ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు సుప్రీం కోర్టు బుధవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికలు, టీవీల్లో ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని వృథా చేయకుండా ఉండేందుకు కోర్టు ఈ చర్యలు తీసుకుంది.
న్యూఢిల్లీ: ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై మార్గదర్శకాలు రూపొందించేందుకు సుప్రీం కోర్టు బుధవారం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికలు, టీవీల్లో ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని వృథా చేయకుండా ఉండేందుకు కోర్టు ఈ చర్యలు తీసుకుంది. ఇలాంటి ప్రకటనలను నియంత్రించాల్సిన అవసరముందని సుప్రీం చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఇందుకోసం నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.
ఇందులో జాతీయ న్యాయ అకాడమీ మాజీ డెరైక్టర్ మాధవ మీనన్, లోక్‌సభ మాజీ కార్యదర్శి టి.కె. విశ్వనాథన్, సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్‌లతోపాటు సమాచార శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిల్స్‌ను విచారించిన సందర్భంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అధికార పార్టీలు ప్రభుత్వ ప్రకటనల్లో తమ నాయకులను చూపిస్తూ ప్రయోజనాలు పొం దే యత్నం చేస్తున్నాయని, ఇది రాజ్యాంగవిరుద్ధమని ఆ సంస్థలు వాదించాయి.