జిల్లా బాస్‌లపై కసరత్తు.. | Collector, JC Job Chart On Review | Sakshi
Sakshi News home page

జిల్లా బాస్‌లపై కసరత్తు..

Published Fri, Sep 16 2016 1:09 AM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM

జిల్లా బాస్‌లపై కసరత్తు.. - Sakshi

జిల్లా బాస్‌లపై కసరత్తు..

సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పునర్వ్య వస్థీకరణతో మొత్తం 27 జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లను నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున ఐఏఎస్‌లు కావాల్సి ఉండటంతో ప్రస్తుతమున్న అధికారుల సర్దుబాటుపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాల ఆవిర్భావానికి ముందురోజే కలెక్టర్లు, ఎస్పీల నియామక ఉత్తర్వులు జారీచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. కొత్త జిల్లాలకు 54 మంది ఐఏఎస్‌లు, 27 మంది ఐపీఎస్‌లు అవసరమని లెక్కతేలుతోంది. ప్రస్తు తం 10 జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కలిపి 20 మంది ఐఏఎస్‌లున్నారు.

వీరితోపాటు ఆదిలాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున నలుగురు సబ్ కలెక్టర్లున్నారు. పలువురు మున్సిపల్ కమిషనర్లు, డెరైక్టర్లున్నారు. కొత్త జిల్లాలకు వీరిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత జిల్లాల్లో పనిచేస్తున్న జేసీలను కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమించేందుకు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీల పని తీరుపై సీఎం ఆరా తీస్తున్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, వాటి పురోగతి, లక్ష్య సాధనలో కలెక్టర్లు చూపించిన ప్రగతి నివేదికల ఆధారంగా పనితీరును అంచనా వేస్తున్నారు. హరితహారం లో ప్రతిభ కనబరిచిన నిజామాబాద్ కలెక్టర్‌ను ప్రభుత్వం ఇటీవల ప్రత్యేకంగా అభినందించింది.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, సన్నబియ్యం తదితర పథకాలన్నింటా ఇదే తీరుగా జిల్లాల మధ్య ప్రోత్సాహకర పోటీని పెంపొందించాలని సీఎం భావిస్తున్నారు. గిరి జన పథకాల అమలులో క్రియాశీల పాత్ర పోషిస్తున్న అధికారులను గిరిజన ప్రాబల్య జిల్లాలకు నియమించాలని, అటవీప్రాంతం ఉన్న జిల్లాలకు వాటిపై అవగాహన, ఆసక్తి ఉన్నవారిని కలెక్టర్లుగా నియమించాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల లక్ష్యం నెరవేరాలంటే ప్రజలకోణంలో పనిచేసే దృక్పథమున్న అధికారులకు ప్రాధాన్యమివ్వాలని యోచిస్తున్నారు. ఎస్పీల ప్రస్తుత పనితీరు ఆధారంగానే ఎవరికి పెద్ద జిల్లాల్లో పోస్టింగ్‌లివ్వాలి.. ఎవరికి కొత్త జిల్లాలను అప్పగించాలనే కోణంలో కసరత్తు జరుగుతోంది.
 
కలెక్టర్, జేసీల జాబ్‌చార్ట్‌పై సమీక్ష
కలెక్టర్లు, జేసీల జాబ్ చార్టులను పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌లకు ఈ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుత జాబ్ చార్ట్‌ను సమీక్షించి నివేదిక తయారు చేయాలని కోరింది. తదనుగుణంగా పాలనలో మార్పులు తేవాలని భావిస్తోంది.
 
ఐఏఎస్‌ల కొరత..
తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఐఏఎస్ కేడర్ సంఖ్య 208. కానీ ప్రస్తుతం 127 మంది ఐఏఎస్‌లే పనిచేస్తున్నారు. అదనంగా కేటాయించిన 45 మంది అధికారులను ఇప్పటికీ కేటాయించలేదు. దాంతో కొత్త జిల్లాలకు ఐఏఎస్‌ల కొరత తలెత్తనుంది. ఈ నేపథ్యంలో జేసీ పోస్టులకు ఐఏఎస్‌లకు బదులుగా నాన్ కేడర్ అధికారులను నియమించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కానీ నాన్‌కేడర్ పోస్టులను పరిగణనలోకి తీసుకునే పక్షంలో రెవెన్యూ విభాగం నుంచి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నవారిని ఆ పోస్టుల్లో నియమించొద్దని, గ్రూప్ వన్ అధికారులకు అవకాశమివ్వాలని గ్రూప్ వన్ ఆఫీసర్ల అసోసియేషన్ ఇప్పటికే ప్రభుత్వాన్ని కోరింది. దాంతో జేసీల నియామకంలో ప్రభుత్వం ఏ వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement