అతిథి బాధలు.. కాంట్రాక్ట్ వెతలు!
సాక్షి, తాండూరు: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన అగమ్యగోచరంగా మారింది. పాఠశాల, ఉన్నత విద్యకు నిచ్చెన లాంటి ఇంటర్ ఎడ్యుకేషన్ ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురువుతోంది. తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు ఫర్నిచర్ వంటి మౌలిక సదుపాయాల సంగతి పక్కన పెడితే కనీసం పాఠాలు బోధించేందుకు కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. దీంతో చదువులు సవ్యంగా సాగడం లేదు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని 9 కాలేజీల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. దీంతో కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో కాలం వెల్లదీస్తున్నారు.
9 మండలాల్లోనే కాలేజీలు..
జిల్లాలో 18 మండలాలు ఉండగా.. కేవలం 9 మండలాల్లోనే మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. మిగతా ఒకటి రెండు చోట్ల ప్రైవేటు కాలేజీలే దిక్కవుతున్నాయి. మర్పల్లి, కొడంగల్, దోమ, పెద్దేముల్, మోమిన్‌పేట, నవాబ్‌పేట మండలాలతో పాటు తాండూరు, పరిగి, వికారాబాద్ పట్టణాల్లో ప్రభుత్వ కాలేజీలున్నాయి. వీటిలో 3వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 9 కాలేజీలకు సంబంధించి సుమారు 150 మంది రెగ్యులర్ అధ్యాపకులు అవసరం. వీరిలో కేవలం 5గురు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 81 మంది కాంట్రాక్ట్ విధానంలో, 48 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిన సేవలు అందిస్తున్నారు.
5 నెలలుగా అందని వేతనాలు..
జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో 81 మంది అధ్యాపకులు కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి గత విద్యాసంవత్సరానికి సంబంధించిన 5 నెలల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో వీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు ఆందోళనలు సైతం నిర్వహించారు.
రెగ్యులరైజ్ చేయాలి
పదేళ్లకుపైగా కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. నెలనెల వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయినా కూడా మాకు సమస్యలు తప్పడం లేదు.
– మహేందర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. వికారాబాద్, తాండూరులో తరగతి గదుల కొరత ఉంది. వసతుల కల్పనకు మావంతు కృషి చేస్తున్నాం. కాంట్రాక్ట్ అధ్యాపకుల బకాయి వేతనాలు చెల్లింపు మా పరిధిలో లేదు.
– శంకర్‌నాయక్, జిల్లా నోడల్ అధికారి
రెగ్యులరైజ్ చేయాలి
పదేళ్లకుపైగా కాంట్రాక్ట్ విధానంలో విధులు నిర్వర్తిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి. నెలనెల వేతనాలు చెల్లించాలి. ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. అయినా కూడా మాకు సమస్యలు తప్పడం లేదు.
– మహేందర్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు