీ పద్ధతులు మార్చుకోండి. ఇది క్రెడిబి లిటీకి సంబంధించిన అంశం. డిక్టేట్ చేస్తున్నానని అనుకోకండి.. బాధతో చెబుతున్నాను. ఈరోజు ఒక ఆంగ్ల పత్రికలో మొదటిపేజీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారి నుంచి మొత్తం పవర్స్ నేను తీసేసుకుని.. బడ్జెట్ మొత్తం నేనే తయారు చేస్తున్నట్లుగా రాసింది. ఈటెల రాజేందర్ మా ప్రభుత్వంలో చాలా ప్రధానమైన వ్యక్తి. ఆయనను పట్టుకుని దిక్కుమాలిన వార్త రాసి ఎవరిని అయోమయానికి గురి చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. బడ్జెట్ అనేది ఆర్థిక మంత్రి, సీఎం మాత్రమే చేయరు. ఇది సమష్టిగా చేసేది. అధికారులు, ఆయా శాఖల కార్యదర్శులు, ఆర్థిక మంత్రి, సీఎం అంతా కలసి బడ్జెట్ రూపొందిస్తారు. ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. కానీ, ఇష్టం వచ్చిన కథ రాశారు. ఈ వార్తలు చూసి నవ్వుకుంటున్నాం. బాధ కూడా కలుగుతోంది. ఇప్పటికైనా మీ పిచ్చిరాతలు మానుకోండి. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధానం మానుకోండి. ఈ జర్నలిజం ఎవరికీ మంచిది కాదు. అలాంటి వార్తలు రాసి, ప్రజలను అయోమయానికి గురిచేయొద్దు..’’ అని ముఖ్యమంత్రి సూచించారు. -
దళితుల్లో కొత్త ఆశలు!
సంగారెడ్డి డివిజన్: నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయాలన్న ప్రభుత్వం ప్రకటన దళితుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఆగస్టు 15న భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దళితులు భూ పంపిణీపై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీని ప్రతిష్టాత్మకంగా భావించటంతో జిల్లా యంత్రాంగం కూడా పంపిణీ అమలుపై కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటంతో భూ పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అధికారులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే దళితులు ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. రాబోయే రెండు రోజుల్లో సర్వే ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం అందజేసే విధివిధానాలకు అనుగుణంగా భూ పంపిణీ చేపట్టే గ్రామాలు, లబ్ధిదారుల ఎంపికపై కూడా అధికారులు కసరత్తు ప్రారంభించారు. మండలానికి ఒక గ్రామంలో దళితులకు మూడు ఎకరాలు భూమి పంపిణీ చేయనున్నారు. దీంతో జిల్లాలో భూ పంపిణీకి అర్హమైన గ్రామాలను, లబ్ధిదారులను గుర్తించే బాధ్యతలను నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ ప్రభుత్వ భూముల వివరాలు తెసుకునేందుకు తహశీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో భూ పంపిణీకి అవసరమైన మేర ప్రభుత్వ భూములు చాలా మండలాల్లో అందుబాటులో లేవు. దీంతో ప్రభుత్వభూములు అందుబాటులో లేనిచోట భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, రామచంద్రాపురం మినహా మిగతా 44 మండలాల్లో దళితులకు భూ పంపిణీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా సర్వే దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ప్రకటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సర్వే నిర్వహించనుంది. జిల్లాలో ఎన్ని దళిత కుటుంబాలున్నాయి? కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? భూమి లేని దళిత నిరుపేద కుటుంబాలు ఎన్ని? సొంత ఇల్లు లేని కుటుంబాలెన్ని? దళిత కుటుంబాల్లో తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు ఎంతమంది? డ్వాక్రా గ్రూపుల్లో ఎంతమంది దళిత మహిళలున్నారు? తదితర అంశాలపై డీఆర్డీఏ, ఐకేపీ సంయుక్తంగా జిల్లావ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో సర్వే ప్రారంభించనుంది. సర్వేకు సంబంధించిన విధి విధానాలను కలెక్టర్ శరత్ ఖరారు చేయనున్నారు. సర్వే వివరాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కాగా సాగునీరు అందుబాటులో ఉన్న భూములను పంపిణీ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. జిల్లాలోని మొత్తం గ్రామాలు: 1179 దళితుల జనాభా: 5,42,253 భూములు ఉన్న వారు: 1,15,385 భూములు లేని కుటుంబాలు: 17,366 -
ప్రభుత్వ ప్రకటనలపై మార్గదర్శకాలకు కమిటీ
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు సుప్రీం కోర్టు బుధవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికలు, టీవీల్లో ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని వృథా చేయకుండా ఉండేందుకు కోర్టు ఈ చర్యలు తీసుకుంది. ఇలాంటి ప్రకటనలను నియంత్రించాల్సిన అవసరముందని సుప్రీం చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇందుకోసం నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఇందులో జాతీయ న్యాయ అకాడమీ మాజీ డెరైక్టర్ మాధవ మీనన్, లోక్‌సభ మాజీ కార్యదర్శి టి.కె. విశ్వనాథన్, సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్లతోపాటు సమాచార శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిల్స్‌ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అధికార పార్టీలు ప్రభుత్వ ప్రకటనల్లో తమ నాయకులను చూపిస్తూ ప్రయోజనాలు పొం దే యత్నం చేస్తున్నాయని, ఇది రాజ్యాంగవిరుద్ధమని ఆ సంస్థలు వాదించాయి.