
దళితుల్లో కొత్త ఆశలు!
సంగారెడ్డి డివిజన్: నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయాలన్న ప్రభుత్వం ప్రకటన దళితుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఆగస్టు 15న భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో దళితులు భూ పంపిణీపై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ పంపిణీని ప్రతిష్టాత్మకంగా భావించటంతో జిల్లా యంత్రాంగం కూడా పంపిణీ అమలుపై కసరత్తు ప్రారంభించింది.
ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటంతో భూ పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అధికారులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే దళితులు ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు.
రాబోయే రెండు రోజుల్లో సర్వే ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. ప్రభుత్వం అందజేసే విధివిధానాలకు అనుగుణంగా భూ పంపిణీ చేపట్టే గ్రామాలు, లబ్ధిదారుల ఎంపికపై కూడా అధికారులు కసరత్తు ప్రారంభించారు. మండలానికి ఒక గ్రామంలో దళితులకు మూడు ఎకరాలు భూమి పంపిణీ చేయనున్నారు. దీంతో జిల్లాలో భూ పంపిణీకి అర్హమైన గ్రామాలను, లబ్ధిదారులను గుర్తించే బాధ్యతలను నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ప్రభుత్వ భూముల వివరాలు తెసుకునేందుకు తహశీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో భూ పంపిణీకి అవసరమైన మేర ప్రభుత్వ భూములు చాలా మండలాల్లో అందుబాటులో లేవు. దీంతో ప్రభుత్వభూములు అందుబాటులో లేనిచోట భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, రామచంద్రాపురం మినహా మిగతా 44 మండలాల్లో దళితులకు భూ పంపిణీ చేయనున్నారు.
జిల్లావ్యాప్తంగా సర్వే
దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీ ప్రకటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సర్వే నిర్వహించనుంది. జిల్లాలో ఎన్ని దళిత కుటుంబాలున్నాయి? కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి? భూమి లేని దళిత నిరుపేద కుటుంబాలు ఎన్ని? సొంత ఇల్లు లేని కుటుంబాలెన్ని? దళిత కుటుంబాల్లో తెల్లరేషన్‌కార్డు ఉన్నవారు ఎంతమంది? డ్వాక్రా గ్రూపుల్లో ఎంతమంది దళిత మహిళలున్నారు? తదితర అంశాలపై డీఆర్‌డీఏ, ఐకేపీ సంయుక్తంగా జిల్లావ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో సర్వే ప్రారంభించనుంది. సర్వేకు సంబంధించిన విధి విధానాలను కలెక్టర్ శరత్ ఖరారు చేయనున్నారు. సర్వే వివరాల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. కాగా సాగునీరు అందుబాటులో ఉన్న భూములను పంపిణీ చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.
జిల్లాలోని మొత్తం గ్రామాలు: 1179
దళితుల జనాభా: 5,42,253
భూములు ఉన్న వారు: 1,15,385
భూములు లేని కుటుంబాలు: 17,366