పింఛన్ల బట్వాడాకు ప్రత్యేక చర్యలు
23 నుంచి 28 వరకు వేలిముద్రల సేకరణ
ఇదే ఆఖరి అవకాశం
నక్కపల్లి: వేలిముద్రల సేకరణ పూర్తికాక జిల్లా వ్యాప్తంగా మూడు నెలలుగా నిలిచిపోయిన సామాజిక భద్రత పింఛన్ల బట్వాడా కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వేలిముద్రల సేకరణ కోసం ఈ నెల 23 నుంచి 28 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీటి ప్రతులను డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ శనివారం అన్ని మండల కార్యాలయాలకు పంపించారు.
మూడు నెలలుగా నిలిచిన పింఛన్లు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రస్తుతం మాన్యువల్ విధానంలో ఇస్తున్న పింఛన్లను ఇక నుంచి బయోమెట్రిక్ విధానంలో బట్వాడా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఫినో సంస్థ ద్వారా బట్వాడా చేస్తున్న పింఛన్లను మే నెల నుంచి తపాలా కార్యాలయాల ద్వారా చెల్లిస్తోంది.
బయోమెట్రిక్ విధానంలో పింఛన్ల పంపిణీకి లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు సేకరించింది. ఇలా వేలిముద్రలు ఇవ్వని వారు, కుష్టురోగులు, వయోవృద్ధులు, వేళ్లు సక్రమంగా లేనివారి వేలిముద్రలు లేకపోవడంతో పింఛన్లను మూడునెలలుగా నిలిపివే శారు. లబ్ధిదారులంతా గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం స్పందించింది.
వేలిముద్రలు ఇవ్వలేని వారి తరపున వారి బంధువుల్లో ఒకరి వేలిముద్రలు తీసుకుని పింఛన్లను బట్వాడా చేయాలని, ఇలాంటి లబ్ధిదారులు, వారి తరపున పింఛన్ తీసుకునే వారి వివరాల జాబితాను ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించి ప్రభుత్వానికి పంపాలని ఆదేశించింది.
ఈ నెల 23 నుంచి 28 వరకు ఫినో సంస్థ గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి వేలిముద్రలు సేకరించాలని పేర్కొంది. సిబ్బంది కొరత ఉంటే ఐకేపీ సిబ్బందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి వేలిముద్రల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మండల పరిషత్తులు, తపాలా శాఖను ప్రభుత్వం ఆదేశించింది. వారి పరిధిలోని గ్రామాల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియను ప్రభుత్వం నిర్దేశించిన రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
వచ్చే నెల నుంచి బయోమెట్రిక్ ద్వారా పింఛన్లు
జూలై నెల నుంచి పింఛన్లను బయోమెట్రిక్ విధానం ద్వారా లబ్ధిదారులకు లేదా వారి మెసెంజర్లకు బట్వాడా చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బయోమెట్రిక్‌కు వీలుకాని లబ్ధిదారుల వివరాలను ఫారం 2లో నమోదు చేసి సీఈవో సెర్ప్, హైదరాబాద్‌కు పంపించాలని ప్రభుత్వం పేర్కొంది. వేలిముద్రలు రాని వారి పింఛన్లను వారి తరపు బంధువుల ద్వారా చెల్లించేటప్పుడు లబ్ధిదారులకు సక్రమంగా అందాయో, లేదో సామాజిక తనిఖీ నిర్వహించాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని ప్రభుత్వం పేర్కొంది.
చనిపోయిన లేదా గ్రామం విడిచి వెళ్లిన లబ్ధిదారుల పేర్లను గ్రామ కార్యదర్శులు నమోదు చేసి ఎంపీడీవోల ద్వారా సెర్ప్ సంస్థకు పంపాలని కూడా పేర్కొంది. ఈ నెల 23 నుంచి 28 వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వేలిముద్రలు ఇవ్వని వారి పింఛన్లు నిలిచిపోతాయని, ఇదే ఆఖరి అవకాశమని ఈవోఆర్డీ కుమార్ స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.