‘మన ఊరు’ ఎక్కడో..! | CM Convention in Jayashanker Agricultural University Auditorium | Sakshi
Sakshi News home page

‘మన ఊరు’ ఎక్కడో..!

Published Tue, Aug 11 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

‘మన ఊరు’ ఎక్కడో..!

‘మన ఊరు’ ఎక్కడో..!

‘గ్రామజ్యోతీ’ చెప్పగలవా..?
మన ఊరు.. మన ప్రణాళికను తలపిస్తున్న కొత్త పథకం
 * క్షేత్రస్థాయిలో అవసరాలకు తగినట్లు ప్రణాళికల తయారీ
 * ప్రజల భాగస్వామ్యమే ప్రాతిపదికగా తాజాగా ‘గ్రామజ్యోతి’
 * నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సదస్సు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గ్రామజ్యోతి కార్యక్రమం.. నిరుటి ‘మన ఊరు.. మన ప్రణాళిక’ను తలపిస్తోంది.

గ్రామ ప్రణాళికలను మండలంలో... మండల ప్రణాళికలను జిల్లాలో... జిల్లా ప్రణాళికలను రాష్ట్ర స్థాయిలో ఆమోదించి బడ్జెట్‌కు రూపకల్పన చేయాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. గతేడాది జూలై, ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి... ప్రజలు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ప్రణాళికలు తయారు చేసింది. ‘మా ఊళ్లో వీధులన్నీ సీసీ రోడ్లు చేయాలి.

సీసీ డ్రైనేజీలు నిర్మించాలి. రక్షిత మంచినీటిని అందించేందుకు బోరు, వాటర్ ట్యాంక్ నిర్మించాలి. మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. చెరువులకు మరమ్మతులు చేయాలి. పాఠశాలలో సౌకర్యాలు కల్పించాలి...’’ - ఇలా లక్షలాదిగా విన్నపాలు వెల్లువెత్తాయి. వీటిని సమకూర్చేందుకు సగటున ఒక్కో పల్లెలో ఎంత ఖర్చవుతుందనే అంచనాలు సైతం వేసింది. గంపగుత్తగా వచ్చిన డిమాండ్లన్నీ నెరవేర్చేందుకు రాష్ట్ర ఏడాది బడ్జెట్ సైతం దాటిపోతుందని లెక్కతేలింది. దీంతో ప్రాధాన్యతా క్రమంలో ఒక్కో గ్రామంలో కేవలం మూడు పనులను గుర్తించి.. ఇలా మండలాల్లోనూ, పట్టణాల్లోనూ జిల్లా స్థాయిలోనూ మళ్లీ ప్రణాళికలను తయారు చేయించారు.

పంచాయతీ రాజ్ విభాగం ఆ వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పెట్టింది కూడా. అప్పటి లెక్కల ప్రకారమే గ్రామ స్థాయిలో గుర్తించిన 60,039 పనులకు రూ.17,634కోట్లు అవసరమని లెక్కతేలింది. తీరా రాష్ట్ర బడ్జెట్ తయారీ సమయంలో ‘మన ఊరు.. మన ప్రణాళిక’లను ప్రభుత్వం పక్కనబెట్టింది. రెండో ఏడాది బడ్జెట్ సమయంలోనూ వీటి ఊసెత్తలేదు.

ఇప్పుడు కొత్తగా ‘గ్రామజ్యోతి’ పేరుతో ప్రణాళికల తయారీకి సిద్ధమవడం అప్పటి తతంగాన్ని గుర్తుకు తెస్తోంది. భారీ లక్ష్యంతో మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడంతో తొలి ఏడాదిలో చెరువుల మరమ్మతులు, రోడ్లు, డ్రైనేజీ పనులు కొన్ని గ్రామాల్లో కొనసాగుతున్నాయి. అవన్నీ కలిపినా పది శాతం లక్ష్యం కూడా నెరవేరలేదు. గ్రామస్థాయి ప్రణాళికల అమలు దిశగా ప్రయత్నం జరగలేదు.
 
పదేళ్ల కిందటి..
2005లో కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అన్ని గ్రామాలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికలు తయారు చేయించారు. అన్ని మండలాల్లో అధికారులు ఆగమేఘాలపై వీటిని రూపొందించి, నివేదికలు సిద్ధం చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం వీటికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో అధికారుల స్థాయిలోనే అటకెక్కాయి.

ఇక గతేడాది టీఆర్‌ఎస్ సర్కారు చేపట్టిన మన ఊరు-మన తెలంగాణ కార్యక్రమం సైతం నామమాత్రంగానే సాగింది. కానీ కేసీఆర్ అప్పటి తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చేందుకు ఈసారి ‘గ్రామజ్యోతి’ పేరుతో ముందుకు వెళ్లనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లెల్లో పనులు చేపట్టడంతో పాటు భవిష్యత్ నిధుల కేటాయింపులకు పల్లె ప్రణాళికలను కీలకంగా భావించనున్నారు.
 
నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సదస్సు..

‘గ్రామజ్యోతి’ కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో  మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు, మండలాల చేంజ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న జిల్లాస్థాయి అధికారులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇది పూర్తిగా అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమమని స్పష్టం చేసింది. అధికారులను సమన్వయం చేసుకుని, ప్రజల భాగస్వామ్యంతో ‘గ్రామజ్యోతి’ని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులను కేసీఆర్ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement