granite stone
-
త్రుటిలో తప్పిన ప్రమాదం
ప్రకాశం: ట్రాలీ లారీ నుంచి భారీ పరిమాణంలో ఉన్న గ్రానైట్ రాయి జారి కారు వెనుక భాగంపై పడటంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులకు ఊపిరి ఆగినంతపనైంది. ఈ సంఘటన చీమకుర్తి ఎన్ఎస్పీ కాలనీ శివారులో పారడైజ్ హోటల్ ఎదుట కర్నూలు రోడ్డుపై మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. రామతీర్థం క్వారీల నుంచి ఓ లారీ గ్రానైట్ బ్లాకులతో ఒంగోలు వైపు బయలుదేరింది. అదే సమయంలో చీమకుర్తి నుంచి రామతీర్థం వైపు కారు వెళ్తోంది. ఎన్ఎస్పీ కాలనీ శివారు వద్ద లారీ నుంచి భారీ గ్రానైట్ బ్లాక్ జారి కారు వెనుక భాగాన్ని రాసుకుంటూ కిందపడింది. అదే రాయి కారుపై పడి ఉంటే పరిస్థితి ఏమిటో ఊహించుకుంటేనే గుండె ఝల్లుమందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా, కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. కారు యజమాని కావటి నాగకిరణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్‌రెడ్డి తెలిపారు. -
మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ బండరాయి పడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. కురవి మండలం అయ్యగారిపల్లెలో ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. లారీ లోడ్ నుంచి గ్రానైట్ బండరాయి ఆటోపై పడడంతోనే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది. కూలీ పనులు ముగించుకుని వాళ్లంతా ఇంటికి వస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులంతా చిన్నగూడురు మండలం మంగోళిగూడెం వాసులుగా తెలుస్తోంది. -
ధ్రువపత్రాలు లేని 18 లారీలు పట్టివేత
సరైన ధ్రువపత్రాలు లేకుండా గ్రానైట్ రాయిని తరలిస్తున్న 18 లారీలను అధికారులు పట్టుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మామునూర్‌లోని నాయుడు పెట్రోల్ బంక్ వద్ద గురువారం ఉదయం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లారీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, అధిక మొత్తంలో గ్రానైట్‌ను తరలిస్తున్నట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి 18 లారీలను సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. సోదాల్లో డీటీఓ రంగారావు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటరమణారెడ్డి, ఎఫ్ఆర్వో అహ్మద్‌మియా, ఏసీటీవో సునీల్‌రెడ్డి పాల్గొన్నారు.