మేమేం చేయలేం!
Published Wed, Apr 9 2014 10:36 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌బుద్ధ్‌నగర్‌లో జరగనున్న పోలింగ్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ బీఫారాన్ని పొంది, నామినేషన్ వేసి, ప్రచారం చేసిన రమేశ్‌చంద్ తోమర్ సరిగ్గా ఎన్నికలకు వారంరోజుల ముందు బీజేపీలో చేరారు. నామినేషన్ గడువు కూడా ముగిసిపోవడంతో ఈ నియోజకవర్గంలో మరో అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేకుండాపోయింది. దీంతో ఈ నియోజవర్గంలో ఎన్నికలను రద్దు చేసి, కొత్త షెడ్యూల్‌ను ప్రకటించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ నోయిడాకు చెందిన ముకేశ్ యాదవ్, విక్రాంత్‌సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు రంజనా ప్రకాశ్ దేశాయ్, మదన్ బి లోకుర్‌లతో కూడిన ధర్మాసనం... ఈ సమయంలో మేమేం చేయలేమని చెబుతూ పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది జితేందర్ మోహన్ శర్మ మాట్లాడుతూ... మార్చి 21న కాంగ్రెస్ అభ్యర్థిగా తోమర్ నామినేషన్ వేశారని, దీంతో పార్టీ గుర్తు ‘హస్తం’ను ఆయనకు కేటాయించారని, నియోజకవర్గంలో ఏప్రిల్ 3 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనను గెలిపించాలంటూ ప్రచారం కూడా చేసుకున్నారని, ఆ తర్వాత అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి, బీజేపీలో చేరారని చెప్పారు. అప్పటికే నామినేషన్ గడువు, ఉపసంహరణ తదితర ప్రక్రియలన్నీ ముగిసిపోవడంతో సదరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకుండా పోయాడన్నారు. అందుకే నియోజకవర్గంలో ఎన్నికలను నిలిపివేసి, కొత్తగా షెడ్యూల్ ప్రకటించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతున్నామన్నారు.
బహుముఖ పోరే...
ఎన్సీఆర్ విషయానికి వస్తే... గుర్గావ్‌లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీల మధ్య చతుర్ముఖ పోరు, ఘాజియాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్, ఎస్పీ, బీఎస్పీల మధ్య బహుముఖపోరు జరుగనుంది. గౌతమ్‌బుద్ధ్ నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్‌చంద్ తోమర్ బీజేపీలో చేరడంతో ఆప్, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ పోరుప్రధానంగా ఎస్పీ, బీజేపీల మధ్యనే నెలకొంది. తమ పార్టీ అభ్యర్థి ఎన్నికల నుంచి నిష్ర్కమించినందువల్ల పోటీలో తమ పార్టీ అభ్యర్థి లేకుండా పోయాడని, అందువల్ల ఇక్కడి రద్దు చేసి ఎన్నికల ప్రక్రియను మళ్లీ కొత్తగా ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. దీంతో ఇక్కడ కూడా నేడే పోలింగ్ జరగనుంది.
Advertisement
Advertisement