ప్రభుత్వ సమాచారం కోసం అధికారిక పత్రిక | official news paper for government information, says kcr | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ సమాచారం కోసం అధికారిక పత్రిక

Published Sat, Aug 2 2014 1:03 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

ప్రభుత్వ సమాచారం కోసం అధికారిక పత్రిక - Sakshi

ప్రభుత్వ సమాచారం కోసం అధికారిక పత్రిక

అయోమయం సృష్టించొద్దు!
మీడియాపై సీఎం కేసీఆర్ మండిపాటు
మేం అనుకునేది ఒకటైతే మరొకటి రాస్తున్నారు
పిచ్చికూతలు, తప్పుడు రాతలను ఎలా అధిగమించవచ్చో తెలుసు


సాక్షి, హైదరాబాద్: సంచలనాల కోసం రాసే వార్తలతో ప్రజల్లో అయోమయం సృష్టించొద్దంటూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మీడియాపై విరుచుకుపడ్డారు. కొన్ని విషయాల్లో ప్రభుత్వం అనుకుంటున్నది, చేయాలనుకుంటున్నది ఒకటైతే.. పత్రికల్లో మరొకటి వస్తోందని వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ‘‘సంచలనాల కోసం అనవసర వార్తలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి పిచ్చిరాతలు రాయకండి అని చాలాసార్లు ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అయినా కొందరు మానుకోవడం లేదు. దీన్ని ఎలా అధిగమించాలని మేం ఆలోచిస్తున్నాం. అందుకే ప్రభుత్వ అధీనంలోని అధికారిక పత్రిక ద్వారా మంచి వార్తలు, వాస్తవ విషయాలను, పూర్తి సమాచారాన్ని ప్రజలకు ఎలా అందించాలన్న అంశాన్ని పౌర సంబంధాల శాఖ ఆలోచిస్తోంది. కొందరు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కట్టుకథలు రాస్తున్నారు. అలాంటి పత్రికల నిజాయితీ ఏమిటో బయట పెడతాం. ప్రజల ముందు ఉంచుతాం. విచ్చలవిడిగా రాసే పత్రికలు కొన్ని ఉన్నాయి. మేం ఏదైనా రాయగలమనే ధోరణిలో మీడియా సంస్థలు ఉన్నాయి. అది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ప్రభుత్వ వార్తలు రాసే ముందు అధికారులను, సంబంధిత మంత్రులను సంప్రదించి నిర్ధారణ చేసుకోవాలని చెబుతున్నాం. అయినా పట్టించుకోకుండా కొన్ని పత్రికలు తమ ఇష్టం వచ్చినట్లు అభూత కల్పనలతో వార్తలు ప్రచురిస్తున్నాయి. ఇది మంచిది కాదు. మళ్లీ మీడియాకు అప్పీలు చేస్తున్నాను... మీ పద్ధతులు మార్చుకోండి. ఇది క్రెడిబి లిటీకి సంబంధించిన అంశం.

డిక్టేట్ చేస్తున్నానని అనుకోకండి.. బాధతో చెబుతున్నాను. ఈరోజు ఒక ఆంగ్ల పత్రికలో మొదటిపేజీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారి నుంచి మొత్తం పవర్స్ నేను తీసేసుకుని.. బడ్జెట్ మొత్తం నేనే తయారు చేస్తున్నట్లుగా రాసింది. ఈటెల రాజేందర్ మా ప్రభుత్వంలో చాలా ప్రధానమైన వ్యక్తి. ఆయనను పట్టుకుని దిక్కుమాలిన వార్త రాసి ఎవరిని అయోమయానికి గురి చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాలి. నేను డిమాండ్ చేస్తున్నాను. బడ్జెట్ అనేది ఆర్థిక మంత్రి, సీఎం మాత్రమే చేయరు. ఇది సమష్టిగా చేసేది. అధికారులు, ఆయా శాఖల కార్యదర్శులు, ఆర్థిక మంత్రి, సీఎం అంతా కలసి బడ్జెట్ రూపొందిస్తారు. ఆర్థిక శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. కానీ, ఇష్టం వచ్చిన కథ రాశారు. ఈ వార్తలు చూసి నవ్వుకుంటున్నాం. బాధ కూడా కలుగుతోంది. ఇప్పటికైనా మీ పిచ్చిరాతలు మానుకోండి. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే విధానం మానుకోండి. ఈ జర్నలిజం ఎవరికీ మంచిది కాదు. అలాంటి వార్తలు రాసి, ప్రజలను అయోమయానికి గురిచేయొద్దు..’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement