grama jyothi program
-
పల్లెలకు వెలుగు
సాక్షి, వరంగల్ రూరల్ : గ్రామీణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు, పాలక వర్గాలకు వెన్నుదన్నుగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. గ్రామ పంచాయతీ పాలన పారదర్శకంగా సాగేందుకు గ్రామ స్థాయిలో ఏడు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కమిటీల్లో పాలకవర్గం భాగస్వామ్యం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా పంచాయతీరాజ్ చట్టం–2018లో రూపుదిద్దుకుంది. జిల్లాలో మొత్తం 401 పంచాయతీలకు నూతన పాలకవర్గంతో గ్రామ జ్యోతి కమిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. తెలంగా ణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ –49 ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో నాలుగు స్టాండింగ్ కమిటీలను ఏర్పా టు చేయాలి. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ఈ కమిటీలకు సర్పంచ్ లేదా ఉపసర్పంచ్ లేదంటే వార్డు సభ్యులు చైర్మన్లుగా ఉంటా రు. ఆయా కమిటీల్లో ఆ గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల అధ్యక్షులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, సంబంధిత రంగాల్లో అనుభవం ఉండి పదవీ విరమణ చేసినవారు సభ్యులుగా నియమితులవుతారు. వేర్వేరుగా ఏర్పాటయ్యే ఏడు కమిటీలకు ప్రత్యేక బాధ్యతలుంటాయి. వారికి సంబంధించిన అంశాల్లో గ్రామంలో పర్యటించి పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ఆ సమచారం ప్రకారం ఆయా రంగాల్లో అందుతున్న సేవలపై సమావేశంలో సమీక్షించి విశ్లేషించాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రజల అవసరాలు తీర్చేలా ప్రణాళికలను రూపొందించేందుకు కృషి చేయాలి. దీంతో గ్రామాల సమగ్రాభివృద్ధి చేసుకోవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలకు గ్రామ స్థాయిలో సంబంధిత అధికారి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడమే.. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవాలంటే కీలకమైన సహజ వనరులు, వ్యవసాయం, పౌష్టికాహారం, తాగునీరు, పారిశుధ్యం, విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో పంచాయతీరాజ్ వ్యవస్థను సిద్ధం చేసి ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మన ఊరు, మన సమస్యలు, మన ఆలోచనలు, మన వనరులు, మన పరిష్కారాలు ఉండేలా పంచాయతీరాజ్ సంస్థలు కృషి చేయాలని లక్ష్యం. ఇవీ కమిటీలు పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డు, శ్మశానవాటికల నిర్వహణ వీధి దీపాల నిర్వహణ మొక్కలు నాటడం, సంరక్షణ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం–తాగునీరు ఆరోగ్యం–పోషకాహారం ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లో స్టాడింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని రూపొందించారు. కమిటీల ఏర్పాటు నిర్ణయం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే ఏర్పాటు చేస్తాం. గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ది కోసం ఈ కమిటీలు ఎంతగానో దోహదపడనున్నాయి.–రాజారావు, జిల్లా పంచాయతీ అధికారి -
సేవకు ప్రాధాన్యమివ్వండి
♦ మహిళలు టీవీ సీరియళ్లు చూడటం.. పురుషులు కల్తీకల్లు తాగడాన్ని పక్కనపెట్టాలి ♦ ‘గ్రామజ్యోతి’లో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలి ♦ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి శామీర్‌పేట్ : గ్రామజ్యోతి కార్యక్రమంలో పార్టీలకతీతంగా భాగస్వాములు కావాలని, అప్పుడే పల్లెసీమలు ప్రగతిపథాన పయనిస్తాయని జెడ్పీచైర్‌పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు టీవీ సీరియళ్లు చూడటాన్ని, పురుషులు కల్తీకల్లు తాగడాన్ని పక్కనపెట్టి సేవ చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని ఆమె సూచించారు. శుక్రవారం మండలంలోని లాల్‌గడిమలక్‌పేట్‌లో సునీతారెడ్డి పర్యటించారు. స్థానిక సర్పంచ్ బీర్కురి వెంకటేశ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు జెడ్పీ ఉన్నతపాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను పరిశీలించారు. గ్రామపంచాయతీ వద్ద బాదం మొక్క నాటారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో సునీతారెడ్డి పసంగించారు. ప్రతి అధికారి, స్వచ్ఛంద సంస్థలు గ్రామాలను దత్తత తీసుకుని సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేయాలని సూచించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతభాగాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. లాల్గడిమలక్పేట్ను దత్తత తీసుకున్న బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాన్ని మరింత అభివృద్ధిపథంలో తీసుకేళ్లేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు బాలేష్, ఎంపీడీఓ శోభారాణి, గ్రామజ్యోతి మండల ఇన్చార్జి నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు సుభాషిణి, ఉప సర్పంచ్ జగదీశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అభివృద్ధి’ జ్యోతిని వెలిగించాలి
రాజాపూర్‌లో నిర్వహించిన గ్రామజ్యోతిలో మంత్రి కేటీఆర్ బాలానగర్ : ఎవరికి వారు కథానాయకులయి గ్రామాల్లో సమిష్టికృషితో అభివృద్ధి అనే అఖండ గ్రామజ్యోతిని వెలిగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి పథకాన్ని అమలులోకి తెచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మండలంలోని రాజాపూర్ గ్రా మంలో గ్రామజ్యోతి కార్యక్రమంలో భా గంగా మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంగళవారం ఆయన గ్రామంలోని వీధులను, మురుగుకాల్వలను పరిశీలించారు. వార్డుల్లోని మురుగుకాల్వను శుభ్రం చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండ్లముందున్న మహిళలను ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని, ఆసరా పథకంలో డబ్బులు వస్తున్నాయా..? అని మహిళలు, వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని పీహెచ్‌సీని పరిశీలించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్యసిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ పాఠశాలలో గ్రామసభను నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యలపై ము ఖాముఖి చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన వార్డును, మన ఊ రిని బాగు చేసుకుందామనే ఆలోచన గ్రామంలోని ప్రతి ఒక్కరికీ వచ్చినప్పుడే అన్ని విధాలుగా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర స్థాయి అధికారు లు రేమండ్‌పీటర్, అనితారామచంద్రన్, జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, ఎం పీపీ భాగ్యమ్మ, సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు బుచ్చమ్మ, ఆయా శాఖ లఅధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. హాజిపల్లి గ్రామానికి చేయూత నందిస్తా: మంత్రి కేటీఆర్ షాద్‌నగర్: హాజిపల్లి గ్రామానికి చేయూతను అందించడానికి సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మండలంలోని హాజిపల్లి గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హాజిపల్లి గ్రామాన్ని ఏ విధంగా ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దారో సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జంగమ్మను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీ భవనాలను మోడల్ గ్రామపంచాయతీ భవనాలుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ఉందని, హాజిపల్లి గ్రామపంచాయితీ భవనానికి ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలు మంజూరయ్యేలా ప్రయత్నం చేస్తానన్నారు. గ్రామంలో ఉన్న ప్రైమరీ స్థాయి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిషు మీడియం లేక షాద్‌నగర్ పట్టణానికి వెళుతున్నారని గ్రామస్తులు తెలపగా ప్రైమరీ పాఠశాలలో ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేస్తున్నామని జిల్లాలో మొట్ట మొదటగా హాజిపల్లి గ్రామంలో ప్రారంభిస్తామని హమీ ఇచ్చారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ హాజిపల్లి గ్రామాన్ని ఇతర గ్రామాలు ఆదర్శంగా తీసుకొని అభివృద్ది చెందాలన్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్రాంరెడ్డి, వీర్లపల్లి శంకర్, ఎంఎస్ నటరాజన్, అదెబాబ య్య, నారాయణ పాల్గొన్నారు. -
సమష్టి కృషితోనే గ్రామ‘జ్యోతి’
జిల్లాను అభివృద్ధిలో ముందు నిలపాలి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం అవగాహన సమావేశంలో మంత్రులు ఐకే.రెడ్డి, రామన్న ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రా రంభిస్తున్న గ్రామజ్యోతి పథకం విజయవంతమయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు సహకరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, దేవాదాయ ధర్మాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. మండలంలోని మావలలో గ్రామజ్యో తి మార్పు మార్గదర్శకాలపై శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో తొలు త మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా ఆది లాబాద్ జిల్లాను ముందంజలో నిలిపేం దుకు ప్రతి ఒక్కరు కృషి చేయలన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నారని, గ్రామాల అభివృద్ధితోనే మండలాలు, ఆపై జిల్లాలు, రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఒక్కొక్కరు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుం టూ సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో నెల కొన్న సమస్యల పరిష్కారం కోసం మన ఊరు మన ప్రణాళికలో గుర్తించిన పనులు చేపట్టేం దుకు ఆదిలాబాద్ జిల్లాకు ప్రభుత్వం రూ. 2,418 కోట్లు ఇవ్వనుందని వివరించారు. ఈ మేరకు ఈనెల 17 నుంచి 23వరకు ఏడు రోజు ల పాటు గ్రామాల్లో నిర్వహించనున్న గ్రామజ్యోతి కార్యక్రమంలో గ్రామస్తులు అధికారులకు సహకరించాలని మంత్రి జోగు రామన్న ఈ సందర్భంగా కోరారు. వసతుల కల్పనకే.. గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించడం కోస మే రాష్ట్ర ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజ లను చైతన్య వంతులను చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే అభివృ ద్ధి చెందిన గ్రామాలను ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామాలను తీర్చిదిద్దాలని కోరారు. సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇండ్లు నిర్మించనుండగా, ప్రతీ నియోజకవర్గంలో రూ.5లక్షల చొప్పున వెచ్చించి 500 గృహాలు నిర్మిస్తామని తెలిపారు. ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు హేమాజీ మాట్లాడుతూ గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీలు, ఎంపీటీసీలకు భాగస్యావమ్యులు చేసి నిధులు మంజూరు చేయూలని కోరారు. దండేపల్లి ఎంపీపీ మం జుల మాట్లాడుతూ ప్రభుత్వం ఓ పక్క మరుగుదొడ్లు నిర్మించుకోవాలని చెబుతూనే, ఇప్పటికే నిర్మించిన వాటికి బిల్లులు చెల్లించడం లేదని మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే, ఇందిరమ్మ ఇండ్లకు కూడా బిల్లులు రాలేదని తెలిపారు. ఇలాంటి సమస్యలపై గ్రామజ్యోతి సదస్సులో ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందించిన మంత్రి ఐకే.రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పై సీబీఐడీ విచారణ కొనసాగుతున్నందున బిల్లులు చెల్లించలేకపోతున్నామని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్, చెన్నూర్, ముథోల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నల్లాల ఓదేలు, విఠల్‌రెడ్డి, చిన్న య్య, జేసీ సుందర్ అబ్నార్, సీపీవో షేక్ మీరా, జెడ్పీ సీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో పోచయ్య, ఏఎస్పీలు రాధికాశర్మ, పనస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా
♦ ‘గ్రామజ్యోతి’ మార్గదర్శకాలు విడుదల చేసిన సర్కారు ♦ గ్రామాభివృద్ధికి ఏడు కమిటీలు ♦ పంచాయతీ స్థాయిలోనే ప్రణాళికలు ♦ గ్రామ సభ ఆమోదంతో అమలు ♦ అన్ని సంఘాలు, సంస్థల భాగస్వామ్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గ్రామజ్యోతి’ కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామాల సంపూర్ణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే ‘గ్రామజ్యోతి’ ప్రధాన ఆశయంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీలు సాధికారత సాధించాలంటే ఏడు కీలక రంగాలకు సంబంధించిన అభివృద్ధి జరగాలని ప్రభుత్వం భావిస్తోంది. తాగునీరు-పారిశుద్ధ్యం, ఆరోగ్యం-పోషకాహారం, విద్య, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణ, సామాజిక భద్రత-పేదరికాన్ని తగ్గించడం, వ్యవసాయం వంటివి ఇందులో ఉన్నాయి. ఆయా రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను గ్రామస్థాయిలోనే రూపొందించాల్సి ఉంది. ప్రణాళికల రూపకల్పనలో గ్రామాల్లో ఉండే స్వయం సహాయక గ్రూపులు, శ్రమశక్తి సంఘాలు, యువజన బృందాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రిటైర్డు ఉద్యోగులు, వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రతి రంగానికి ఒక కమిటీ ప్రతి గ్రామంలో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు నిమిత్తం ప్రతి రంగానికి తప్పనిసరిగా ఒక కార్యనిర్వాహక కమిటీ ని ఏర్పాటు చేయాలని సర్కారు సూచించింది. మండల/గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేసే అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ క మిటీలో ఒకరు లేదా కొందరు వార్డు సభ్యులు, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లీడరు, కుల సంఘం లేదా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే ఎన్జీవో ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమం సకాలంలో పూర్తయ్యేలా కమిటీలు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రణాళికల రూపకల్పన నిమిత్తం ఆ రంగానికి సంబంధించి వనరుల సమాచారం సేకరించాలి, అవసరాలను అంచనా వేయాలి, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలి. నిర్ణయం తీసుకోవడంలో అందర్నీ భాగస్వాములను చేసే పద్ధతులను పాటించాలి. ప్రణాళికను రూపొందించి గ్రామసభ ఆమోదం పొందాలి. కార్యక్రమాలు-ఫలితాలు :- పారిశుద్ధ్యం-తాగునీరు కమిటీ ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ సర్వే ద్వారా గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లను గుర్తించాలి. ప్రజల భాగస్వామ్యంతో మురుగునీరు, చెత్తకోసం డంప్‌యార్డులను గుర్తించాలి. చెత్తాచెదారాన్ని తొలగించాలి. దోమల వ్యాప్తిని నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. మలే రియా, డెంగీ, చికెన్ గున్యా, డయేరియా, కలరా, కామెర్లు వంటివి విజృంభించకుండా చర్యలు చేపట్టాలి. తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయించాలి. నల్లాద్వారా ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేయాలి. పైపులైన్ల లీకేజీని అరికట్టాలి. ఆరోగ్యం-పోషకాహారం ఈ కమిటీకి పంచాయతీలోని వార్డు సభ్యురాలిని చైర్మన్‌గా నియమించాలి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను సమన్వయపరచి వారు చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలి. తల్లులు, శిశువులు, వృద్ధుల ఆరోగ్య సమస్యలను ఏఎన్ఎం, ఆశావర్కర్లు తప్పనిసరిగా కమిటీకి, గ్రామసభకు రిపోర్టు చేయాలి. ప్రధానంగా గర్భిణులు, శిశు ఆరోగ్యం, జనరల్ హెల్త్ అంశాలపై కమిటీ దృష్టి సారించాలి. వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరిగేలా, శిశువులకు సంపూర్ణంగా వ్యాధి నిరోధకాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం ద్వారా మాతా శిశువులకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి. వ్యవసాయం గ్రామ ఉప సర్పంచ్‌ను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలి. సబ్సిడీ విత్తనాల పంపిణీ, భూసార ఆరోగ్య కార్డుల నిర్వహణ, సాగు యాంత్రీకరణ, వడ్డీలేనిరుణాలు, పావలా వడ్డీ రుణాలు, చేనేతలకు రుణాలు అందేలా చూడాలి. పెట్టుబడులు, రుణాలను పర్యవేక్షించి రైతులపై ఒత్తిడి తగ్గించాలి. సామాజిక భద్రత ఎస్సీ/ఎస్టీ మహిళను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలి. గ్రామంలోని నిరుపేదల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి. సంక్షేమ పథకాలు వినియోగించుకునేలా ప్రణాళికలు ఉండాలి. నిరుపేదలను ఎంపిక చేయడం ద్వారా ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని అర్హులకు అందించాలి. సహజ వనరుల నిర్వహణ ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రక్షిత వాతావరణం ఉండేలా గ్రామంలోని సహజ వనరులను పరిరక్షించాలి. ఉపాధి హామీ పథకంతో వాటర్షెడ్లు ఏర్పాటు చేయాలి. ‘హరిత హారం’ ద్వారా గ్రామంలో ఏటా 40వేల మొక్కలు నాటాలి. ఉపాధి హామీ ద్వారా గ్రామానికి శాశ్వత ఆస్తులను సృష్టించాలి. విద్యాకమిటీ గ్రామంలో 100 శాతం అక్షరాస్యత ఈ కమిటీ లక్ష్యం. ఆరు నుంచి 14 ఏళ్లలోపు చిన్నారులందరినీ పాఠశాలకు పంపాలి. మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులను ప్రీప్రైమరీలో చేర్చాలి. విద్యలో నాణ్యతను, మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. డ్రాపౌట్లను నియంత్రించాలి. వయోజన విద్యను మెరుగుపర్చాలి. మౌలిక సదుపాయాలు ఈ కమిటీకి సర్పంచ్ చైర్మన్‌గా ఉంటారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సమన్వయ పరచాలి. రోడ్లు, వీధి దీపాల నిర్వహణ ద్వారా మెరుగైన సేవలందించాలి. వంద శాతం ఇంటిపన్ను వసూలు ద్వారా పంచాయతీ సిబ్బందికి వేతనాలివ్వాలి. ఎస్సీ కాలనీలు, గిరిజన తండాల్లో వసతుల కల్పనకు సబ్‌ప్లాన్ నిధులు వినియోగించుకోవచ్చు. కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా.. పంచాయతీ కార్యదర్శి నుంచి కలెక్టర్ దాకా పాలనాధికారులు గ్రామజ్యోతిలో భాగస్వాములవ్వాలి. గ్రామాభివృద్ధి ప్రణాళికల కసరత్తుకు అధికారుల సూచనల మేర కు పంచాయతీ కార్యదర్శి ఏర్పాట్లు చేయా లి. మనఊరు-మన ప్రణాళిక తరహాలోనే గ్రామానికి ప్రత్యేకాధికారిని నియమిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో కన్వీనర్ ఉంటారు. డివిజన్ పరిధిలో డివిజినల్ పంచాయతీ అధికారి సమన్వయం చేసా రు. జిల్లాకు నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) ఉంటారు. -
‘మన ఊరు’ ఎక్కడో..!
‘గ్రామజ్యోతీ’ చెప్పగలవా..? మన ఊరు.. మన ప్రణాళికను తలపిస్తున్న కొత్త పథకం * క్షేత్రస్థాయిలో అవసరాలకు తగినట్లు ప్రణాళికల తయారీ * ప్రజల భాగస్వామ్యమే ప్రాతిపదికగా తాజాగా ‘గ్రామజ్యోతి’ * నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సదస్సు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్రామజ్యోతి కార్యక్రమం.. నిరుటి ‘మన ఊరు.. మన ప్రణాళిక’ను తలపిస్తోంది. గ్రామ ప్రణాళికలను మండలంలో... మండల ప్రణాళికలను జిల్లాలో... జిల్లా ప్రణాళికలను రాష్ట్ర స్థాయిలో ఆమోదించి బడ్జెట్‌కు రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. గతేడాది జూలై, ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి... ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ప్రణాళికలు తయారు చేసింది. ‘మా ఊళ్లో వీధులన్నీ సీసీ రోడ్లు చేయాలి. సీసీ డ్రైనేజీలు నిర్మించాలి. రక్షిత మంచినీటిని అందించేందుకు బోరు, వాటర్ ట్యాంక్ నిర్మించాలి. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. చెరువులకు మరమ్మతులు చేయాలి. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలి...’’ - ఇలా లక్షలాదిగా విన్నపాలు వెల్లువెత్తాయి. వీటిని సమకూర్చేందుకు సగటున ఒక్కో పల్లెలో ఎంత ఖర్చవుతుందనే అంచనాలు సైతం వేసింది. గంపగుత్తగా వచ్చిన డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు రాష్ట్ర ఏడాది బడ్జెట్ సైతం దాటిపోతుందని లెక్కతేలింది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఒక్కో గ్రామంలో కేవలం మూడు పనులను గుర్తించి.. ఇలా మండలాల్లోనూ, పట్టణాల్లోనూ జిల్లా స్థాయిలోనూ మళ్లీ ప్రణాళికలను తయారు చేయించారు. పంచాయతీ రాజ్ విభాగం ఆ వివరాలన్నింటినీ ఆన్లైన్లో పెట్టింది కూడా. అప్పటి లెక్కల ప్రకారమే గ్రామ స్థాయిలో గుర్తించిన 60,039 పనులకు రూ.17,634కోట్లు అవసరమని లెక్కతేలింది. తీరా రాష్ట్ర బడ్జెట్ తయారీ సమయంలో ‘మన ఊరు.. మన ప్రణాళిక’లను ప్రభుత్వం పక్కనబెట్టింది. రెండో ఏడాది బడ్జెట్ సమయంలోనూ వీటి ఊసెత్తలేదు. ఇప్పుడు కొత్తగా ‘గ్రామజ్యోతి’ పేరుతో ప్రణాళికల తయారీకి సిద్ధమవడం అప్పటి తతంగాన్ని గుర్తుకు తెస్తోంది. భారీ లక్ష్యంతో మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడంతో తొలి ఏడాదిలో చెరువుల మరమ్మతులు, రోడ్లు, డ్రైనేజీ పనులు కొన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయి. అవన్నీ కలిపినా పది శాతం లక్ష్యం కూడా నెరవేరలేదు. గ్రామస్థాయి ప్రణాళికల అమలు దిశగా ప్రయత్నం జరగలేదు. పదేళ్ల కిందటి.. 2005లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆగమేఘాలపై వీటిని రూపొందించి, నివేదికలు సిద్ధం చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం వీటికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధికారుల స్థాయిలోనే అటకెక్కాయి. ఇక గతేడాది టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన మన ఊరు-మన తెలంగాణ కార్యక్రమం సైతం నామమాత్రంగానే సాగింది. కానీ కేసీఆర్ అప్పటి తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు ఈసారి ‘గ్రామజ్యోతి’ పేరుతో ముందుకు వెళ్లనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లెల్లో పనులు చేపట్టడంతో పాటు భవిష్యత్ నిధుల కేటాయింపులకు పల్లె ప్రణాళికలను కీలకంగా భావించనున్నారు. నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సదస్సు.. ‘గ్రామజ్యోతి’ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, మండలాల చేంజ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న జిల్లాస్థాయి అధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇది పూర్తిగా అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమమని స్పష్టం చేసింది. అధికారులను సమన్వయం చేసుకుని, ప్రజల భాగస్వామ్యంతో ‘గ్రామజ్యోతి’ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులను కేసీఆర్ కోరారు.